అశ్లీల కంటెంట్‌ కట్టడికి యాపిల్‌! ఇక ఐఫోన్లలో ఆ సాఫ్ట్‌వేర్‌.. వాట్సాప్‌ ఆగ్రహం

8 Aug, 2021 10:37 IST|Sakshi

సోషల్‌ మీడియా యాప్‌లలో అభ్యంతకర కంటెంట్‌ వైరల్‌ కావడం ఈమధ్య కాలంలో పెరిగింది. ఈ తరుణంలో వాట్సాప్‌లోనూ అలాంటి వ్యవహారాలు నడుస్తుండగా.. ‘రిపోర్టింగ్‌’ ద్వారా సదరు యూజర్‌ అకౌంట్‌, గ్రూపుల మీద చర్యలు తీసుకుంటోంది వాట్సాప్‌. అయితే ఇలాంటి కంటెంట్‌ కట్టడి కోసం యాపిల్‌ తీసుకున్న ఓ నిర్ణయం.. యూజర్‌ ప్రైవసీకి భంగం కలిగించేదిగా ఉందన్న చర్చకు దారితీసింది.

ఫొటో ఐడెంటిఫికేషన్‌ ఫీచర్‌ పేరిట ఐఫోన్లలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేయాలని.. తద్వారా వాట్సాప్‌ ఫొటోలను స్కాన్‌ చేసి ఆటోమేటిక్‌గా అభ్యంతరకర ఫొటోలను తొలగించే దిశగా యాపిల్‌ చర్యలు చేపట్టింది. కానీ, ఈ నిర్ణయాన్ని గట్టిగానే వ్యతిరేకిస్తోంది వాట్సాప్‌. ఈమేరకు వాట్సాప్‌ హెడ్‌ విల్‌క్యాథ్‌కార్ట్‌.. యాపిల్‌ కంపెనీ మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. అశ్లీలత కంటెంట్‌ గుర్తింపు-కట్టడి కోసం యాపిల్‌ ఎంతో కాలంగా కృషి చేస్తోంది. ఈ ప్రయత్నం అభినందనీయమే. కానీ, ఫొటో ఐడెంటిఫికేషన్‌ సాప్ట్‌వేర్‌ అనేది యూజర్‌ వ్యక్తిగత ‍స్వేచ్ఛకు భంగం కలిగించాలనే ప్రయత్నంగా భావించాల్సి వస్తుంది అని విల్‌ పేర్కొన్నాడు.

యాపిల్‌ రూపొందించబోయే సాఫ్ట్‌వేర్‌ కేవలం వాట్సాప్‌ స్కానింగ్‌తోనే ఆగదు. ఫోన్‌లోని వ్యక్తిగత ఫొటోలను, డేటాను సైతం స్కాన్‌ చేసే అవకాశం లేకపోలేదు. అంటే.. ఇది భద్రతాపరంగా కాకుండా.. యూజర్‌పై నిఘా వ్యవస్థలా పని చేస్తుంది. కాబట్టి ఇలాంటి టూల్స్‌ను వాట్సాప్‌ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోదు. అని స్పష్టం చేశాడు విల్‌. మరోవైపు సైబర్‌ నిపుణులు కూడా వాట్సాప్‌ వాదనతో ఏకీభవిస్తున్నారు. ఇదిలా అశ్లీల కంటెంట్‌, ముఖ్యంగా చైల్డ్‌ ఎబ్యూజ్‌ కంటెంట్‌ కట్టడి కోసం చేసే ప్రయత్నమని యాపిల్‌ బలంగా చెప్తోంది. అయినప్పటికీ  ‘రిపోర్ట్‌’ చేసే ఆప్షన్‌ యూజర్‌కి ఉండగా, వాళ్ల అనుమతి లేకుండా సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఫోన్‌ను, డివైజ్‌లను స్కానింగ్‌ చేయడం సరైందని కాదని సైబర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు యాపిల్‌ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. యూజర్‌ వ్యక్తిగత భద్రతపై ఎలాంటి హామీ ఇవ్వకుండానే.. ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఐవోస్‌, మాక్‌ఓస్‌, వాచ్‌ఓస్‌, ఐమెసేజ్‌ డివైజ్‌లలో వీలైనంత తొందరగా ఈ సాఫ్ట్‌వేర్‌ను యూజర్లకు అందించనున్నట్లు ప్రకటించింది. కొత్త వెర్షన్‌ అప్‌డేట్‌ ద్వారా ఈ సాఫ్ట్‌వేర్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్‌ కథనాల మ్యాగజీన్‌ ‘ది వర్జ్‌’ ఓ కథనం ప్రచురించింది.

మరిన్ని వార్తలు