ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ను శాసించే అంశాలివే!

2 May, 2022 08:03 IST|Sakshi

ముంబై: అమెరికా రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య సమీక్షలో తీసుకునే నిర్ణయాలతో పాటు దేశీయ అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ ఎల్‌ఐసీకి లభించే స్పందనకు అనుగుణంగా ఈ వారం స్టాక్‌ సూచీలు కదలాడొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ కార్పొరేట్‌ త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలూ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, కోవిడ్‌ కేసుల నుంచి ఇన్వెస్టర్లు సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదిలికలు, ఉక్రెయిన్‌ రష్యా యుద్ధ పరిణామాలపై ఇన్వెస్టర్లు కన్నేయొచ్చని తెలిపారు. రంజాన్‌ సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం లో ట్రేడింగ్‌ నాలుగురోజులకే పరిమితం కానుంది. 

‘‘జాతీయ, అంతర్జాతీయంగా ఈ వారంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. కావున ఈ వారంలో కన్సాలిడేషన్‌ లేదా స్వల్పకాలిక కరెక్షన్‌కు అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ రెండు వారాలుగా 16,900 – 17,350 స్థాయిల పరిధిలో ట్రేడ్‌ అవుతోంది. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 16,900 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 16,800 వద్ద మద్దతు లభించొచ్చు’’ స్వస్తిక్‌ ఇన్వెస్ట్‌మార్ట్‌ హెడ్‌ రీసెర్చ్‌ సంతోష్‌ మీనా తెలిపారు. 
అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు అందడంతో పాటు దేశీయ కార్పొరేట్‌ త్రైమాసిక ఆర్థిక గణాంకాలు మిశ్రమ నమోదుతో గతవారమూ స్టాక్‌ సూచీలు అరశాతం నష్టపోయాయి. ఇంధన, హెల్త్‌కేర్, ఇన్ఫ్రా, టెక్నాలజీ, మెటల్‌ షేర్లలో అమ్మకాలు జరగడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్‌136 పాయింట్లు, నిఫ్టీ 69 పాయింట్లు చొప్పున క్షీణించాయి.   
 
మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తే..,    

కార్పొరేట్‌ త్రైమాసిక ఫలితాల ప్రభావం  
దేశీయ కార్పొరేట్‌ త్రైమాసిక ఫలితాల ఘట్టం కీలక దశకు చేరింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, టైటాన్‌ కంపెనీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌తో సహా 200కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్‌ వ్యాఖ్యలకు అనుగుణంగా ఎంపిక చేసిన షేర్లు కదలాడవచ్చు. అయితే ఇప్పటి వరకు వెల్లడైన కార్పొరేట్‌ క్యూ4 గణాంకాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోవడం ఇన్వెస్టర్లను నిరాశపరుస్తోంది.  

ఎల్‌ఐసీ ఐపీవో  
దేశీయ అతిపెద్ద ఐపీవో ఎల్‌ఐసీఐ బుధవారం(మార్చి 4న) ప్రారంభమై వచ్చే సోమవారం(మార్చి 9న) ముగిస్తుంది. ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ. 21,000 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఇందుకు ప్రతి షేరుకి రూ. 902–949 ధరల శ్రేణి నిర్ణయించింది. అతిపెద్ద ఇష్యూ ప్రారంభం నేపథ్యంలో సెకండరీ మార్కెట్‌ నుంచి నిధులు ఐపీఓకు తరిలే అవకాశం ఉంది. కావున దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.  

 ఫెడ్‌ మీటింగ్‌పై ఫోకస్‌   
అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనుంది.  దాదాపు 40 ఏళ్ల గరిష్టాన్ని చేరిన ద్రవ్యోల్బణ కట్టడికి 50 బేసిస్‌ వడ్డీరేట్ల పెంపు ఖాయమనే అంశాన్ని ఇప్పటికే మార్కెట్‌ వర్గాలు డిస్కౌంట్‌ చేసుకున్నాయి. సమీక్షా సమావేశంలో ఫెడ్‌ తీసుకునే ద్రవ్య పరమైన విధానాలతో పాటు పాలసీ ప్రకటన సందర్భంగా చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. 

స్థూల ఆర్థిక గణాంకాలు 
ముందుగా మార్కెట్‌ నేడు ఏప్రిల్‌ జీఎస్‌టీ వసూళ్లు, ఆటో అమ్మక గణాంకాలకు స్పందించాల్సి ఉంది. ఏప్రిల్‌ జీఎస్‌టీ వసూళ్లు ఆల్‌టైం రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. వాహనాలు చెప్పుకోదగిన స్థాయిలో అమ్ముడయ్యాయి. తయారీ రంగ పీఎంఐ నేడు, సేవారంగ గణాంకాలు (గురువారం) ఐదో తేదీన విడుదల అవుతాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్‌బీఐ ఏప్రిల్‌ 29 వారంతో ముగిసిన ఫారెక్స్‌ నిల్వలను, ఏప్రిల్‌ 22వారంతో ముగిసిన బ్యాంక్‌ డిపాజిట్, రుణాల డేటాను విడుదల చేయనుంది. దేశ ఆర్థికస్థితిగతులను తెలియజేసే ఈ గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించనున్నారు.  

మరిన్ని వార్తలు