డిజిటల్‌ టెక్నాలజీ పురోగతితో పర్యావరణ పరిరక్షణ

25 May, 2022 13:47 IST|Sakshi

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ నివేదిక

దావోస్‌: డిజిటల్‌ టెక్నాలజీల పురోగతి గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను 2050 నాటికి 20 శాతం వరకు తగ్గించగలదని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) అంచనావేసింది.  అత్యంత పర్యావరణ ప్రతికూల ఉద్గారాలను వెలువరించే మూడు రంగాలు– ఎనర్జీ, మొబిలిటీ, మెటీరియల్స్‌లో డిజిటల్‌ టెక్నాలజీ ఆవశ్యకతను ఉద్ఘాటించింది. యాక్సెంచర్‌తో కలిసి ఈ మేరకు నిర్వహించిన అధ్యయన వివరాలు... 

నిర్ణయాలు–అమలు మధ్య వ్యత్యాసం 
పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న పిలుపునకు ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.  అయితే నిర్ణయాలు–వాటి అమలు మధ్య ఇంకా తీవ్ర వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఇంకా చెప్పాలంటే ప్రమాదకర ఉద్గారాల తగ్గింపు అవసరమైన చర్యలు 55 శాతం చేపట్టాల్సి ఉండగా, ఈ దిశలో నడిచింది కేవలం 7.5 శాతం కావడం గమనార్హం. ఈ వ్యతాసం తగ్గింపునకు అధిక ఉద్గార రంగాలు ఈ విషయంలో ‘సామర్థ్యం, పునరుత్పాదకత, సుస్థిర నిర్ణయాల’పై పునరాలోచించాల్సిన అవసరం ఉంది.  

ఆ మూడు రంగాలు కీలకం... 
మూడు రంగాలు– ఎనర్జీ, మొబిలిటీ, మెటీరియల్స్‌ విభాగాలు అధిక ఉద్గార రంగాలుగా ఉన్నాయి. 2020 మొత్తం ఉద్గారాల్లో వీటి వెయిటేజ్‌ వరుసగా 43 శాతం, 26 శాతం, 24 శాతాలుగా ఉన్నాయి. ఈ పరిశ్రమలు తమ కార్యకలాపాలు, నిర్వహణ విషయంలో కాలుష్యాలను తగ్గించడానికి  నాలుగు రకాలైన డిజిటల్‌ టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. బిగ్‌ డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు/మెషిన్‌ లెర్నింగ్‌ వంటి నిర్ణయాత్మక సాంకేతికతలు, క్లౌడ్, 6జీ, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ వంటి సాంకేతికతలను ప్రారంభించడం, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, డ్రోన్‌లు, ఆటోమేషన్‌ వంటి సెన్సింగ్,  కంట్రోల్‌ టెక్నాలజీలను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవచ్చు.  

నివేదికలోని మరికొన్ని అంశాలు..
- డిజిటల్‌ పరిష్కారాలు,  కార్బన్‌–ఇంటెన్సివ్‌ ప్రక్రియలను మెరుగుపరచడం, భవనాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, పునరుత్పాదక శక్తి వినియోగం, నిర్వహణ, వంటి చర్యల ద్వారా ఇంధన రంగంలో ఉద్గారాలను 8 శాతం వరకు తగ్గించవచ్చు.  
- మెటీరియల్‌ రంగంలో డిజిటల్‌ సొల్యూషన్‌ లు మైనింగ్, అప్‌స్ట్రీమ్‌ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. దీనితోపాటు 2050 నాటికి గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు 7% వరకు తగ్గుతాయి. 
- సాంప్రదాయ ఇంధనం నుంచి గ్రీన్‌ ఇంధనం వైపునకు మొబిలిటీ రంగం అడుగులు వేయడం ద్వారా ఉద్గారాలను 5 శాతం వరకు తగ్గించవచ్చు. ఈ దిశలో సంబంధిత మౌలిక రంగం పురోగతి అవసరం.  
- వాయు ఉద్గారాలను తగ్గించడం, ఆర్థిక వృద్ధి ప్రేరణకు డిజిటల్‌ టెక్నాలజీలను అమలు చేసే కంపెనీలు ఈ విషయంలో మిగిలిన కంపెనీలు, సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.  
- పర్యావరణ పరిరక్షణకు డిజిటల్‌ సాంకేతికత కంపెనీలకు ఒక మంచి సాధనాలని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ డిజిటల్‌ ఎకానమీ ప్లాట్‌ఫామ్‌ స్ట్రాటజీ హెడ్‌ మంజు జార్జ్‌ అన్నారు. వ్యాపార పక్రియ, వ్యాలూ చైన్‌లో పారదర్శకత, సామర్థ్యం పెంపులో సాంకేతికత ప్రాధాన్యంత కీలకమని  పేర్కొన్నారు. డిజిటల్‌ సాంకేతికత పురోగతితో పారిశ్రామిక రంగాలు తగిన ప్రయోజనాలు పొందడం ప్రస్తుతం కీలకమని ఆయన సూచించారు.    
 

చదవండి: డీకార్బనైజ్డ్‌ మెకానిజంలో ఏపీ కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసింది: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు