మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇలా చేస్తే.. ట్యాక్స్‌ కట్టాలా?

23 Jan, 2023 09:11 IST|Sakshi

ఆల్టర్నేటివ్‌ డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్లు, ముఖ్యంగా ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ గురించి తరచూ వింటున్నాను. ఇవి కాల పరీక్షకు నిలబడినవేనా?– శ్రీరామ్‌ 

ఈక్విటీలు దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఉద్దేశించినవి. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలు (డెట్‌ సెక్యూరిటీలు) పెట్టుబడికి రక్షణతోపాటు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కొంత రాబడిని ఇచ్చేవి. ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అంటే, హెడ్జ్‌ ఫండ్స్, ప్రైవేటు క్యాపిటల్, సహజ వనరులు, రియల్‌ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఇన్వెస్ట్‌ చేస్తాయి. 

వీటన్నింటిలోనూ లిక్విడిటీ (పెట్టుబడులను నగదుగా మార్చుకునే సౌలభ్యం) తక్కువ. నియంత్రణలు, పారదర్శకత కూడా తక్కువే. వ్యయాలు ఎక్కువ. చారిత్రకంగా రిస్క్, రాబడుల డేటా కూడా పరిమితంగానే అందుబాటులోఉంది. కనుక రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఈ సాధనాలు సూచనీయం కాదు.  ఇన్‌వాయిస్‌ డిస్కౌంట్‌ అన్నది వ్యాపారం కోసం సమీకరించుకునే తాత్కాలిక రుణం. సాధారణంగా బ్యాంకులు ఈ రుణాలు ఇస్తుంటాయి. ఇవి ప్రైవేటు క్యాపిటల్, ప్రైవేటు డెట్‌ కిందకు వస్తాయి. 

దశాబ్ద కాలం నుంచి ఉన్న ఉత్పత్తి ఇది. రిస్క్‌–రాబడుల కోణంలో చూస్తే అంత అనుకూలంగా కాదు. లాభాలు పరిమితం, నష్టాలు అపరిమితం. అంటే 100 శాతం నష్టానికీ అవకాశం ఉంటుంది. వైవిధ్యం పరంగా చూసినా పోర్ట్‌ఫోలియోకి వీటిని జోడించుకోవడం సహేతుకం కాదు. ఉదాహరణకు మీరు ఓ కంపెనీకి రుణంపై వస్తువులు సరఫరా చేశారని అనుకుందాం.దీనికి బిల్‌ జారీ చేస్తారు. ఈ బిల్లు గడువు (30–90 రోజులు) ముగిసిన తర్వాత కొనుగోలుదారుడు చెల్లించేందుకు అంగీకరిస్తాడు. ఒకవేళ ఈ లోపే మీకు డబ్బులు అవసరం పడితే బ్యాంకును సంప్రదించింది ఈ బిల్లుపై నిధులు పొందుతారు. బ్యాంకులు రిస్క్‌ ఆధారంగా బిల్లు మొత్తంలో కొంత తగ్గించి మిగిలింది ఇస్తాయి. దీన్నే ఇన్వాయిస్‌ డస్కౌంటింగ్‌ అంటారు. 

ఇప్పటి వరకు ఈ వ్యాపారాన్ని బ్యాంకులే నిర్వహిస్తుండగా, ఇటీవలే రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం ఈ బిల్లులపై రుణాలు ఇచ్చే అవకాశాన్ని కొన్ని ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఒకవేళ రుణంపై వస్తువులు తీసుకున్న సంస్థలు చెల్లించడంలో విఫలమైతే ఏంటి పరిస్థితి? అందుకే రాబడుల కంటే ఈ రిస్క్‌ను రిటైల్‌ ఇన్వెస్టర్లు ముందు అర్థం చేసుకోవాలి. వీటిల్లో లిక్విడిటీ ఉండదు. మీరు వీక్రయించాలంటే కొనుగోలుదారులు లభించకపోవచ్చు.                                                                                                                                                                                                                                                                                                                                                                               నేనొక మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే, సదరు డిస్ట్రిబ్యూటర్‌ సేవల విషయంలో సంతోషంగా లేను. కనుక ఈ మొత్తం పోర్ట్‌ఫోలియోని మరో బ్రోకర్‌ వద్దకు మార్చాలని అనుకుంటున్నాను. అలా చేస్తే నేను పన్ను చెల్లించాల్సి వస్తుందా? – సల్మాన్‌ అహ్మద్‌ 

మీ మొత్తం పోర్ట్‌ఫోలియోని ప్రస్తుత డిస్ట్రిబ్యూటర్‌ నుంచి నూతన డిస్ట్రిబ్యూటర్‌కు మార్చుకోవచ్చు. రాతపూర్వకంగా అభ్యర్థన ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ప్రస్తుత డిస్ట్రిబ్యూటర్‌ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ కోరకూడదు. 

పన్ను విషయానికొస్తే, దీనిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెట్టుబడులు కాకుండా, కేవలం డిస్ట్రిబ్యూటర్‌నే మారుస్తున్నారు. ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకం నుంచి మరో మ్యూచువల్‌ ఫండ్‌కు మారినా లేదా రెగ్యులర్‌ ప్లాన్‌ నుంచి డైరెక్ట్‌ ప్లాన్‌కు మారినా పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది. 

మరిన్ని వార్తలు