చాయిస్‌ మనదే! అంకెలు తెలిశాక అడుగేయండి.. భారీగా పన్ను ఆదా చేసుకోండి

13 Feb, 2023 08:42 IST|Sakshi

- ట్యాక్సేషన్‌ నిపుణులు కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య 

బడ్జెట్‌ వచ్చింది. 1–4–2023 నుంచి ప్రారంభమయ్యే సంవత్సరానికి అది వర్తిస్తుంది. అంటే 2023–24 ఆర్థిక సంవత్సరంలో (01–04–2023 నుంచి 31–03–2024 వరకు) సంపాదించిన లేదా సంబంధిత ఆదాయం మీద పన్ను భారం లెక్కించాలి. అలా లెక్కించడానికి బడ్జెట్‌లో మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం రిటర్నుల దాఖలుకు కొత్త విధానానికి మళ్లుతామా లేదా పాత పద్ధతే కొనసాగిస్తామా అన్నది మన ఇష్టం. ఎంపిక మనదే. చాయిస్‌ మనదే. ఏం చేద్దాం అన్న ఆలోచన .. ఎలా చేద్దాం అన్న ప్లానింగ్‌ విషయంలో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే తీసుకోండి. ఆదాయపు అంకెలు తెలిశాక అడుగు వేయండి. మీరు గుర్తుంచుకోవల్సిన విషయాలు. 

  • 01–04–2023 నుండి మొదలయ్యే సంవత్సరంలో మీ ఆదాయం ఎంత అనేది.. వేతన జీవులు .. గవర్నమెంటు వారైతేనేం, స్థిరంగా జీతభత్యాలు వచ్చే వారైతేనేం .. ఎవరైనా సరే కరెక్టుగా అంచనా వేసుకోవచ్చు.  
  • ప్రైవేట్‌ సంస్థల్లోని ఉద్యోగస్తులు, ఉద్యోగం రాని వాళ్లు, లేని వాళ్లు అంచనా వేసుకోవడం కొంచెం కష్టం. 
  • వ్యాపారం/వృత్తుల్లో ఉన్నవారు కూడా అంచనా వేయడం కష్టమే. 
  • విధిగా.. అంటే తప్పనిసరిగా పీఎఫ్‌ కట్టేవారు, ఇంటి రుణం మీద వడ్డీ చెల్లించేవారు, రుణాన్ని సక్రమంగా చెల్లించేవారు, పిల్లలకు స్కూలు ఫీజులు చెల్లించేవారు, వీరందరికీ తప్పనిసరిగా 80సీ సెక్షన్‌ ప్రకారం తగ్గింపు లేదా మినహాయింపు ఉంటుంది. వీరు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే పన్ను ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా పైన చెప్పినవి అన్నీ ఆచరిస్తారు. అప్పుడు కొత్త విధానం వైపు మొగ్గు చూపించనక్కర్లేదు. కానీ, చెక్‌ చేసుకోండి. కొత్త విధానంలో ప్రయోజనం ఉంటుందంటే అటు వైపు వెళ్లండి. 
  • ఇలాంటప్పుడు మీ ప్లానింగ్‌ .. ట్యాక్స్‌ ప్లానింగ్‌తో కన్నా ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌తో ముడిపడినట్లు. 
  • పీఎఫ్‌ పరిధిలోకి రానివారు, సేవింగ్స్‌ చేయలేని వాళ్లు, ఇల్లు లేని వారు, పిల్లలు లేనివాళ్లు .. వీళ్లంతా మరో కేటగిరీ. వీరికి 80సీ ప్రయోజనం అవసరం లేదు. ఆ సెక్షన్‌ని ఆశ్రయించనక్కర్లేదు. అలాంటప్పుడు పాత విధానం వైపు కన్నెత్తి చూడనక్కర్లేదు. కొత్త విధానమే సో బెటర్‌. 
  • ఒక విధానం కింద .. భవిష్యత్‌ కోసం దాచుకోవడం .. లేదా ఇన్వెస్ట్‌ చేయడం. ఈ మేరకు మీ బ్యాంకులో నుంచి రూ. 2,00,000 స్థిరంగా వెళ్లిపోతుంది. ఇంత మొత్తం లేకపోయినా సంసారాన్ని లాక్కుని రాగలరా? అయితే 80సీని ఆశ్రయించండి. 
  • ఎందుకు మాస్టారూ .. అంత మొత్తాన్ని బ్లాక్‌ ( ఆఔౖఇఓ) (నల్లధనం కాదు) చేసుకోవడం .. చేతుల్లో డబ్బు లేకుండా ఇబ్బంది పడటం? అని ఆలోచించే అవసరాల ఆనందరావు ఉంటారు.. ముందు జాగ్రత్తే ముఖ్యం అనే ముత్యాలరావు ఉంటారు. అమ్మాయి పెళ్లి కోసం ఆలోచించే కల్యాణరావు, అబ్బాయి చదువు కోసం ఆలోచించే సరస్వతీరావు, సొంతిల్లు కోసం కలలు కనే శోభనబాబు, ఫిక్సిడ్‌ డిపాజిట్ల పిన్నమయ్య, ఎన్నెస్సీల ఎంకయ్య ఇలా ఎందరో మనలో... 
  • మీ బాణీ మీదే, మీ ధోరణి మీదే, మీ ప్రాధాన్యత మీదే.. ఆలోచించి అడుగేయండి. 

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌ పంపించగలరు.

మరిన్ని వార్తలు