రిటైల్‌ స్టోర్ల ఏర్పాటు పట్ల ఆసక్తి లేదు

12 Mar, 2022 02:51 IST|Sakshi

ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పేలను బలోపేతం చేస్తాం

అమెరికా రిటైల్‌ సంస్థ వాల్‌మార్ట్‌ ప్రకటన

ముంబై: భారత్‌లో రిటైల్‌ స్టోర్ల ఏర్పాటు పట్ల ఆసక్తి లేదని అమెరికాకు చెందిన రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ ప్రకటించింది. కాకపోతే ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్, పేమెంట్స్‌ సేవల సంస్థ ఫోన్‌పే బలోపేతానికి కొనుగోళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది. కొన్నేళ్ల క్రితం 16 బిలియన్‌ డాలర్లు (రూ.1.20 లక్షల కోట్లు) వెచ్చించి ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే సంస్థలను వాల్‌మార్ట్‌ సొంతం చేసుకోవడం గమనార్హం. ‘‘మాకు ఓమ్నిచానల్‌ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌) వ్యూహం ఉంది. ఈ రెండూ ఉన్నప్పుడు కస్టమర్ల అనుభవం అవరోధాల్లేకుండా ఉంటుంది. కోరుకున్నప్పుడు స్టోర్‌కు వెళ్లి తీసుకునే సౌలభ్యం ఉంటుంది. కానీ, ప్రస్తుత దశలో మేము దానిపై దృష్టి సారించడం లేదు. ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే విజయవంతానికే కృషి చేస్తున్నాం’’ అని వాల్‌మార్ట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డగ్‌ మెక్‌మిల్లన్‌ ముంబైలో అంతర్జాతీయ వ్యాపార సదస్సు సందర్భంగా చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఐపీవో అంతిమ లక్ష్యం
ఫ్లిప్‌కార్ట్‌ ఐపీవో అన్నది అంతిమ లక్ష్యమంటూ, ఎప్పుడు దీన్ని తీసుకొచ్చేది ఆయన స్పష్టం చేయలేదు. ‘‘ఏదో ఒక సమయంలో ఐపీవో సరైన నిర్ణయం అని ఆరంభం నుంచి అనుకుంటూనే ఉన్నాం. కానీ, బలమైన పునాదిని మేం నిర్మించాల్సి ఉంది. సన్నద్ధత ఆధారంగా నిర్వహణ టీమ్‌ ఆ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం. ఐపీవోకు సంబంధించి వ్యూహాత్మక నిర్ణయాలను ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పేకు సంబంధించి స్థానిక నాయకత్వాలే తీసుకుంటాయి’’ అని మెక్‌మిల్లన్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు