Zomato 10 Minute Delivery: జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌కు భారీ షాక్‌, బెడిసి కొట్టిన మాస్టర్‌ ప్లాన్‌!

13 May, 2022 16:37 IST|Sakshi

జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌కు భారీ షాక్‌ తగిలింది. పదినిమిషాల్లో డెలివరీ అంటూ గోయల్‌ వేసిన మాస్టర్‌ ప్లాన్‌ బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఆరంభం అదిరేలా గూర్‌గావ్‌ కేంద్రంగా జొమాటో 10నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ పైలెట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కానీ డెలివరీ బాయ్స్‌ లేక..చెప్పిన టైంకు కస్టమర్లకు కావాల్సిన ఫుడ్‌ ఐటమ్స్‌ను డెలివరీ చేయడంలో విఫలమవుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే సమస్యతో స్విగ్గీ సైతం తన 'జెనీ' సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆర్డర్లు ఆలస్యం అవ్వడంతో ఏం జరుగుతుందో అర్ధం గాక కస్టమర్లు తలలు పట్టుకుంటున్నారు. 


మేం అందుబాటులోకి తెచ్చే పదినిమిషాల ఫుడ్‌ డెలివరీ సర్వీస్‌ ప్రపంచంలో ఇంత వరకు ఏ ఇతర ఫుడ్‌ డెలివరీ సంస్థలు కస్టమర్లకు అందించలేదు. కానీ మేం అందిస్తాం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నాం. తొలత ఈ టెన్‌ మినిట్స్‌ డెలివరీ పైలెట్‌ ప్రాజెక్ట్‌ను గుర్‌గావ్‌లో ప్రారంభిస్తున్నాం. తర్వాత దేశ వ్యాప్తంగా కస్టమర్లకు ఫుడ్‌ డెలివరీ అందిస్తున్నామని ప్రకటించి జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ గట్టి ప్లానే వేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్‌ బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది.

పది నిమిషాల సంగతి దేవుడెరుగు
పది నిమిషాల సంగతి దేవుడెరుగు. ఆర్డర్‌ పెట్టిన ఫుడ్‌ ఐటమ్‌ 15 నుంచి 20 నిమిషాలకు కూడా అందడం లేదంటూ జొమాటోపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కంపెనీ ప్రతినిధులు మాత్రం తాము చెప‍్పినట్లుగానే జొమాటో ఇన్‌స్టంట్‌ ద్వారా పదినిమిషాల్లో ఫుడ్‌ను కస్టమర్లకు అందిస్తున్నామని చెబుతున్నారు. గూర్‌గావ్‌లో జొమాటో ఇన్‌స్టంట్ ద్వారా టెన్‌ మినిట్స్‌ డెలివరీపై ఊహించని రెన్సాన్స్‌ వచ్చిందని, మే నెలలో బెంగళూరులో సైతం ఈ డెలివరీ విధానాన్ని అమలు చేయనున్నట్లు  చెబుతున్నారు. జొమాటో ఇన్‌స్టంట్‌ యాప్‌లో సైతం ఫుడ్‌ డెలివరీ టైం 15 నుంచి 20నిమిషాల సమయం చూపెట్టడంపై ఫుడ్‌ లవర్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 డెలివరీ బాయ్స్‌కు కొత్త కష్టాలు
ఈ నేపథ్యంలో జొమాటో 10నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా..సీఎన్‌బీసీ టీవీ18 ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. ఆ కథనం ప్రకారం..క్విక్‌ కామర్స్‌ (10నిమిషాల్లో ఆర్డర్‌ అందించడం), జాబ్‌ మొబిలిటీ (ఉన్న జాబ్‌ వదిలేసి మరో కొత్త ఫీల్డ్‌లోకి వెళ్లడం) వంటి అంశాలు స్విగ్గీ, జొమాటోలకు డెలివరీ బాయ్స్‌ గుడ్‌ బై చెబుతున్నట్లు నివేదించింది. దీంతో పాటు సమ్మర్‌ సీజన్‌, ఐపీఎల్‌, వర్షాల కారణంగా డెలివరీ బాయ్స్‌..ఆర్డర్లను డెలివరీ చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిపింది.  

సేమ్‌ టూ సేమ్‌
దీంతో ఇన్‌ టైమ్‌లో కస్టమర్లకు ఫుడ్‌ డెలివరీని అందించకపోవడంతో జొమాటో, స్విగ్గీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్‌ సీజన్‌ కారణంగా డిమాండ్‌కు తగ్గట్లు డెలివరీ బాయ్స్‌ లేక స్విగ్గీ సంస్థ జెనీ పేరుతో నిర్వహిస్తున్న పిక్‌ అప్‌.. డ్రాప్‌ ఆఫ్‌ సేవల్ని ముంబై, హైదరాబాద్, బెంగళూరులలో సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. “క్రికెట్, పండుగల సీజన్ ఫలితంగా ఫుడ్ మార్కెట్‌ప్లేస్, ఇన్‌స్టామార్ట్ రెండింటికీ అవసరాల్ని తీర్చడానికి డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రస్తుతం స్విగ్గీ జెనీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటలో స్విగ్గీ తెలిపింది.

చదవండి👉స్విగ్గీ బంపరాఫర్‌: డెలివరీ బాయ్స్‌ కష్టాలకు చెక్‌.. కళ్లు చెదిరేలా జీతాలు!

మరిన్ని వార్తలు