ఐటీ సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉంటాయా? అది ఎంత వరకు నిజం!

27 Sep, 2022 20:11 IST|Sakshi

విద్యార్ధులకు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ కొట్టడం అనేది ఓ డ్రీం. ఎందుకంటే ఆ రంగంలో భారీ ఎత్తున శాలరీలు తీసుకోవచ్చని. కానీ అది ఎంత వరకు నిజం?
 
ఇటీవల బెంగళూర్‌కు చెందిన ‘వీక్‌డే’ సంస్థ దేశ వ్యాప్తంగా దిగ్గజ టెక్‌ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో పాటు ఇతర ప్రొఫెషనల్‌ రంగాల్లో పనిచేస్తున్న వారి శాలరీల డేటాను కలెక్ట్‌ చేసింది. ఆ డేటా ప్రకారం..సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి ఎంత జీతం తీసుకుంటున్నారో..అదే స్థాయిలో ఇతర ప్రొఫెషనల్‌ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు సైతం కళ్లు చెదిరేలా శాలరీలు తీకుంటున్నారనే ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది.  

50వేల మంది ఉద్యోగుల నుంచి 
బెంగళూరులో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న అమిత్‌ సింగ్‌ ఐటీ ఉద్యోగ నియామకాల సంస్థ ‘వీక్‌ డే’ను స్థాపించారు. ఆ సంస్థ కోసం దేశ వ్యాప్తంగా 50 వేల మంది ఐటీ నిపుణుల వద్ద నుంచి సేకరించిన డేటానే అమిత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దేశంలో దిగ్గజ ఐటీ కంపెనీలు విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌తో పాటు ఇతర సంస్థల్లో పనిచేసే ఐటీ ఉద్యోగుల శాలరీ కంటే..షేర్‌ చాట్‌, క్రెడ్‌, మీషో, స్విగ్గీతో పాటు ఇతర స్టార్టప్‌లలో పనిచేసే ఐటీ ఉద్యోగులు జీతాలు భారీగా ఉన్నట్లు తేలింది. 

ఎవరికెంత!
వీక్‌డే సర్వే ప్రకారం..4 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌ ( మిడ్‌ లెవల్‌) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి సోషల్‌ మీడియా సంస్థ షేర్‌ చాట్‌ అత్యధికంగా ఏడాదికి రూ.47 లక్షలు చెల్లిస్తుండగా..ఫిన్‌ టెక్‌ కంపెనీ క్రెడ్‌, ఈ కామర్స్‌ కంపెనీ మీషో రూ.40 లక్షల నుంచి రూ.39 లక్షల ప్యాకేజీ అందిస్తున్నాయి.

టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌లో ఇదే నాలుగేళ్ల అనుభవం ఉన్న సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగుల జీతం రూ.10 లక్షలుగా ఉంది.ఈ టెక్‌ సంస్థల్లో ఏడాదికి బేసిక్‌ శాలరీ రూ.7 లక్షలు. ఈ శాలరీ స్టార్టప్‌లు చెల్లించే వేతనం కంటే చాలా తక్కువగా ఉంది. 

రికార్డులను తిరిగి రాస్తున్నాయ్‌  
ఏదైనా స్టార్టప్‌ మంచి పనితీరును కనబరిచి పెట్టుబడులు సాధిస్తూ దాని మార్కెట్‌ వాల్యుయేషన్‌ వన్‌ బిలియన్‌ డాలర్లకు చేరుకుంటే దాన్ని యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. ఒకప్పుడు ఈ యూనికార్న్‌లు అమెరికా, యూరప్‌, చైనా, జపాన్‌ దేశాల్లోనే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దేశీయ కంపెనీలు వ్యాపారంలో రయ్‌ రయ్‌ మంటూ దూసుకుపోతున్నాయి. బైజూస్‌, ఫ్రెష్‌ వర్క్స్‌, క్విక్కర్‌, షాప్‌ క్లస్‌ వంటి యూని కార్న్‌ సంస్థలు ఉద్యోగులకు చెల్లించే జీతాల విషయంలో రికార్డులను తిరగ రాస్తున్నాయి. 

జొమాటాలో జీతం  
50వేల మంది ఐటీ ఉద్యోగుల డేటాలో.. 4 ఏళ్ల  అనుభవం ఉన్న షాప్‌ క్లస్‌ ఐటీ ఉద్యోగికి ఏడాదికి రూ.12 లక్షలు, జొమాటోలో రూ.32 లక్షలు, పేటీఎంలో రూ.22 లక్షలు, ఫ్లిప్‌ కార్ట్‌లో రూ.36 లక్షలు చెల్లిస్తున్నాయి.  

ఐటీ కంపెనీస్‌ వర్సెస్‌ యూనికార్న్‌ కంపెనీలు 
జీతాల సంగతి పక్కన పెడితే యూనికార్న్‌ కంపెనీలతో పోలిస్తే ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువ కాలం పని చేస్తున్నారు. పైన పేర్కొన్న స్టార్టప్‌లలో ఉద్యోగి సగటున 1.5 నుండి 2 సంవత్సరాల వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో పనిచేసే ఇంజనీర్లు సగటున 2.4 సంవత్సరాలు, బైజూస్‌ కంపెనీలో పని చేసే ఇంజనీర్లు సగటున 1.4 సంవత్సరాలు, క్రెడ్‌లో పనిచేసే ఇంజనీర్లు సగటున 1.8 సంవత్సరాలు ఉంటున్నట్లు వీక్‌ డే రిపోర్ట్‌లో తేలింది. ఇక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఒకే సంస్థలో ఏళ్లకు ఏళ్లు పనిచేయడానికి కారణం.. సంవత్సరానికి సగటున 10 శాతం శాలరీ పెంపుదల ఉంటుందనే భావన ఎక్కువగా ఉందని వీక్‌ డే జరిపిన అనాలసిస్‌లో ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఉద్యోగుల రిజైన్‌కి కారణం
ఇతర ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఐటీ సెక్టార్‌లో ఉద్యోగులు ఒక సంస్థను వదిలి మరో సంస్థకు వెళ్లుతున్నారు. అందుకు కారణం.. సంస్థ మారిన ప్రతి సారి 50 నుంచి 70శాతం శాలరీ ఎక్కువగా పొందుతున్నారు. అందుకే భారత్‌లో ఐటీ ఉద్యోగులు తరుచు జాబ్‌ మారేందుకు దోహదపడుతుంది.  

మరిన్ని వార్తలు