కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే..

7 Mar, 2022 03:38 IST|Sakshi

వ్యయ నియంత్రణకు సమయం వృథా చేయొద్దు

ఉత్పాదకత పెంపుపై దృష్టి పెట్టాలి

నైపుణ్యాలపై ఇన్వెస్ట్‌ చేయాలి

మార్గదర్శకుల సాయం తీసుకోవాలి

రెండో ఆదాయానికి మార్గాలున్నాయి

ప్యాసివ్‌ ఆదాయానికీ ఎన్నో దారులు

రోజులో 10–12 గంటలు, ఎంతో సిన్సియర్‌గా పనిచేసినా, లాభం లేదు.. ఆదాయం అక్కడక్కడే.. ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది..! రూపాయి కూడా మిగలడం లేదు.. ఇలాంటి నిట్టూర్పు, నిరాశా వాతావరణం కొందరిలో కనిపిస్తుంటుంది. ఎప్పుడూ తమ గురించి ఇలా అనుకోవడమే కానీ, పట్టుబట్టి కారణాలేంటని? విశ్లేషించుకుని, సమీక్షించుకునేది కొద్ది మందే ఉంటారు. జీవితంలో మరింత పురోగమనం చెందాలంటే? అందుకు ఎక్కువ గంటలు పనిచేయడం ఒక్కటే ప్రామాణికం కాబోదు. తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందా..? ఆదాయం పెంచుకునే మార్గాలేంటి?.. సమీక్షించుకుని సరైన దిశలో అడుగులు వేస్తే మార్పుకు ఆహ్వానం పలికినట్టే..  

వృద్ధి లేకపోవడానికి కారణాలు
కొందరు వ్యయాలను నియంత్రించుకోవడంలోనే బిజీగా కనిపిస్తుంటారు. మరికొందరు ఆదాయం పెంచుకునే మార్గాలపైనే దృష్టి పెడతారు. ఖర్చుల నియంత్రణకు సమయం వృ«థా చేయకుండా, ఆదాయం పెంచుకోవడానికే ఆ సమయాన్ని ఖర్చు చేస్తారు. ఇందులో మీరు ఏ రకం అన్నది ప్రశ్నించుకోవాలి. ఆదాయం పెంచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, వ్యయ నియంత్రణ పూర్తిగా మన చేతుల్లో ఉండకపోవచ్చు. కూరగాయలు, గ్రోసరీ, స్కూలు ఫీజులు, పెట్రోల్‌ చార్జీలు, ఇంటి అద్దె వీటిల్లో ఏవీ మన నియంత్రణలో ఉండేవి కావు. ఏ మార్గంలో వెళితే, ఎలా పనిచేస్తే ఆదాయం పెరుగుతుంది? అనేది విశ్లేషించుకోవాలి.

