ఈ వారం స్టాక్‌ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి

7 Nov, 2022 08:33 IST|Sakshi

ముంబై: దేశీయంగా నెలకొన్న సానుకూల పరిణామాల దృష్ట్యా ఈ వారంలోనూ స్టాక్‌ సూచీలు లాభాలు ఆర్జించే వీలుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. క్రూడాయిల్‌ ధరలు, డాలర్‌ మారకంలో రూపాయి విలువపై దృష్టి సారించవచ్చంటున్నారు. గురునానక్‌ జయంతి సందర్భంగా మంగళవారం(నంబర్‌ 6న) సెలవు కావడంతో ట్రేడింగ్‌ నాలుగురోజులకే పరిమితం కానుంది.   

అమెరికా ఫెడ్‌ రిజర్వ్, బ్యాంక్‌ ఇంగ్లాండ్‌లు కఠిన ద్రవ్య విధాన వైఖరికి మొగ్గు చూపినప్పటికీ.., దేశీయ కార్పొరేట్‌ క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించడం, భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆశావహ ధృక్పథంతో గతవారంలో సూచీలు రెండు శాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ 991 పాయింట్లు, నిఫ్టీ 330 పాయింట్లు బలపడ్డాయి.  
‘‘రెండు వారాల పాటు స్తబ్ధుగా ట్రేడైన బ్యాంకింగ్‌ షేర్లలో తాజాగా కొనుగోళ్లు నెలకొన్నాయి. దీంతో సూచీలు క్రమంగా రికార్డు స్థాయిల దిశగా కదులుతున్నాయి. అన్ని రంగాల్లో మూమెంటమ్‌ కన్పిస్తున్నందున.., స్థిరీకరణలో భాగంగా దిగివచ్చిన నాణ్యమైన షేర్లను గుర్తించి ఎంపిక చేసుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీకి 18,200 స్థాయి వద్ద నిరోధం ఎదురుకావచ్చు.  దిగువ స్థాయిలో 17,900–18,000 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. 

ప్రపంచ పరిణామాలు 
ఉక్రెయిన్‌పై సైనిక చర్యను తీవ్రతరం చేసే ప్రయత్నాల్లో భాగంగా రష్యా అణ్వాయుధాలను ప్రయోగించే వీలుందనే వార్తలు ప్రపంచ మార్కెట్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. చైనా జీరో కోవిడ్‌ విధానంపై డ్రాగన్‌ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను మార్కెట్‌ వర్గాలను క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఇక చైనా అక్టోబర్‌ ద్రవ్యోల్బణ డేటా రేపు(మంగళవారం), అమెరికా అక్టోబర్‌ ద్రవ్యోల్బణం గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం బ్రిటన్‌ జీడీపీ, యూఎస్‌ కన్జూమర్‌ సెంటిమెంట్‌ డేటా వెల్లడి అవుతాయి.  

తొలివారంలో రూ.15,280 కోట్లు పెట్టుబడులు 
గడిచిన రెండు నెలల్లో నికర అమ్మందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్‌ తొలి వారంలో దేశీయ మార్కెట్లో రూ.15,280 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఇదే సమయంలో డెట్‌ మార్కెట్‌ నుంచి అనూహ్యంగా రూ.2,410 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక ఎఫ్‌పీఐలు అక్టోబర్‌లో రూ.1,586 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.7,600 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. ఈ ఏడాదిలో నికరంగా 1.53 లక్షల కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.  

కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు  
దేశీయ కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల అంకం చివరి దశకు చేరింది. ఈ వారంలో సుమారు 85కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ముందుగా నేడు మార్కెట్‌ ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియా ఓవర్సీస్‌ బ్యాంక్‌  త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. కోల్‌ ఇండియా, దివీస్‌ ల్యాబ్స్, టాటా మోటార్స్, ఐషర్‌ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్, పేటీఎం, గోద్రేజ్‌ కన్జూమర్, పీఐ ఇండస్ట్రీస్, భాష్, పిడిలైట్‌ ఇండస్ట్రీస్, స్టార్‌ హెల్త్, జొమాటో అదానీ పవర్‌ తదితర దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది.   

మరిన్ని వార్తలు