ఇంత ధర అంటే కష్టం బాస్‌.. పైగా ప్రమాదాలు కూడానూ..

20 May, 2022 08:51 IST|Sakshi

ఈ–టూ వీలర్లు ఖరీదైనవే 

సురక్షితం కాదంటున్న అత్యధికులు 

ప్రమాదాలతో అమ్మకాలపై ప్రభావం 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రోజురోజుకీ అధికం అవుతున్న ఇంధన భారాన్ని తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇంకేముంది ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ఈవీ కొనుగోలుదార్లకు సబ్సిడీలను ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ రంగంలోకి కొత్త కంపెనీలూ పుట్టుకొస్తున్నాయి. పరిశోధన, తయారీ అనుభవం లేకుండా మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రిక్‌ టూ వీలర్లు అగ్నికి ఆహుతై ప్రాణాలనూ బలిగొనడం ఆందోళన కలిగిస్తోంది.

జనాభిప్రాయం
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఇన్ఫోటైన్మెంట్‌  యాప్‌ వే2న్యూస్‌ సర్వే నిర్వహించింది. ఈ–టూ వీలర్లు సురక్షితం కాదన్న అభిప్రాయాన్ని అత్యధికులు వెల్లడించారు. ఈ వాహనాలు ఖరీదైనవని, తక్కువ ధరలో లభిస్తే కొనుగోలుకు సిద్ధమన్న సంకేతాలను ఇస్తూనే అధిక దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం ఉండాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1,50,886 మంది సర్వేలో పాల్గొన్నారు. వీరిలో చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 92.5 శాతం ఉండడం గమనార్హం.  

భవిష్యత్‌ ఈవీలదే..  
ఎలక్ట్రిక్‌ టూ వీలర్లు సురక్షితం కాదని 57 శాతం మంది తేల్చి చెప్పారు. ఈ వాహనాల అగ్ని ప్రమాదాలు దీర్ఘకాలంలో వాటి అమ్మకాలపై ప్రభావం చూపుతాయని 1.14 లక్షల మంది (75.9 శాతం) స్పష్టం చేశారు. భవిష్యత్‌ మాత్రం ఎలక్ట్రిక్‌దేనని మూడింట రెండొంతుల మంది వెల్లడించారు. కొత్త కంపెనీకి బదులు ఇప్పటికే ద్విచక్ర వాహన రంగం లో ఉన్న సంస్థ నుంచి ఈవీ కొనుగోలుకు 55 శాతం పైగా ఆసక్తి చూపారు. 

ధర ఎక్కువ
ఈ–స్కూటర్లు ఖరీదైనవని మూడింట రెండొంతుల మంది అభిప్రాయపడ్డారు. తక్కువ ధరలో లభించే మోడళ్లకే అత్యధికులు మొగ్గు చూపారు. రూ.50 వేల లోపు ధర కలిగిన  ఈ–టూ వీలర్‌ కొనుగోలుకు 71 వేల మంది ఆసక్తి కనబరిచారు. వాహనం ఫుల్‌ చార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉండాలని 66 వేల మంది అభిప్రాయపడ్డారు.  దేశంలో ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో ఈ–టూ వీలర్ల అమ్మకాలు సుమారు 1 శాతం తగ్గి 49,166 యూనిట్లకు చేరుకున్నాయి. 

చదవండి: ఎలక్ట్రిక్‌ స్కూటర్లు తగలబడటానికి కారణాలు ఇవి ..

మరిన్ని వార్తలు