► నిందలతో కాలయాపన చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఈ ఏడాది ‘నాకు కచ్చితంగా పదోన్నతి రావాలి. కానీ, ఆఫీసు రాజకీయాలు దానికి నన్ను దూరం చేశాయి. ఆ ఆర్డర్‌ నాకు రావాల్సింది. నా పోటీదారు తన్నుకుపోయాడు’ ఈ తరహా ఆక్షేపణలతో వచ్చేది ఏమీ ఉండదు. ఎందుకు రాలేదో? నిజాయితీగా విశ్లే షించుకుని, కారణాలను గుర్తించినప్పుడే అదే అనుభవం పునరావృతం కాకుండా ఉంటుంది.  
► నాకేంటి? ఏ పని చేసినా అందులో నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ ఆలోచన కూడా ఆదాయం పెరగకపోవడానికి, అవకాశాలను గుర్తించకపోవడానికి అడ్డుగా ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. ఒక ఉదాహరణ చూద్దాం. ఇద్దరు మిత్రులు ఒక హోటల్‌కు వెళ్లారు. అక్కడ వెయిటర్లు కొందరు ఎవరు టిప్‌ ఇస్తారన్న దానిపైనే శ్రద్ధ చూపిస్తూ, టిప్‌ కోసమే పనిచేస్తున్నారు. కానీ, వారికి టిప్‌ అనుకున్నంత రావడం లేదు. కొందరు శ్రద్ధతో, గౌరవంగా, వేగంగా వచ్చిన వారికి కావాల్సినవి అందిస్తూ, వారిని సంతోష పెట్టడంపై దృష్టి పెట్టారు. వారికి బోలెడంత టిప్‌ వస్తోంది. ఇక్కడ కార్యాచరణే ఫలితమిస్తుంది. అంచనాలు కాదు. ఆదాయం పెంచుకోవాలని ఉంటుంది. అందుకు ఫలితం ఇవ్వని చోట వెతుక్కుంటే ప్రయోజనం ఏముంటుంది?
► అధిక ఆదాయం ఆశిస్తున్నప్పుడు మీ ఉత్పాదకత ఏ పాటిది? అని ప్రశ్నించుకున్నారా! నైపుణ్యాలు పెంచుకోకుండా వృద్ధి కోరుకోవడం అత్యాశ అవుతుందేమో ఆలోచించాలి. కొందరు తమ నైపుణ్యాలపై పెట్టుబడి పెడుతుంటారు. ఏటా కొంత మొత్తాన్ని పక్కన పెడుతూ, ఆ మొత్తాన్ని నైపుణ్యాల వృద్ధికి ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. మారుతున్న అవసరాలకు అనగుణంగా మీ నుంచి ఉత్పత్తి ఉండాలి. అప్పుడే పురోగతి సాధ్యపడుతుందని గుర్తించాలి.
► మార్గదర్శి లేకపోవడం? చాలా మందికి జీవితంలో మంచి, చెడులు చెప్పి, సరైన మార్గంలో నడిపించే మార్గదర్శకులు ఉండరు. సొంతంగా చేయడం తప్పించి, పెద్దగా ఉండదు. ఒక మార్గదర్శి ఉంటే వచ్చే ఫలితాలు వేరు. ఒక రచయితకు మార్గదర్శి ఉంటే ఎప్పటికప్పుడు మెరుగుపడడానికి వీలుంటుంది. ఒక ఇన్వెస్టర్‌ తాను సొంతంగా ఇన్వెస్ట్‌ చేస్తే ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. అప్పటికే పెట్టుబడుల స్వరూపం పూర్తిగా అర్థం చేసుకుని, చక్కని పరిజ్ఞానం ఉన్న వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వచ్చే ఫలితాలు భిన్నంగా ఉంటాయి.  
► ఏ పని చేస్తున్నారు?.. చేసే పనులను బట్టే ఆదాయం ఆధారపడి ఉంటుంది. చేస్తున్న పనిని ఎక్కువ ఫలితం ఇచ్చేవి, తక్కువ ఫలితం ఇచ్చేవి, అసలు ఫలితం ఇవ్వనివి అంటూ మూడు రకాలుగా నిపుణులు చూస్తారు. ఆదాయం పెంచుకోలేని వారిలో ఎక్కువ మందిని గమనించినప్పుడు.. వారు చేసే పనులు ఫలితాన్ని ఇవ్వనివే ఉంటున్నాయి. మీరు చేస్తున్నది కూడా ఇదే అయితే సరిదిద్దుకోవడం ఒక మార్గం.  
► మెచ్చేలా పనిచేయకపోవడం! కొందరు ఉద్యోగులు కంపెనీని వీడుతుంటే.. కంపెనీయే బతిమిలాడే సందర్భాలు కనిపిస్తాయి. కొందరు కొన్ని అవసరాలకు ఎప్పుడైనా ఒకటే దుకాణానికి వెళుతుంటారు. అక్కడ లేకపోతేనే మరొక దుకాణం చూసుకుంటారు. అక్కడ ఆ వర్తకుడు అందించే సేవలు, దుకాణాదారు నిర్వహణ, మాటతీరు, ఎక్కువ శ్రేణిలో ఉత్పత్తులు ఉండ డం కారణం ఏదైనా కావచ్చు. అలాంటి ప్రత్యేకతలు చేస్తున్న పనిలో మీరు చూపిస్తే ఆదాయం వృద్ధి చెందుతుందేమో పరిశీలించాలి.  

