గడువు(డిసెంబ‌ర్ 31)లోపు ఐటీఆర్ దాఖ‌లు చేయ‌క‌పోతే ఏమ‌వుతుంది?

31 Dec, 2021 21:24 IST|Sakshi

2020-2021 ఆర్థిక సంవత్సరానికి లేదా 2021-22 మ‌దింపు సంవ‌త్స‌రానికి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేయాల్సిన గడువు తేదీ సాధార‌ణంగా జులై 31 కాగా, క‌రోనా నేప‌థ్యంలో గ‌డువును డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు పొడ‌గించిన సంగ‌తి తెలిసిందే. ఇది పన్ను చెల్లింపుదారుల సాధారణ వర్గానికి, వేత‌న‌జీవుల‌కు వర్తిస్తుంది. 2021-2022 మదింపు సంవత్సరానికి డిసెంబర్ 31, 2021 లోపు మీ ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే ఏమి జరుగుతుంది? తెలుసుకుందాం..

గడువు తేదీ ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీనా?
చాలా వరకు సామాన్య జనం చివరి తేదీనే గుడువు తేదీ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐటీఆర్ ఫైలింగ్ కు సంబంధించి రెండు తేదీలు ఉంటాయి. ఒకటి గడువు తేదీ, మరొకటి చివరి తేదీ. ఒకవేళ మీరు గడువు తేదీ నాటికి మీ ఐటీఆర్‌ని సబ్మిట్ చేయడంలో విఫలమైనట్లయితే, చివరి తేదీ నాటికి మీరు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. 2021-2022 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ సమర్పించాల్సిన గడువు తేదీ జూలై 31, 2021 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. చివరి తేదీ 2022 మార్చి 31 వరకు అన్నమాట. 

ఐటీఆర్‌ గడువు లోపు ఫైల్ చేయకపోతే ఏమి జరుగుతుంది?
ఒకవేళ మీరు మీ ప్రస్తుత ఐటీఆర్‌ని గతంలో పొడగించిన గడువు తేదీ నాటికి సబ్మిట్ చేయడంలో విఫలమైనట్లయితే(31 డిసెంబర్ 2021 నాటికి) మీరు 31 మార్చి 2022 వరకు చేయవచ్చు. కాని, తర్వాతి సంవత్సరాలకు మీ న‌ష్టాన్ని కొన‌సాగించే హక్కును మీరు కోల్పోతారు. ఉదాహ‌ర‌ణ‌కు ప్రస్తుత సంవత్సరంలో మీ వ్యాపార‌ ఆదాయం, మూలధన లాభాలు లేదా గృహ ఆస్తి కింద రెండు లక్షల రూపాయలకు మించి నష్టం ఉన్నట్లయితే తర్వాతి సంవత్సరాల్లో ఆ నష్టాన్ని చూపించేందుకు వీలుంటుంది. కానీ, ఇప్పుడు డిసెంబ‌ర్ 31లోపు రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌క‌పోతే త‌ర్వాత సంవ‌త్స‌రాల్లో మీ న‌ష్టాన్ని చూప‌డానికి వీలుండ‌దు.

(చదవండి: ఐటీ రిటర్న్‌ గడువు తేదీని పొడగించని కేంద్రం)

ఒకవేళ మీరు లేదా మీ తరఫున చెల్లించే పన్నులు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే, చెల్లించిన అదనపు పన్నులకు రీఫండ్ పొందటానికి వీలుండ‌దు. దీంతోపాటు మీరు చెల్లించిన అదనపు పన్నులకు సంబంధించి వడ్డీని పొందలేరు. మ‌రోవైపు మీ మొత్తం పన్ను బాధ్యత కంటే తక్కువగా ఉంటే, ఆల‌స్యంగా చెల్లించిన కార‌ణంగా దానిపై అద‌న‌పు వ‌డ్డీ కూడా వ‌ర్తిస్తుంది.

గడువు తేదీ తర్వాత ఐటిఆర్ ఫైల్ చేస్తే ఆలస్య రుసుము ఎంత? 
పై పరిణామాలకు అదనంగా, ఒకవేళ మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు పైగా ఉన్నట్లయితే, గడువు తేదీ తర్వాత ఐటీఆర్ సబ్మిట్ చేసినట్లయితే తప్పని సరిగా ఆలస్య రుసుము చెల్లించాలి. మీ ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు తప్పనిసరిగా 5 వేల రూపాయల ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పన్ను పరిధిలోకి తీసుకునే ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లయితే, ఆలస్య రుసుము రూ.1,000/-కు ఉంటుంది.

చివరి తేదీ నాటికి ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఏమి జరుగుతుంది?
ఒకవేళ మీరు చివరి తేదీ నాటికి మార్చి 31, 2022లోగా కూడా మీరు ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే, ఆదాయపు పన్ను శాఖ కనీస జరిమానాను ప‌న్నులో 50 శాతం వ‌ర‌కు విధించవచ్చు. ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులకు ప్రతిస్పందనగా మీరు చివరికి ఐటీఆర్‌ దాఖలు చేసే తేదీ వరకు అదనంగా వడ్డీ భారం మీద ప‌డుతుంది. అయిన, మీరు ఐటీఆర్ దాఖలు చేయకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్ర‌భుత్వానికి అధికారం ఉంటుంది. 

ఐటీఆర్ దాఖలు చేయకపోతే ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం.. కనీసం మూడు సంవత్సరాల జైలు శిక్ష నుంచి గరిష్టంగా ఏడు సంవత్సరాల శిక్షను విధించవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైన ప్రతి సందర్భంలోనూ  ఇలా జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ. 10,000/-కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రమే ఆదాయపు శాఖ చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది.

(చదవండి: Small Savings Schemes: చిన్న పొదుపు ఖాతాదారులకు శుభవార్త..!)

మరిన్ని వార్తలు