ఫ్లెక్సీ క్యాప్‌ అంటే ఏంటీ? తెలుసుకోండిలా..

2 Aug, 2021 12:04 IST|Sakshi

స్టాక్‌మార్కెట్‌పై ఇండియన్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న డిమ్యాట్‌ ఖాతాలే ఇందుకు నిదర్శనం. షేర్‌మార్కెట్‌లో తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి పొందడమనేది ఎంతో కీలకం. ఇందుకు అనుగుణంగా ఉండే వాటిలో ఫ్లెక్సీక్యాప్‌ పథకం ఒకటి. అసలు ఫ్లెక్సీక్యాప్‌ అంటే ఏంటీ ? ఇటీవల అధికంగా లాభాలు అందిస్తోన్న ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఫ్లెక్సీక్యాప్‌కి సంబంధించిన వివరాలు...

ఫ్లెక్సీక్యాప్‌
ఫ్లెక్సీక్యాప్‌ పథకాలు గతంలో మల్టీక్యాప్‌ ఫండ్స్‌ పేరుతో ఉండేవి. మల్టీక్యాప్‌ పథకాలు కచ్చితంగా స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్‌ పథకాల్లో 25 శాతం చొప్పున కనీస పెట్టుబడులను నిర్వహించాల్సిందేనని.. లేదంటే ఫ్లెక్సీక్యాప్‌ విభాగంలోకి మారిపోవచ్చంటూ సెబీ గతేడాది నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో మల్టీక్యాప్‌ విభాగం నిబంధనలను కట్టుబడలేని పథకాలు ఫ్లెక్సీక్యాప్‌గా పేరు మార్చుకున్నాయి.

ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఫ్లెక్సీక్యాప్‌
గడిచిన కొన్నేళ్లలో ఫ్లెక్సీక్యాప్‌ పథకాలు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చాయి. ఫ్లెక్సీ క్యాప్‌ విభాగంలో మార్కెట్‌ విలువ పరంగా తమకు అనుకూలం అనిపించిన, భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసుకునే స్వేచ్ఛ ఫండ్‌ మేనేజర్లకు ఉంటుంది. ఫలానా విభాగంలో (స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్‌) కచ్చితంగా ఇంత మేర పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనలు ఈ పథకాలకు వర్తించవు. ఈ విభాగంలో కొన్ని పథకాలు గడిచిన ఏడాది కాలంలో గణణీయమైన రాబడులను అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం (కనీసం పదేళ్లు అంతకుమించి) ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఫ్లెక్సీక్యాప్‌ పథకాలకు కొంత చోటు కల్పించుకోవచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఫ్లెక్సీక్యాప్‌ కూడా ఒకటి. 

రాబడులు 
గడిచిన ఏడాది కాలంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఇన్వెస్టర్లకు 58 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఇదే కాలంలో ఫ్లెక్సీక్యాప్‌ విభాగం సగటు రాబడులు 51 శాతంగానే ఉండడాన్ని గమనించాలి. బీఎస్‌ఈ 500 సూచీ రాబడులు 53 శాతంతో పోల్చినా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఫ్లెక్సీక్యాప్‌ పథకం మెరుగైన పనితీరును చూపించినట్టు తెలుస్తోంది. ఇక గత మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతానికి పైనే సగటు వార్షిక రాబడులను ఇచ్చింది. అంతేకాదు ఐదేళ్లలోనూ, ఏడేళ్లలోనూ, పదేళ్లలో కూడా వార్షిక సగటు రాబడులు 15 శాతం స్థాయిలోనే ఉన్నాయి. నిలకడైన పనితీరును ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

లక్ష ఇన్వెస్టే చేస్తే కోటి రూపాయలు
ఆదిత్య బిర్లా ఫెక్సీక్యాప్‌ పథకంలో 22 ఏళ్ల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌ చేసి అలాగే కొనసాగించి ఉంటే ప్రస్తుతం రూ.1.04 కోట్లు సమకూరేది. అంటే 104 రెట్లు వృద్ధి చెందేది. వార్షికంగా 22.57 శాతం చొప్పున కాంపౌండింగ్‌ రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఫ్లెక్సీక్యాప్‌ పథకాల్లో రిస్క్‌ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో ఈ రిస్క్‌ను మించి రాబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. 

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌పై దృష్టి
ప్రస్తుతం ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఫ్లెక్సీక్యాప్‌ పథకం నిర్వహణలో రూ.14,571 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 96.2 శాతం ఈక్విటీల్లో, డెట్‌ సాధనాల్లో 3.5 శాతం చొప్పున పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 65 స్టాక్స్‌ను నిర్వహిస్తోంది. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 68 శాతం, మిడ్‌క్యాప్‌లో 25 శాతం, స్మాల్‌క్యాప్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసి ఉంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26 శాతం పెట్టుబడులు ఈ విభాగంలోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీల్లో 14 శాతం, హెల్త్‌కేర్‌ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. ఆయా రంగాల్లో దిగ్గజ కంపెనీలు, బలమైన యాజమాన్యాలు, కార్పొరేట్‌ పాలనలో పారదర్శకత, బలమైన బ్యాలన్స్‌ షీట్‌ ఇటువంటి అంశాల ఆధారంగా కంపెనీలను ఫండ్‌ మేనేజర్లు ఎంపిక చేసుకుంటారు.

టాప్‌ ఈక్విటీ హోల్డింగ్స్‌ 

కంపెనీ                                     పెట్టుబడుల శాతం 
ఐసీఐసీఐ బ్యాంకు                           8.77 
ఇన్ఫోసిస్‌                                        8.46 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు                      7.05 
డాక్టర్‌ రెడ్డీస్‌                                     6.19 
భారతీ ఎయిర్‌టెల్‌                           4.35 
హెచ్‌సీఎల్‌ టెక్‌                                3.66 
సన్‌ఫార్మా                                         2.75 
బజాజ్‌ ఫైనాన్స్‌                                2.45 
కోటక్‌ బ్యాంకు                                   2.24 
ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌              2.22 

మరిన్ని వార్తలు