మార్పు దిశగా అడుగులు
► మీరు చేస్తున్న పనికి పారితోషికం పెరగాలంటే లేదా బ్యాంక్‌ బ్యాలన్స్‌ పెరగాలంటే ముందు ఆలోచనల పరిధిని విస్తృతం చేసుకోవాల్సి ఉంటుంది. గొప్ప ఆలోచనలకు చోటు ఇవ్వాలి. మీ పరిధిని విస్తృతం చేసి, ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించండి.  
► పనికి సృజనాత్మక జోడించుకోవాలి. మీకు అప్పగించిన పనిని సాధారణంగా చేసుకుపోవడం వేరు. దాన్ని భిన్నంగా, ఆకర్షణీయంగా చేయడం వేరు. మీకు అప్పగించిన పని.. మీరేంటన్నది చూపించుకునే వేదిక. ఇచ్చిన పనికి ఎంత విలువ జోడించామన్నది కీలకం అవుతుంది. మీకు పని అప్పగిస్తే ప్రశాతంగా నిద్రపోవచ్చు? అన్న నమ్మకం కలిగించారంటే సంస్థకు విలువైన ఆస్తియే అవుతారు. అప్పుడు ఆదాయం దానంతట అదే పెరుగుతుంది. ఖర్చయినా మీకే ప్రాధాన్యం ఇస్తారు. ఆ నైపుణ్యాలు లేకపోతే వాటిని తెచ్చుకోవడంపై ఫోకస్‌ పెట్టాలి. పనిలో నైపుణ్యాలను పెంచుకునే మార్గాలు కచ్చితంగా ఉంటాయి. సంస్థ కంటే ముందు మీరు మీ పనిలో కొత్తదనాన్ని కోరుకోవడం సానుకూల ఫలితాలను ఇస్తుంది.  
► మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడం కూడా ఆదాయం పెంచుకోవడానికి మార్గం అవుతుంది. చేస్తున్న పనిలోనే కొత్త అవకాశాలను వెతుక్కోవాలి. వాటిని సంస్థతో పంచుకోవాలి. మీ నుంచి వచ్చే ఒక్క ఆవిష్కరణ సక్సెస్‌ అయినా, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.  
► ఎంత ప్రయత్నించినా చేస్తున్న పనిలో ఆదాయం పెంచుకోవడం సాధ్యపడడం లేదన్న వారికి మరో ఆదాయ మార్గాన్ని వెతుక్కోవడం ఒక పరిష్కారం కావచ్చు. అయితే, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం లేదా వృత్తికి అదనంగా, రెండో ఆదాయం కోసం ఎంత సమయం కేటాయించగలరనేది ఇక్కడ కీలకం అవుతుంది.
► సమయం చాలడం లేదు? ఈ డైలాగ్‌ ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంటుంది. ఏది చేయాల న్నా వచ్చే సమాధానం ఇదే. పని ప్రదేశంలో ఉ త్పాదకతకు తోడ్పడని, అదనపు కాల హరణంతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని గుర్తు ంచుకోవాలి. సమయాన్ని వృ«థా చేయకుండా, సద్వినియోగం చేసుకోవడం విజయానికి, అదనపు ఆదాయానికి పునాదిగా గుర్తించాలి.  
► అదనపు ఆదాయ వనరులు ఎన్నో ఉన్నాయి. మీరు ఎందులో నిపుణులు అయితే ఆ విభాగానికి సంబంధించి అధ్యాపకులుగా మారొచ్చు. ఆన్‌లైన్‌ బోధన చేపట్టవచ్చు. ఫ్రీలాన్స్‌ వర్క్, డిజిటల్‌ మార్కెటింగ్‌ లేదా ఆలోచనలో పదునుంటే స్టార్టప్‌ పెట్టేయవచ్చు. ఒక్కసారి ఆలోచన చానల్‌ తెరుచుకుంటే రెండో ఆదాయానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి.  

