గోధుమ ఎగుమతులపై నిషేధం సానుకూలం

19 May, 2022 06:29 IST|Sakshi

ధరల ఒత్తిళ్లు తగ్గుతాయి

ద్రవ్యోల్బణం కొంత తగ్గుతుందన్న బార్‌క్లేస్‌

ముంబై: గోధుమల ఎగుమతులపై భారత్‌ విధించిన నిషేధం ద్రవ్యోల్బణం నియంత్రణకు కొంత సానుకూలమని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘ప్రస్తుత అధిక వేడి వాతావరణం గోధుమల దిగుబడికి ఎన్నో సవాళ్లను విసురుతోంది. ప్రభుత్వం అనూహ్యంగా గోధుమల ఎగుమతులను నిషేధించడం దేశీయంగా ధరల ఒత్తిళ్లను కొంత వరకు తగ్గించగలదు’’అని బార్‌క్లేస్‌ పేర్కొంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ నెలకు 8 శాతం సమీపానికి చేరడం తెలిసిందే. కొద్ది కాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే ఇది కొనసాగొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఆర్‌బీఐ రెపో రేటు పెంపు, గోధుమల ఎగుమతులపై నిషేధం సానుకూలిస్తాయన్న అభిప్రాయాలను బార్‌క్లేస్‌ వ్యక్తం చేసింది. గోధుమల ధరలు 10 శాతం పెరిగితే ద్రవ్యోల్బణంపై 0.27 శాతం ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఇండోనేషియా పామాయిల్‌ ఎగుమతులను నిషేధించడం, సెర్బియా, కజకిస్థాన్‌ ఆహార ధాన్యాల ఎగుమతులను నిషేధించిన తరహాలోనే భారత్‌ నిర్ణయం కూడా ఉందని బార్‌క్లేస్‌ గుర్తు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోధుమల ధరలు ఇప్పటికే 44 శాతం పెరగ్గగా.. దేశీయంగా మూడు శాతమే పెరగడం గమనార్హం. ఎగుమతులపై నిషేధం విధించకుండా 10 మిలియన్‌ టన్నుల సమీకరణ లక్ష్యాన్ని ధరలపై ఒత్తిడి లేకుండా ప్రభుత్వం సాధించడం కష్టమవుతుందని బార్‌క్లేస్‌ నివేదిక పేర్కొంది. 

మరిన్ని వార్తలు