వాల్ ‌స్ట్రీట్‌కు వైరస్‌ షాక్‌

29 Oct, 2020 10:17 IST|Sakshi

పలు దేశాలను మళ్లీ వణికిస్తున్న కోవిడ్‌-19

3.5 శాతం పతనమైన యూఎస్‌ మార్కెట్లు 

కుప్పకూలిన క్రూయిజర్‌, ఎయిర్‌లైన్స్‌ షేర్లు

టెక్నాలజీ దిగ్గజాలలోనూ అమ్మకాలు

క్యూ3 ఫలితాలతో జనరల్‌ ఎలక్ట్రిక్‌ జూమ్‌

పలు దేశాలలో మళ్లీ కోవిడ్‌-19 కేసులు విజృంభిస్తుండటంతో బుధవారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. డోజోన్స్‌ 943 పాయింట్లు(3.4 శాతం) పడిపోయి 26,520కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 120 పాయింట్లు(3.5 శాతం) నష్టంతో 3,271 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 426 పాయింట్లు(3.75 శాతం) కోల్పోయి 11,005 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు నాలుగు నెలల కనిష్టాలకు అంటే జులై స్థాయికి చేరాయి. అమెరికా, రష్యాసహా యూరోపియన్‌ దేశాలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు ఒక్కసారిగా భారీ అమ్మకాలకు తెరతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రిటన్‌ బాటలో జర్మనీ, ఫ్రాన్స్‌లో లాక్‌డవున్‌లు విధించడంతో  అంతకుముందు యూరోపియన్‌ మార్కెట్లు సైతం 2.6-4 శాతం మధ్య కుప్పకూలినట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన భారీ ప్యాకేజీపై కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు వివరించారు. వచ్చే నెల మొదట్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలోగా ప్యాకేజీకి ఆమోదముద్ర పడుతుందని ఇన్వెస్టర్లు భావించినట్లు తెలియజేశారు. 

ఫాంగ్‌ స్టాక్స్‌ వీక్‌
ఫాంగ్‌ స్టాక్స్‌గా పేర్కొనే యాపిల్‌, అల్ఫాబెట్‌, ఫేస్‌బుక్‌ నేడు క్యూ3(జులై- సెప్టెంబర్‌) ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. బుధవారం అల్ఫాబెట్‌, ఫేస్‌బుక్‌ 5.5 శాతం, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ 5 శాతం, అమెజాన్‌ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా ఇంక్‌ 4.5 శాతం క్షీణించగా..ఎయిర్‌లైన్స్‌ కంపెనీలలో యునైటెడ్‌, సౌత్‌వెస్ట్‌, డెల్టా, అమెరికన్‌  4.6 -2.5 శాతం మధ్య నష్టపోయాయి. క్రూయిజర్‌ కౌంటర్లలో కార్నివాల్‌ 11 శాతం, రాయల్‌ కరిబియన్‌ 7.5 శాతం చొప్పున కుప్పకూలాయి. 

ఫార్మా డౌన్‌
కోవిడ్‌-19కు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్న ఫార్మా దిగ్గజాలలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో నోవావాక్స్‌ 9 శాతం, మోడర్నా ఇంక్‌ 7 శాతం, ఫైజర్‌ 5.3 శాతం, జీఎస్‌కే 4 శాతం, మెక్‌డొనాల్డ్స్‌ 3.7 శాతం, నోవర్తిస్‌, ఇంటెల్‌ కార్ప్‌ 3 శాతం, సనోఫీ 2.7 శాతం చొప్పున డీలా పడ్డాయి. అయితే ఈ ఏడాది క్యూ3లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో డైవర్సిఫైడ్‌ దిగ్గజం జనరల్‌ ఎలక్ట్రిక్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ షేరు పతన మార్కెట్లోనూ 5 శాతం దూసుకెళ్లింది. 

మరిన్ని వార్తలు