ఆర్ధిక సర్వే అంటే ఏమిటి? తొలి సర‍్వే ఎప్పుడు ప్రవేశ పెట్టారో తెలుసా?

31 Jan, 2023 08:12 IST|Sakshi

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందస్తు బడ్జెట్ పత్రాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. 

ఆర్ధిక సర్వే అంటే 
ఈ సందర్భంగా బడ్జెట్‌ను సమర్పించే ముందు గత సంవత్సరంలో సాధించిన ఆర్థిక అభివృద్ధి,రాబోయే సంవత్సరానికి సూచనలు, సవాళ్లు, పరిష్కారాలను ప్రస్తావిస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సర్వేగా (ఎకానమీ సర్వే) పిలువబడే ఒక పత్రాన్ని పార్లమెంటులో సమర్పిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక విభాగం రూపొందించిన ఆర్థిక సర్వే ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ పర్యవేక్షణలో రూపొందించారు.   

తొలి సర‍్వే ఎప్పుడు ప్రవేశ పెట్టారో తెలుసా
1950-51లో మొదటి ఆర్థిక సర్వేని ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఎకానమీ సర్వే నివేదిక విడుదల చేయడం ఆనవాయితీగా మారింది. 1964 వరకు కేంద్ర బడ్జెట్‌తో కలిపి దీనిని ప్రవేశపెట్టేవారు. ఆ తర్వాత బడ్జెట్‌ నుంచి దీనిని విడదీశారు.

రెండు విడతల్లో
నేటి నుంచి జరగనున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లోని తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రేపు పార్లమెంట్‌లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఇక బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 6 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడుత బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు... రెండో విడుత మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 16 వరకు కొనసాగనున్నాయి. ఇలా మొత్తం కలిపి 27 రోజులు పాటు జరగనున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఊరట కల్పించేలా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని దేశ ప్రజలు ఎంతో ఉత్కంటతతో ఎదురు చూస్తున్నారు.  

చదవండి👉 నిర్మలమ్మా.. 9 ఏళ్లు అయ్యింది, ఈ సారైనా పెంపు ఉంటుందా?

మరిన్ని వార్తలు