ఆదాయ మార్గాలు..
పార్ట్‌టైమ్‌/ఫ్రీలాన్స్‌ వర్క్‌ ద్వారా రెండో ఆదాయానికి ఎన్నో మార్గాలున్నట్టే.. అసలు కష్టపడకుండా ఆదాయం సమకూర్చి పెట్టే ‘ప్యాసివ్‌’ మార్గం కూడా ఒకటి ఉంది.   
  ► రెండు ప్రాపర్టీలు ఉంటే ఒకదానిని అద్దెకు ఇ వ్వడం ద్వారా ప్యాసివ్‌ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. కార్యాలయ స్థలం ఉన్నా, అందులో కొత భాగాన్ని అద్దెకు ఇచ్చినట్టయితే అలా కూ డా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. లేదంటే బ్యా ంకు డిపాజిట్లలో పెద్ద మొత్తంలో ఉంటే వెన క్కి తీసుకుని ప్రాపర్టీని సమకూర్చుకోవాలి.  
► బిల్డింగ్‌లో చిన్న స్పేస్‌ను ఏటీఎం కేంద్రానికి అద్దెకు ఇచ్చుకున్నా చక్కని ఆదాయ వనరు ఏర్పడుతుంది. పట్టణాల్లో ఏటీఎం కేంద్రానికి బ్యాంకులు నెలవారీగా రూ.25–50వేల వరకు చెల్లిస్తున్నాయి.  
► పార్కింగ్‌ స్థలాన్ని అద్దెకు ఇవ్వడం కూడా మంచి ఐడియా. అదనపు పార్కింగ్‌ స్లాట్లను కొనుగోలు చేసి, ఇతరులకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. పట్టణాల్లో ఖాళీ ప్లాట్‌/స్థలం ఉన్నా అందులో రూపాయి పెట్టుబడి పెట్టుకుండా పార్కింగ్‌కు అద్దెకు ఇచ్చినా మంచి ఆదాయం సమకూరుతుంది. అందరికీ ప్రాపర్టీ ఉండాలని లేదు. కానీ, మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు.. పట్టణానికి శివారులో అయినా ప్రాపర్టీని సమకూర్చుకుని, దానిపై ఆదాయం తెచ్చుకునే మార్గం గురించి ఆలోచిస్తే మార్గం కనిపించొచ్చు.  
► భవనంపైన, టెర్రాస్‌లో హోర్డింగ్‌కు స్థలాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూరుతుంది. రహదారికి సమీపంలో మీకు ఇల్లు/స్థలం ఉంటే చాలు.  
► వడ్డీ ఆదాయానికి ప్యాసివ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడినిచ్చే సాధనాలనే ఎంపిక చేసుకోవాలి. బ్యాంకు సేవింగ్స్‌ డిపాజిట్,  
► స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి వచ్చే డివిడెండ్‌ ఆదాయం మరొక మార్గం. డివిడెండ్‌ ఆదాయం అన్నది ఆయా కంపెనీల పనితీరు, మార్కెట్‌ పరిస్థితులు, దేశ ఆర్థిక పరిస్థితులకు ప్రభావితం అవుతుందని గుర్తించాలి.   
► కార్లు, వ్యాన్‌లను కొనుగోలు చేసి, కంపెనీలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం లభిస్తుంది.  
► కష్టమా, సుఖమా.. ఎంత మిగులుతుంది? ఇలాంటి వాటికి చోటు ఇవ్వకుండా కృషితో మీకు తోచినది ప్రారంభించండి. మంచి ఫలితమే ఎదురవుతుంది.

మరిన్ని వార్తలు