బంగారం కొనుగోళ్లకు డాలర్‌కు సంబంధమేంటి?

25 May, 2023 19:21 IST|Sakshi

‘అంతర్జాతీయ డబ్బు సంబంధిత వ్యవహారాల్లో నిన్న మొన్నటి వరకూ తిరుగులేని రాజైన అమెరికా డాలర్‌ నెమ్మదిగా తన పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. 2022 మార్చి నాటికి ప్రపంచ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో డాలర్‌ వాటా దాదాపు 58 శాతానికి పడిపోయింది. ఇది 1994 నుంచీ అత్యంత కనిష్ఠం. ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సెంట్రల్‌ (కేంద్రీయ) బ్యాంకులు పాత ఆనవాయితీకి విరుద్ధంగా డాలర్లకు బదులు తమ బంగారం నిల్వలను విపరీతంగా పెంచుకుంటున్నాయి. 

ఒక్క 2022 సంవత్సరంలోనే ఈ సెంట్రల్‌ బ్యాంకులు తమ ఖజానాలకు అదనంగా 1126 టన్నుల బంగారాన్ని కొని తరలించాయి. 1950 తర్వాత ఇంత మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేయడం ఇదే మొదటిసారి. ఇంతకన్నా మరో ఆశ్చర్యకర విషయం ఏమంటే, అనేక దేశాలు తమ మధ్య వాణిజ్యాన్ని, పెట్టుబడులను తమ సొంత లేదా థర్డ్‌ పార్టీ కరెన్సీలతో నిర్వహించుకుంటున్నాయి,’ ఈ తరహా వార్తలు గడచిన మూడు నాలుగు నెలలుగా మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ మారకం కరెన్సీగా డాలర్‌ భవితవ్యంపై అమెరికా కాని, ఇతర ధనిక, పారిశ్రామిక దేశాలు గాని ఎక్కువగా దిగులు పడడంలేదు. 

అమెరికా 21వ శతాబ్దంలో తనకు అవసరమైనప్పుడల్లా తన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు పెంచడానికి ఎడాపెడా తన కరెన్సీని ప్రింట్‌ చేసి విడుదల చేస్తోందనీ, దీని వల్ల ఇతర ఆర్థిక వ్యవస్థలు ముఖ్యంగా వర్ధమాన దేశాలపై వ్యతిరేక ప్రభావం పడుతోందనేది కొందరు అంతర్జాతీయ నిపుణులు, కొన్ని పారిశ్రామిక దేశాల ఆరోపణ. అత్యవసర పరిస్థితుల్లో ఏ దేశమైనా తన సొంత కరెన్సీని తాత్కాలికంగా పరిమితికి మించి ప్రింట్‌ చేయడం తప్పేమీ కాదనే సిద్ధాంతం కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఎప్పటిలాగానే అంతర్జాతీయ ఆర్థిక వ్యవహరాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

అంతర్జాతీయ కరెన్సీగా డాలర్‌ కథ 1944లో మొదలైంది
ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత పాత మారకపు కరెన్సీ అయిన బ్రిటిష్‌ పౌండ్‌ స్టెర్లింగ్‌ స్థానంలో అమెరికా డాలర్‌ ఎలా వచ్చిందీ ఓసారి గుర్తుచేసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1944లో అమెరికాలో బ్రెటన్‌ వుడ్స్‌లో జరిగిన అనేక దేశాల అంతర్జాతీయ సమావేశం నిర్ణయాల ఫలితంగా బ్రిటిష్‌ పౌండు స్థానంలో అమెరికా డాలర్‌ అంతర్జాతీయ మారకపు కరెన్సీగా వేగంగా అవతరించింది.  ఈ యుద్ధంలో ఇంగ్లండ్‌ సహా అనేక ఐరోపా దేశాలు ఆర్థికంగా దివాలా స్థితికి రావడంతో డాలర్‌ ప్రపంచ వాణిజ్య యవనికపై దర్శనమిచ్చి అప్పటి నుంచి అలా నిలిచిపోయింది. 

మధ్యలో కొన్నిసార్లు అమెరికా ఆర్థిక ఇబ్బందుల వల్ల డాలర్‌ బలహీనపడిన మాట నిజమే గాని ప్రతిసారీ అది పుంజుకుని తన పూర్వ స్థానం నిలబెట్టుకుంటూనే ఉంది. మరో ముఖ్య విషయం ఏమంటే.. బంగారానికి (ఈ లోహానికి ఉన్న అనేక సుగుణాల వల్ల) ప్రపంచవ్యాప్తంగా ప్రాచీనకాలం నుంచీ విలువ ఉంది. కాలంతో పాటు మనుషులకు ఈ లోహంపై మోజు మరీ పెరిగిపోతోంది. డాలర్‌ మారకం విలువ తగ్గినప్పుడల్లా బంగారం కొనుగోలు ధర పెరుగుతుంది. ఈ కారణంగా ప్రపంచంలో బంగారం కొనుగోళ్లు విపరీతంగా జరిగినప్పుడల్లా డాలర్‌ పని ఇక అయిపోయిందనే మాటలు, పుకార్లు వినిపిస్తాయి. 

ఇదీ  చదవండి:  వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్‌ వీడియో 

అత్యంత ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీతోపాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో అమెరికాకు ఉన్న ఆధిపత్యం కారణంగా ఈ దేశానికి ఆర్థిక సంక్షోభాలు తాత్కాలికమేనని, మారకద్రవ్యంగా డాలర్‌కు ఉన్న ప్రాధాన్యానికి ఎదురయ్యే సవాళ్లు కొన్ని మాసాలకు మాత్రమే పరిమితమని గడచిన దాదాపు 75 ఏళ్ల చరిత్ర చెబుతోంది. ప్రసిద్ధ ఆర్థికవేత్తలు సైతం ఇప్పట్లో అమెరికా డాలర్‌ అంతర్జాతీయ మారకపు కరెన్సీగా తన హోదాను కోల్పోయే ప్రమాదమేమీ లేదని గట్టిగా వాదిస్తున్నారు. అనేక ఇతర కారణాల వల్ల బంగారానికి డిమాండు పెరగడానికి, దాని ధర కూడా పైకి ఎగబాకడానికి అవకాశాలున్నాయి గాని అమెరికా డాలర్‌ పతనం నిరంతరాయంగా జరగదని పలువురు ఆర్థిక శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (రూపాయి సింబల్‌ ₹, డాలర్‌ $, పౌండ్‌ £...వీటి వెనుక కథ ఏమిటంటే...)


-విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ సభ్యులు

మరిన్ని వార్తలు