స్టాక్‌ మార్కెట్‌లో రికార్డుల ర్యాలీ.. ఈ అంశాలే కీలకం

30 Aug, 2021 08:26 IST|Sakshi

ఈ వారం మార్కెట్‌ గమనంపై స్టాక్‌ నిపుణులు అభిప్రాయం 

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఈ వారంలోనూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగవచ్చని స్టాక్‌ నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అధిక ధరల వద్ద ట్రేడ్‌ అవుతున్న షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయ డేటాతో పాటు ప్రపంచ పరిమాణాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేస్తాయని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, కోవిడ్‌ కేసులు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలు కూడా సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. వీటితో పాటు డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. 

నిఫ్టీ పైపైకి 
‘‘జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో సూచీల రికార్డు ర్యాలీ కొనసాగవచ్చు. లాభాల స్వీకరణ జరగకపోతే నిఫ్టీ 16,900 స్థాయిని అందుకుంటుంది. దిగువస్థాయిలో 16,550 వద్ద బలమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నిరాళీ షా తెలిపారు.   మార్కెట్‌ను ప్రభావితం చేసే ఇతర అంశాలను పరిశీలిస్తే..,   

క్యూ1 జీడీపీ గణాంకాలపైనే అందరి దృష్టి ... 
కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికపు (ఏప్రిల్‌–జూన్‌) జీడీపీ గణాంకాలను మంగళవారం విడుదల చేయనుంది. లో బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా (2020 ఇదే కాలంలో 24 శాతంపైగా క్షీణత) క్యూ1లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని అర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంచనాలు ఏమాత్రం తారుమారైనా మార్కెట్‌లో ఒడిదుడుకులు తప్పవని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. 

ఇతర స్థూల ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు...  
ఆటో కంపెనీలు ఆగస్ట్‌ వాహన విక్రయ గణాంకాలను బుధవారం విడుదల చేయనున్నాయి. దేశీయంగా కోవిడ్‌ ఆంక్షల సడలింపుతో ఉత్పత్తి ఊపందుకుంది. పలు దేశాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షల ఎత్తివేతతో ఎగుమతులు పెరిగాయి. ఈ పరిణామాలతో ఆటో అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జూలై నెల మౌలిక రంగ పనితీరు, ద్రవ్యలోటు గణాంకాలు ఈ మంగళవారం విడుదల కానున్నాయి. ఇక సెప్టెంబర్‌ 1వ తేదిన (బుధవారం) ఆగస్ట్‌ నెలకు సంబంధించిన మార్కిట్‌ పారిశ్రామిక రంగ పీఎంఐ గణాంకాలు, ఆగస్ట్‌ మాసపు సేవల రంగపు డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. అదే శుక్రవారం ఆర్‌బీఐ ఆగస్ట్‌ 27వ తేదితో ముగిసే ఫారెక్స్‌ నిల్వలను ప్రకటించనుంది. 

ఈ వారంలో రెండు ఐపీఓలు...  
ఈ వారంలో ఒకే రోజున రెండు కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ అమీ ఆర్గానిక్స్,  హెల్త్‌ కేర్‌ సేవల సంస్థ విజయా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ పబ్లిక్‌ ఇష్యూలు సెప్టెంబర్‌ 1న మొదలై, మూడవ తేదీన ముగియనున్నాయి. ఈ రెండు ఇష్యూలు ప్రాథమిక మార్కెట్‌ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.2,465 కోట్లను సమీకరించనునున్నాయి. 

4 నెలల తర్వాత తొలిసారి కొనుగోళ్లు
నాలుగు నెలల వరుస అమ్మకాల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) ఈ ఆగస్ట్‌లో తొలిసారి నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి ఎఫ్‌ఐఐలు ఈ ఆగస్టులో రూ.986 కోట్ల షేర్లను కొన్నారు. డెట్‌ మార్కెట్లో రూ.13,494 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. అంచనాలకు కంటే ముందుగా వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఫెడ్‌ రిజర్వ్‌ సంకేతాలు ఇవ్వడంతో భారత్‌తో పాటు వర్థమాన దేశ మార్కెట్లలోకి చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదని మార్నింగ్‌స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ హెడ్‌ శ్రీవాస్తవ తెలిపారు.   

చదవండి : కేంద్రం చెబుతున్న మానిటైజేషన్‌తో ప్రయోజనం ఎవరికి ?

ఆస్తుల నగదీకరణ ఎందుకు ?

మరిన్ని వార్తలు