కేటీఆర్‌ చేసిన ఆ పనికి పారిశ్రామికవేత్తలు ఫిదా

23 Sep, 2021 15:09 IST|Sakshi

పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్టైలే వేరు. పారిశ్రామికవేత్తలను కలవడం దగ్గర నుంచి పెట్టుబడులకు వారిని ఒప్పించడం వరకు మంత్రిగా ఎంతో చొరవ చూపిస్తారు. ఇటీవల ఆయన చేసిన ప్రయత్నం దేశవ్యాప్తంగా అనేక మంది ఇండస్ట్రియలిస్టులను ఆకట్టుకుంటోంది. తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్యశాఖ మంత్రి కేటీఆర్‌ పనితీరుని నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు.

చిన్నపిల్లల దుస్తుల తయారీ రంగంలో అమెరికాకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న కైటెక్స్‌ సంస్థ కేరళలో వస్త్ర పరిశ్రమ నెలకొల్పే ప్రయత్నాల్లో ఉండగా అనుమతుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. దీంతో ఆ సంస్థ అక్కడ పరిశ్రమ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ విషయం పత్రికల్లో చదివిన మంత్రి కేటీఆర్‌ వెంటనే కైటెక్స్‌ సంస్థ ఎండీ సాబు జాకబ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అంతటితో ఆగలేదు. సాబు జాకబ్‌ హైదరాబాద్‌ వచ్చేందుకు ప్రత్యేకంగా విమానం కూడా ఏర్పాటు చేశారు. అలా తెలంగాణ వచ్చిన సాబు జాకబ్‌ వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో రూ.2,400 కోట్ల వ్యయంతో రెండు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

ఓ బిజినెస్‌మాన్‌ను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ప్రైవేట్‌ ఫ్లైట్‌ పంపించడాన్ని ప్రశంసిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త హార్ష్‌ గోయెంకా ట్వీట్‌ చేశారు. గోయెంకా ట్వీట్‌కి దేశవ్యాప్తంగా చాలా మంది నెటిజన్లు  స్పందించారు. మంత్రి కేటీఆర్‌ పనితీరుని మెచ్చుకున్నారు.

హర్ష్‌ గోయెంకా ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. పారిశ్రామిక వేత్తలను గౌరవించడం మన విధి అని చెబుతూ.. అలా చేయడం ద్వారా త్వరగా ఉపాధి కల్పించడంతో పాటు సంపదను పెంచేందుకు అవకాశం లభిస్తుందని బదులిచ్చారు. దీనికి ప్రతిగా మీ లాంటి నేతలు ఈ దేశానికి కావాలంటూ హర్ష్‌ అన్నారు. 

చదవండి : ‘కైటెక్స్‌’ పెట్టుబడి మరో 1,400 కోట్లు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు