కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన కంపెనీ

6 Nov, 2020 07:46 IST|Sakshi

ముంబై: తెలిసో తెలియకో వాట్సప్‌లో ఏదైనా కూడని పోస్ట్‌ లేదా వ్యాఖ్య పెట్టారా? ఏం ఫర్వాలేదు. మీ సెట్టింగ్స్‌లో మార్పు చేసుకుంటే సరి.. వారం రోజుల్లో మీ పోస్ట్‌ లేదా వ్యాఖ్య ఇట్టే మాయమైపోతుంది. ఈ మేరకు తాము సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు వాట్సాప్‌ స్వయంగా ప్రకటించింది. పోస్ట్‌ చేసిన కొన్ని నిమిషాల్లోపు దాన్ని తొలగించుకునే అవకాశం ఇప్పటివరకూ ఉన్న విషయం తెలిసిందే. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సెట్టింగ్స్‌లో మార్పులు చేసి వారం రోజుల్లోపు సందేశాలన్నీ మాయమైపోయేలా చేయడం అన్నది గత మెసేజీలకు వర్తించదు. వ్యక్తులకు పంపినవైనా, గ్రూపులు లేదా కంపెనీలు పంపిన సందేశాలైనా సరే.. అన్నింటినీ వారం రోజుల తరువాత మాయమయ్యేలా చేయవచ్చునని కంపెనీ ప్రకటించింది. కాకపోతే ఈ గ్రూపుల్లో ఈ ఫీచర్‌ను అడ్మిన్‌ మాత్రమే ఆన్‌/ఆఫ్‌ చేయగలరు. వాట్సాప్‌ను ఏడు రోజులపాటు ఓపెన్‌ చేయకపోయినా సందేశాలు మాయమైపోతాయని నోటిఫికేషన్‌లో మాత్రం సందేశాల ప్రివ్యూ అలాగే ఉంటుందని కంపెనీ వివరించింది.  

ఫొటోలూ గాయబ్‌... 
వాట్సాప్‌కు వచ్చే ఫొటోలు, వీడియోలు వాటంతట అవే ఫొటోస్‌ అన్న చోట నిక్షిప్తమవుతాయని మనకు తెలుసు. మాయమైపోయే సందేశాల ఫీచర్‌ను ఆన్‌ చేస్తే చాటింగ్‌ సందర్బంగా అందుకునే ఫొటోలు కూడా ఏడు రోజుల్లో మాయమైపోతాయి. ఆటో డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ ఆన్‌ చేసి ఉంటే మాత్రం అవి మీ ఫోన్‌లో నిక్షిప్తమైపోతాయి. ఎవరో పంపిన సందేశాలను ఫార్వర్డ్‌ చేసినప్పుడు... అందకునే వ్యక్తి వాట్సప్‌లో సందేశాలు మాయమయ్యే ఫీచర్‌ ఆఫ్‌లో ఉంటే ఫార్వర్డ్‌ చేసిన సందేశం మాయం కాదు. వాట్సాప్‌ సంభాషణలన్నింటినీ బ్యాకప్‌ చేసుకునే అలవాటు కొందరికి ఉంటుంది.

సందేశాలు ఇది ఆన్‌లో ఉన్నప్పుడు మాయమయ్యే ఫీచర్‌ను వాడటం మొదలుపెడితే.. ఆ తరువాత వచ్చే సందేశాలు బ్యాకప్‌లో ఉంటాయి కానీ.. మీరు బ్యాకప్‌ నుంచి పాత సందేశాలన్నింటినీ రీస్టోర్‌ చేయాలని చూసినప్పుడు మాత్రం మాయమైపోతాయి. అంతా బాగానే ఉంది కానీ.. ఈ ఫీచర్‌ను వాడటం ఎలా అంటున్నారా? చాలా సింపుల్‌. వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోని స్టోరేజ్‌ అండ్‌ డేటాను తెరవండి. అక్కడ స్టోరేజీ యూసేజ్‌ అన్న ఆప్షన్‌ను నొక్కితే అప్పటివరకూ మనం జరిపిన సంభాషణలన్నీ ఎంత మేరకు స్పేస్‌ ఆక్రమించాయో చూపుతుంది. అవసరమైన దాన్ని ఎంచుకోగానే కనిపించే ఫ్రీ అప్‌ స్పేస్‌ అన్న ఆప్షన్‌ను నొక్కితే ఆ చాట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అన్నీ మాయమై పోతాయన్నమాట. వాట్సాప్‌లో స్పేస్‌ తక్కువగా ఉంటోందని.. ఫోన్‌ స్పేస్‌ మొత్తాన్ని వాట్సప్‌ తినేస్తోందని సుమారు 200 కోట్ల మంది ఫిర్యాదు చేస్తే కంపెనీ ఈ మార్పులు చేసింది. 

వాట్సాప్‌ ‘చెల్లింపు’లకు ఎన్‌పీసీఐ ఆమోదముద్ర
ముంబై: మెసేజింగ్‌ యాప్, వాట్సాప్‌ ద్వారా చెల్లింపులకు ఎన్‌పీసీఐ(నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఆమోదం తెలిపింది. భారత్‌లో వాట్సాప్‌ వినియోగదారులు దాదాపు 40 కోట్ల మంది  ఉన్నారు. (గూగుల్‌ పే యూజర్లు 7.5 కోట్లు, ఫోన్‌ పే యూజర్లు 6 కోట్ల మంది ఉన్నారు)ఈ ఆమోదంతో డిజిటల్‌ చెల్లింపులు మరింత జోరుగా పెరుగుతాయని అంచనా. గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి ధర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్లు(టీపీయాప్స్‌) లావాదేవీలపై పరిమితి విధించిన నిమిషాల వ్యవధిలోనే ఎన్‌పీసీఐ వాట్సాప్‌కు ఈ ఆమోదాన్ని ఇచ్చింది. మొత్తం యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌)లావాదేవీల్లో ఒక్కో యాప్‌ లావాదేవీ 30 శాతానికి మించకూడదన్న పరిమితిని ఎన్‌పీసీఐ విధించింది. గత నెలలో యూపీఐ లావాదేవీలు 200 కోట్లను మించాయి. రానున్న కాలంలో ఈ లావాదేవీలు మరింతగా పెరిగే అవకాశాలుండటంతో ఒక్కో యాప్‌కు ఈ పరిమితిని ఎన్‌పీసీఐ విధించింది.  

మరిన్ని వార్తలు