పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.. చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్ లాభమేనా?

4 Dec, 2023 07:27 IST|Sakshi

నేను ప్రభుత్వ ఉద్యోగిని. ప్రభుత్వం నుంచి హెల్త్‌ రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం ఉంది. అయినా కానీ, నేను వ్యక్తిగతంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవాలా?అమిత్‌ సోలంకి

ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా హెల్త్‌ స్కీమ్‌ల కింద కవరేజీ ఉంటుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ (సీజీహెచ్‌ఎస్‌) కింద రక్షణ లభిస్తుంది. ఉద్యోగులతో పాటు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సైతం ఈ పథకం కింద కవరేజీ లభిస్తుంది. అలాగే, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం తరఫున హెల్త్‌ కవరేజీ ఉద్యోగులకు ఉంటుంది. 

తెలంగాణ స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ జర్నలిస్ట్స్‌ హెల్త్‌ స్కీమ్, వెస్ట్‌ బెంగాల్‌ హెల్త్‌ స్కీమ్‌ ఇందుకు ఉదాహరణలు. ప్రభుత్వ, ఎంపానెల్డ్‌ ఆస్పత్రుల్లో వైద్య కిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాల కొనుగోలుకు వీటి పరిధిలో కవరేజీ వస్తుంది. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, సిద్ధ, యోగ చికిత్సలకూ వీరు రీయింబర్స్‌మెంట్‌ పొందొచ్చు. 

అత్యవసర చికిత్స/వైద్యం, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగులకు పరిహారం వస్తుంది. కాకపోతే అన్ని రకాల ఆస్పత్రుల్లో చికిత్సలు పొందే వెసులుబాటు ఉండదు. ఎంపిక చేసిన ఆస్పత్రుల వరకే ఈ కవరేజీ పరిమితంగా ఉంటుంది. పైగా ప్రభుత్వ ఆమోదిత ఆస్పత్రులు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలని లేదు. ప్రధాన పట్టణాల్లోనే ఇవి ఉంటాయి. కనుక మీకు సమీపంలోని ఏఏ ఆస్పత్రుల్లో కవరేజీ ఉంటుందో ముందు తెలుసుకోండి. అక్కడ ఉండే వసతులు ఏ మేరకో విచారించుకోవాలి. 

ప్రభుత్వ ఆమోదం ఉన్న ఆస్పత్రి మీకు సమీపంలో లేకపోయినా, లేదంటే మెరుగైన వసతులతో అందుబాటులో లేకపోయినా, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని ఆస్పత్రిలో వైద్యం పొందాలనుకుంటే.. అప్పుడు వ్యక్తిగత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ప్రైవేటు బీమా సంస్థ నుం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. వృద్ధాప్యం వచ్చే వరకు ఆగకుండా, యుక్త వయసులోనే వ్యక్తిగత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. మంచి ట్రాక్‌ రికార్డు కూడా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకోవాల్సి వస్తే కో పే షరతును ఆమోదించాల్సి రావచ్చు. కోపే వద్దనుకుంటే ప్రీమియం భారీగా ఉంటుంది. కనీసం రూ.5 లక్షల వరకు వ్యక్తిగత హెల్త్‌ కవరేజీ ప్లాన్‌ను తీసుకోవాలి.

పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకోవాలి? మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు ఆఫర్‌ చేసే చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్లు లాభదాయకమేనా?ఆశా

పిల్లల కోసం ఏ తరహా పెట్టుబడి అనుకూలంగా ఉంటుంది? వారు చాలా చిన్న వయసులోనే ఉంటే ఈక్విటీ ఫండ్స్‌ అనుకూలం. మీకు ఈక్విటీల పట్ల తగినంత అనుభవం ఉంటే, వీలైనంత ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ తీసుకోవచ్చు. 10–12 ఏళ్లపాటు పిల్లల కోసం ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత వారు కాలేజీలోకి అడుగు పెట్టే సమయం వస్తుంది. దానికి మూడేళ్ల ముందే సన్నద్ధం కావాలి. మొదటి సంవత్సరం కాలేజీకి కోసం కావాల్సిన మొత్తాన్ని మూడేళ్ల ముందే వెనక్కి తీసుకోవాలి. 

కాలేజీ రెండో సంవత్సరం కోసం కావాల్సిన మొత్తాన్ని ఏడాది విరామం తర్వాత తీసుకోవాలి. ఇలా చేస్తే మార్కెట్‌లో ఆటుపోట్లు ఉన్నా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎవరైనా కానీ, పిల్లల విద్య కోసం ఈక్విటీల్లో మదుపు చేస్తున్నట్టు అయితే ఈ విధానాన్ని అనుసరించొచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీలు ఆఫర్‌ చేసే చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్‌లు అంత అర్థవంతమైనవి కావు. ఎందుకంటే అనవసరమైన నిర్బంధాలు వీటిల్లో ఉండడమే కారణం.

>
మరిన్ని వార్తలు