ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 192 ప్రకారం..

3 Oct, 2022 08:09 IST|Sakshi

 ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. మరో రెండు రోజుల్లో దసరా .. ఆ తర్వాత దీపావళి .. అలా అలా కాలం గడిపేయకండి. నెమ్మదిగా, నిశ్చింతగా, చింత లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన, జరగబోయే ఆర్థిక వ్యవహారాల మీద ఒక కన్నేయండి. నిశితంగా పరిశీలించుకోండి. ప్రశ్నించుకోండి. పరీక్షించండి. పదండి ముందుకు.. 

ఈ విషయంలో ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వారు ఎన్నో సేవలు అందిస్తున్నారు. మీ ముందుకు వస్తున్నారు.  www.incometaxindia.gov.inని వెంటనే దర్శించండి. తరచుగా మీకు వచ్చే సందేహాలు, సమస్యలు, మిమ్మల్ని వేధించే ప్రశ్నలు.. మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం, నియమాలు, వాడాల్సిన ఫారంలు, దాఖలు చేయాల్సిన రిటర్నులు.. ఇలా ఎన్నెన్నో.. సవరణలు, వివరణలు, ఉదాహరణలు.. కొన్ని వందల ప్రశ్నలకు చక్కటి జవాబులు ఇందులో ఉన్నాయి. 

మీకు అర్థమయ్యే విధంగా, సులభంగా వివరించే  Frequently Asked Questions.... సామాన్యమైన సందేహాలు, ప్రాథమిక అంశాలు మొదలు ప్రాముఖ్యమైన అంశాల వరకు.. చిన్న చిన్న సందేహాలు మొదలు పెద్ద సమస్యల వరకు.. అస్సెస్సీ తరఫు నుండి అసెస్‌మెంట్‌ పద్ధతి వరకు.. ఒక్క మాటలో చెప్పాలంటే అ నుండి అః వరకూ అన్నీ .. చట్టంలోని అన్ని అంశాలకు సంబంధించి కొన్ని వందల ప్రశ్నలకు జవాబులున్నాయి. వెబ్‌సైట్‌ దర్శించి ప్రతి చాప్టర్‌ చదవండి. కొన్ని మీకు వర్తించవచ్చు కొన్ని వర్తించకపోవచ్చు. ఏది ఏమిటనేది మీకు అర్థమవుతుంది. సులువుగా ఉంటుంది. 

నాన్‌–రెసిడెంట్లు, సీనియర్‌ సిటిజన్లు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు, అన్ని వర్గాల వారికీ జీతం, ఇంటద్దె, వ్యాపారం/వృత్తి, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు.. అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులు, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, పాన్, టాన్‌ .. ఇలా .. గిఫ్టులు, బహుమతులు, వ్యవసాయ ఆదాయం అన్నింటికీ జవాబులు ఉన్నాయి. 

నవంబర్‌ / డిసెంబర్‌లో సెక్షన్‌ 192 ప్రకారం కేవలం జీతం మీద ఆదాయం .. అంటే వేతన జీవులకు ప్రత్యేకంగా సర్క్యులర్‌ విడుదల చేస్తారు. అన్ని గవర్నమెంటు శాఖలకు చేరుతుంది. ఇతరులకు కూడా లభ్యమవుతుంది. మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. వెబ్‌సైట్‌లో దొరుకుతుంది. ఇందులో అన్ని అంశాలు ఉంటాయి. 

ఏది మంచిది.. ఏది మీకు పనికొచ్చేది తెలుసుకునేందుకు ఉదాహరణలు ఉంటాయి. ఎక్కువ మందిని దృష్టిలో పెట్టుకుని తయారుచేస్తారు. మీ నిజమైన పరిస్థితికి.. అంటే వాస్తవానికి దగ్గర్లో ఉంటాయి. అది చదవండి. అడ్వాన్స్‌ ట్యాక్స్‌ లెక్కలు తేల్చి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించండి. కొన్ని డాక్యుమెంట్లు వ్యవహారం జరిగిన / జరిపిన వెంటనే దొరుకుతాయి. వాటి కాపీలు తీసుకుని భద్రపర్చుకోండి. ఒక ఫైలు తెరవండి. అందులో అన్నీ దాచండి. బ్యాంకు ఎంట్రీలకు వివరణ రాసుకోండి. జ్ఞాపక శక్తి కన్నా ‘డాక్యుమెంట్‌’ చేయడమే మంచిది.    

మరిన్ని వార్తలు