డేటా గోప్యతకు కట్టుబడి ఉన్నాం: వాట్సాప్‌

20 Feb, 2021 05:10 IST|Sakshi

వాట్సాప్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: యూజర్ల వ్యక్తిగత సంభాషణల డేటా గోప్యత పాటించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి కూడా తెలియజేశామని మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తెలిపింది. కొత్త ప్రైవసీ పాలసీని ముందుగా ప్రకటించినట్లు మే 15 నుంచి అమల్లోకి తేనున్నట్లు వివరించింది. అయితే యూజర్లు ఈ అప్‌డేట్‌ గురించి యాప్‌ ద్వారా పూర్తి వివరాలు తీరిగ్గా చదువుకునేందుకు, తగినంత సమయం ఉంటుందని పేర్కొంది. ‘తప్పుడు ప్రచారం, యూజర్ల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ బట్టి వాట్సాప్‌ సర్వీసుల నిబంధనలను అంగీకరించేందుకు ఉద్దేశించిన గడువును మే 15 దాకా పొడిగించాం. ఈలోగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. వారి ప్రశ్నలకు సమాధానమిస్తున్నాం‘ అని వాట్సాప్‌ ఒక బ్లాగ్‌పోస్టులో పేర్కొంది.  

అప్‌డేట్‌ ఓకే చేయకున్నా కాల్స్‌ వస్తాయి కానీ..
రాబోయే రోజుల్లో అప్‌డేట్‌ గురించిన సమాచారాన్ని యాప్‌లో బ్యానర్‌గా డిస్‌ప్లే చేయనున్నట్లు వివరించింది. యూజర్ల సందేహాలన్నీ నివృత్తి చేసేలా దీన్ని తీర్చిదిద్దినట్లు, జనవరిలో చూసిన దానికి భిన్నంగా కొత్త ఇన్‌–యాప్‌ నోటిఫికేషన్‌ ఉంటుందని పేర్కొంది. ఒకవేళ మే 15 నాటికి కూడా కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయినా ఆయా యూజర్లు .. కాల్స్, నోటిఫికేషన్స్‌ పొందవచ్చని, కానీ మెసేజీలు పంపాలంటే మాత్రం అప్‌డేట్‌కి అంగీకరించాల్సి ఉంటుందని వాట్సాప్‌ స్పష్టం చేసింది. తమ మెసేజింగ్‌ యాప్‌ ద్వారా వ్యాపార సంస్థలతో లావాదేవీలు జరిపే యూజర్లకు సంబంధించిన కొంత డేటాను మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పాటు ఇతర గ్రూప్‌ కంపెనీలతో పంచుకునే విధంగా వాట్సాప్‌ అప్‌డేట్‌ ప్రకటించడం వివాదాస్పదంగా మారడం తెలిసిందే.

మరిన్ని వార్తలు