స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌.. పెట్టుబడికి ఏదీ మంచిది ?

30 Aug, 2021 07:38 IST|Sakshi

నేను యాక్సిస్‌ మిడ్‌క్యాప్, యాక్సిస్‌ బ్లూచిప్, మిరేఅస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ పథకాల్లో గత రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. రాబడుల విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. అయితే, కొన్ని కంపెనీల షేర్లు సైతం ఇదే కాలంలో 100–200 శాతం పెరగడాన్ని గమనించాను. కనుక మంచి రాబడుల కోసం నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలా లేక మ్యూచువల్‌ ఫండ్స్‌లోనా? – ప్రశాంత్‌ 
మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న మూడు పథకాలు కూడా మంచివే. వీటితో కూడిన పోర్ట్‌ఫోలియో సమతూకంగానే ఉంది. అయితే, యాక్సిస్‌కు చెందిన రెండు పథకాల్లో ఏదో ఒక దానిలోనే ఇన్వెస్ట్‌ చేసుకుని.. ఇతర ఫండ్‌హౌస్‌కు చెందిన మరో పథకాన్ని ఎంపిక చేసుకోండి. దీనివల్ల వైవిధ్యం పెరిగి రిస్క్‌ తగ్గుతుంది. ఈ మూడు పథకాల్లోనూ సమానంగా ఇన్వెస్ట్‌ చేసి ఉంటే.. అప్పుడు మూడింట రెండొంతులు యాక్సిస్‌ ఫండ్‌ పథకాల్లోనే ఉంటుంది. ఎప్పుడైనా సంబంధిత ఫండ్‌హౌస్‌ పరంగా అంచనాలు తప్పితే రాబడులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని యాక్సిస్‌కు చెందిన ఒకే పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకుని, రెండో పథకానికి బదులు ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోండి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో రాబడులను.. ఏ కంపెనీ షేరుతోనూ పోల్చి చూడకూడదు. మీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం పనితీరును సంబంధిత సూచీ రాబడులతోనే పోల్చి చూడాలి. అంటే మిడ్‌క్యాప్‌ పథకాన్ని మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ రాబడులతోనే పోల్చి చూడాలి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు కేవలం ఒకటి, రెండు కంపెనీల్లోనే పెట్టుబడులకు పరిమితం కాకూడదు. తగినంత వైవిధ్యం కోసం కనీసం 10–20 కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా పోర్ట్‌ఫోలియో నిర్వహించినట్టయితే రాబడులు మోస్తరుగా ఉంటాయి. రిస్క్‌ కూడా తగ్గుతుంది. ఎవరైనా కానీ ఒక కంపెనీ 200 శాతం రాబడులను ఇస్తుందని పెట్టుబడులన్నింటినీ అందులోనే ఇన్వెస్ట్‌ చేయడం సరికాదు. 200 శాతం రాబడులకు అవకాశం ఎలా అయితే ఉంటుందో.. కొనుగోలు ధర నుంచి 60–70 శాతం పతనానికీ అవకాశం ఉంటుంది. ఈ రిస్క్‌లు అన్నింటినీ పరిగణనలోకి తీసుకునే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంటాయి. అలాంటప్పుడు రాబడులు మోస్తరు నుంచి మెరుగ్గా దీర్ఘకాలానికి ఉంటాయి.  

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో రూ.10లక్షలను ఏకమొత్తంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇది సరైన సమయమేనా? నేను కనీసం పదేళ్లపాటు నా పెట్టుబడులను కొనసాగించగలను  – గజేంద్ర 
రూ.10లక్షలు అన్నవి మీకు అంత అవసరమైనవి కాకపోతే ఒకే విడత ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. కానీ, ఒకేసారి గణనీయమైన పెట్టుబడి మొతాన్ని ఇన్వెస్ట్‌ చేయడం సరైనది కాదు. ఒకవేళ ఒకేవిడత ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత మార్కెట్లు కిందకు వెళితే మీరు కచ్చితంగా భయానికి లోనవుతారు. భయపడి పెట్టుబడులను నష్టాలతో వెనక్కి తీసుకోవడం వల్ల దీర్ఘకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్న  మీ ప్రాథమిక లక్ష్యం దెబ్బతింటుంది. కనుక క్రమంగా ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. మీదగ్గర ఉన్న పెట్టుబడులను వచ్చే 12–15 నెలల కాలంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. మీకు భారీ పెట్టుబడి అనిపిస్తే 18–36 నెలల పరిధిలో పెట్టుబడులు పెట్టడాన్ని విస్తరించుకోవడం కూడా సూచనీయం.  

రిటైర్‌ అయిన వ్యక్తి క్రమ ఆదాయం కోసం ఎన్‌పీఎస్‌ టైర్‌–2 అకౌంట్‌ను వాడుకోవచ్చా?  – ఎం.మాధుర్‌ 
ఆదాయం పన్ను పరిధిలో లేకపోతే మీ సౌకర్యం ప్రకారం ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే ఎన్‌పీఎస్‌ సరైన ఆప్షన్‌ అవుతుంది. మీ అస్సెట్‌ అలోకేషన్‌ (ఏ విభాగంలో ఎంత మేర కేటా యింపులు) ఆధారంగా ఈ తరహా పెట్టుబడి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో అందుబాటులో ఉన్న మూడు రకాల ఆప్షన్లలో సరైనది ఎంపిక చేసుకోవడం మీ బాధ్యతే. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ విభాగానికి ఎంత కేటాయింపులు చేయగలరు, ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్‌ బాండ్ల లో ఎంత ఇన్వెస్ట్‌ చేయగలరనే దాని ఆధారంగా ఎంపిక ఉంటుంది.  స్థిరాదాయ పథకాల కంటే ఎక్కువ రాబడులను మీరు ఆశిస్తున్నట్టు అయితే.. మీ ఆదాయం రూ.6.5 లక్షల వరకు ఉన్నట్టయితే అప్పుడు రూ.1.5 లక్షలను పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. దీంతో మిగిలిన రూ.5లక్షలపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసేట్టు అయితే ఈక్విటీలకు కేటాయింపులు 20–30% మించనీయకండి. డబ్బులను వెనక్కి తీసుకోవాలంటే కూడా స్థిరాదాయ ప్లాన్ల నుంచే తీసుకోవాలి. ఇదే మాదిరి మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.   
- ధీరేంద్ర కుమార్‌,  సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

చదవండి: ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్‌ఆఫర్‌ ప్రకటించిన జిరోదా..!

>
మరిన్ని వార్తలు