గ్లోబల్‌ మార్కెట్లపై గోధుమ ఎగుమతుల నిషేధ ప్రభావం నిల్‌: కేంద్ర మంత్రి

26 May, 2022 11:15 IST|Sakshi

దేశ గోధుమ ఎగుమతులు ప్రపంచ వాణిజ్యంలో 1 శాతం కంటే తక్కువ:  పీయూష్‌ గోయల్‌

ఎగుమతి నియంత్రణ ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయదు

దావోస్‌: భారతదేశ గోధుమ ఎగుమతులు ప్రపంచ వాణిజ్యంలో ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కమోడిటీ ఎగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై ఎంతమాత్రం ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. బలహీన అలాగే పొరుగు దేశాలకు ఎగుమతులను భారతదేశం కొనసాగిస్తుందని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతర్జాతీయ గోధుమల మార్కెట్‌లో భారతదేశం ఎప్పుడూ కీలకప్రాత్ర పోషించలేదని వివరించారు. ఇంకా చెప్పాలంటే రెండేళ్ల క్రితం వరకూ భారత్‌ గోధుమలను ఎగుమతే చేయలేదని తెలిపారు.

దేశం 2 మిలియన్‌ టన్నులతో ఎగుమతులను ప్రారంభించిందని, గత సంవత్సరం ఈ పరిమాణం ఏడు మిలియన్‌ టన్నులుగా ఉందని గోయల్‌ చెప్పారు. ఉక్రెయిన్‌–రష్యాల మధ్య యుద్ధ పరిస్థితి ఏర్పడిన తర్వాత గత రెండు నెలల్లో దేశ గోధుమ ఎగుమతులు పెరిగినట్లు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో జరిగిన సెషన్‌లో అన్నారు.  మొదట్లో ఉత్పత్తి దాదాపు 7 లేదా 8 శాతం పెరుగుతుందని భారత్‌ అంచనా వేసిందన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో చాలా తీవ్రమైన వేడి వాతావరణం వల్ల ఉత్పత్తిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

పెరుగుతున్న దేశీయ ధరలను నియంత్రించడానికి, అలాగే పొరుగు,  బలహీన దేశాల ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం గోధుమ ఎగుమతులను మే 13న నిషేధించింది. అయితే, ఇతర దేశాల (వారి ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా) ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి, ప్రభుత్వం అనుమతుల మేరకు ఎగుమతులకు వెసులుబాటు కల్పించింది.

ఉత్పత్తి-గుమతి ఇలా... 
2021–22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ గోధుమల ఎగుమతులు 7 మిలియన్‌ టన్నులు. దీని విలువ 2.05 బిలియన్‌ డాలర్లు.  విదేశాల నుండి భారత్‌ గోధుమలకు మెరుగైన డిమాండ్‌ ఉంది. మొత్తం గోధుమ ఎగుమతుల్లో 50 శాతం సరుకులు గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్‌కు ఎగుమతయ్యాయి. గోధుమ పంటపై మే 14న వ్యవసాయ కార్యదర్శి మనోజ్‌ అహుజా ప్రకటన ప్రకారం, 2021–22 పంట సంవత్సరంలో (జూలై–జూన్‌) దిగుబడి అంచనా పరిమాణం 111.32 మిలియన్‌ టన్నులు. అయితే 105–106 మిలియన్‌ టన్నులకు పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది. 2020–21 పంట కాలంలో ఉత్పత్తి 109 మిలియన్‌ టన్నులు.  

మరిన్ని వార్తలు