ట్విట్టర్‌లో ‘చైనా ఏజెంట్లు’, బాంబు పేల్చిన విజిల్ బ్లోయర్‌!

14 Sep, 2022 12:08 IST|Sakshi

ట్విట్టర్‌పై ప్రముఖ హ్యాకర్‌, ఆ సంస్థ మాజీ సెక్యూరిటీ చీఫ్‌ అధికారి పీటర్ ముడ్జ్ జాట్కో (పీటర్‌ జాట్కో) విజిల్ బ్లోయర్‌గా మారి చేస్తున్న ఆరోపణలు చర్చాంశనీయంగా మారుతున్నాయి. ట్విట్టర్‌ కొనుగోలును రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌ నిర్ణయంపై వచ్చే నెల అక్టోబర్‌ 17న డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో విచారణ జరగనుంది. ఈ తరుణంలో పీటర్‌ జాట్కోస్‌..ట్విట్టర్‌లో చైనా ఏజెంట‍్లు పనిచేస్తున్నారంటూ బాంబు పేల్చారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని యూఎస్‌ సెనేట్‌ కమిటీ సభ్యుల విచారణ ముందు ఉంచారు. 

పీటర్‌ జాట్కోస్‌ ట్విట్టర్‌ మాజీ సెక్యూరిటీ చీఫ్‌ అధికారిగా విధులు నిర్వహించారు. ఆయన పని చేసే సమయంలో గుర్తించిన సంస్థలోని సెక్యూరిటీ లోపాల్ని బయట పెట్టడంతో పాటు..ట్విట్టర్‌లో చైనా ఏజెంట్లు పనిచేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం జరిగిన విచారణలో యూఎస్‌ సెనేట్‌ సభ్యుల ముందు తాను చేసిన ఆరోపణలపై పీటర్‌ జాట్కోస్‌ సాక్ష్యాల్ని ముందుంచారు.  

ఈ సందర్భంగా 2011లో ట్విట్టర్‌, యూఎస్‌ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్‌టీసీ)ల మధ్య జరిగిన భద్రతా పరమైన నిబంధనల్ని సంస్థ ఉల్లంఘించిందని మండిపడ్డారు. ఆ ఉల్లంఘనలు సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఇక, ట్విట్టర్‌లో వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ ఏజెంట్లు ఒకరు లేదా ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారని పునరుద్ఘాటించారు.   

తాజాగా చైనాని టార్గెట్‌ చేసిన పీటర్‌ జాట్కోస్‌.. కొద్ది రోజుల క్రితం భారత ప్రభుత్వంపై ఇదే విధమైన ఆరోపణలు చేశారు. దేశంలో నిరసన కారుల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్‌ చేసేందుకు వీలుగా భారత ప్రభుత్వం తన ఏజెంట్‌లను.. ఉద్యోగులుగా నియమించుకోవాలంటూ ట్విట్టర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు.

పీటర్‌ జాట్కోస్‌ తొలగింపు 
మాజీ సెక్యూరిటీ చీఫ్‌ అధికారి పీటర్ ముడ్జ్ జాట్కోను ట్విట్టర్‌ అర్ధాంతరంగా తొలగించింది. సరైనా కారణం చూపకుండా..అసమర్థ నాయకత్వం,పేలవమైన పనితీరు వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే తనని తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జాట్కో..ట్విట్టర్‌ రహస్యాల్ని బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటికే జాట్కో తీరుతో ట్విట్టర్‌ దిగివచ్చింది. సంస్థ రహస్యాల్ని బయట పెట్టకుండా ఉండేందుకు గాను జాట్కోతో రహస్య ఒప్పందం జరిగేలా చర్చించినట్లు, 7 బిలియన్‌ డాలర్ల భారీ మొత్తాన్ని ఇవ్వ చూపినట్లు పలు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి.

మరిన్ని వార్తలు