వార్నింగ్‌: మాల్‌వేర్‌ వచ్చేసింది.. మీ మొబైల్‌లో ఆ యాప్స్‌ ఉంటే వెంటనే డెలీట్‌ చేయండి!

6 Sep, 2022 18:10 IST|Sakshi

గత ద​​‍శబ్ద కాలంగా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే దీని వల్ల బోలెడు లాభాలు ఉన్నా అప్రమత్తంగా లేకపోతే నష్టాలు కూడా ఉంటాయని సైబర్‌ నిపుణులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. తాజాగా గూగుల్‌ ప్లేస్టోర్‌లో మాల్వేర్ షార్క్‌బాట్ (SharkBot Malware) అనే వైరస్‌ ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. ఇది యాంటీవైరస్, క్లీనర్‌ వంటి యాప్‌ల రూపంలో ఉంటుంది.

ఇన్‌స్టాల్‌ చేస్తే ఇక అంతే..
అల్బెర్టో సెగురా అనే మాల్వేర్ విశ్లేషకుడు ఆండ్రాయిడ్ యూజర్లను అప్రమత్తం చేసేందుకు తన ట్విట్టర్‌లో ఈ డేంజరెస్‌ సాఫ్ట్‌వేర్ గురించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో.. ప్రధానంగా ఇది మిస్టర్‌ ఫోన్‌ క్లీనర్‌( Mister Phone Cleaner), కైల్‌హావీ మొబైల్‌ సెక్యూరిటీ ( Kylhavy Mobile Security) యాప్‌ల రూపంలో దాగి ఉంటుంది. ముఖ్యంగా యూజర్ల బ్యాంకింగ్, క్రిప్టో సంబంధిత యాప్‌లను ప్రభావితం చేస్తుందన్నారు. అంతేకాకుండా అకౌంట్స్‌ నుంచి కుకీలను దొంగిలించగలదని చెప్పారు. ఈ మాల్వేర్ షార్క్‌బాట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, డివైజ్‌లోని 'ఫింగర్‌ప్రింట్‌తో లాగిన్' ఫీచర్‌ని పని చేయకుండా చేస్తుంది. దీంతో యూజర్‌ తప్పకుండా తన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 

దీంతో యూజర్లు పాస్‌వర్డ్, యూజర్‌ డీటైల్స్‌ను ఎంటర్‌ చేయాల్సి వస్తుంది. షార్క్‌బాట్‌ టూ- ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను కూడా అధిగమించగలదు. చివరికి ఈ మాల్‌వేర్‌ ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ టెక్నిక్ ఉపయోగించి యూజర్‌ అకౌంట్‌ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయడం ప్రారంభిస్తుంది. కనుక ఆ రెండు యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసేముందు జాగ్రత్త వహించాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. గణాంకాల ప్రకారం, మిస్టర్‌ ఫోన్‌ క్లీనర్‌ యాప్‌ని ఇంతవరకు 50,000 పైగా డౌన్‌లోడ్‌ నమోదు కాగా, Kylhavy మొబైల్ సెక్యూరిటీ యాప్ భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, ఈ యాప్‌ 10,000 కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు