ఉతికేస్తున్న వాషింగ్‌ మెషీన్లు.. ఈ ఏడాది 60 లక్షల సేల్స్‌!

24 Sep, 2022 07:06 IST|Sakshi

2–3 ఏళ్లలో రెండంకెల వృద్ధి 

వర్ల్‌పూల్‌ ఇండియా ఎండీ విశాల్‌ 

న్యూఢిల్లీ: దేశీయంగా వాషింగ్‌ మెషీన్ల అమ్మకాలు రెండు మూడేళ్లలో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాయని వర్ల్‌పూల్‌ వెల్లడించింది. మధ్య స్థాయి, ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్‌ పెరగడమే ఇందుకు కారణమని సంస్థ ఇండియా ఎండీ విశాల్‌ భోలా తెలిపారు. ‘గడిచిన రెండేళ్లలో మార్కెట్‌ చాలా అస్థిరంగా ఉంది. రాబోయే రెండు మూడు సంవత్సరాలలో వాషింగ్‌ మెషీన్ల విభాగం రెండంకెలలో పెరుగుతుందని అంచనా.

వాషింగ్‌ మెషీన్ల విస్తృతి ప్రస్తుతం 14 శాతమే. ఈ ఏడాది భారత్‌లో అన్ని కంపెనీలవి కలిపి 60 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదవుతాయని మార్కెట్‌ ఆశిస్తోంది. వచ్చే పదేళ్లలో ఈ విభాగంలో భారీ అవకాశాలు ఉన్నాయి. 30 శాతం వాటా ఉన్న ఫ్రంట్‌ లోడ్‌ విభాగంలోకి వర్ల్‌పూల్‌ ప్రవేశిస్తోంది. కంపెనీ వృద్ధికి చోటు ఉంది’ అని పేర్కొన్నారు. 

అధిక సామర్థ్యం, ఫీచర్లు..
మిడ్, ప్రీమియం సెగ్మెంట్‌ వినియోగదారులు అధిక సామర్థ్యం, అధిక ఫీచర్లున్న ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని విశాల్‌ తెలిపారు. తద్వారా వృద్ధిని నడిపిస్తున్నారని చెప్పారు. ‘ప్రవేశ స్థాయిలో వినియోగదారులు చాలా విచక్షణతో ఉన్నారు.

ఇక గృహోపకరణాల విషయంలో కంపెనీ అంచనా సానుకూలంగా ఉంది. అధిక సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లను కస్టమర్లు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు అదే మార్కెట్లో ఎంట్రీ లెవల్‌ వినియోగదారులు తమకు గొప్ప విలువను అందించే మోడళ్లను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు. సంస్థ మొత్తం అమ్మకాల్లో పండుగల సీజన్‌ వాటా 40 శాతం. మహమ్మారి కాలంలో దూసుకెళ్లిన ఆన్‌లైన్‌ విభాగం వృద్ధి ప్రస్తుతం స్థిరంగా ఉంది. ఆన్‌లైన్‌ వాటా 10–15 శాతానికి వచ్చి చేరింది’ అని వివరించారు.

చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్‌ భారీ షాక్‌.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!

మరిన్ని వార్తలు