తులసిభాయ్‌.. ఆ ప్రముఖుడికి కొత్త పేరు పెట్టిన ప్రధాని మోదీ

20 Apr, 2022 16:44 IST|Sakshi

గ్లోబల్‌ ఆయుష్‌ సమ్మిట్‌ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టెడ్రోస్‌ ని కొత్త పేరుతో పిలుస్తానంటూ మోదీ చెప్పారు. అనంతరం టెడ్రోస్‌ను తులసీభాయ్‌గా ప్రధాని పేర్కొన్నారు. అనంతరం డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆవిష్కరిస్తుందంటూ ప్రశంసించారు. సంప్రదాయ వైద్య విధానాలను కాపాడుకోవడంలో ఇండియా ఛాంపియన్‌గా నిలుస్తోందన్నారు. 

150కి పైగా ఎంవోయూలు
గుజరాతి రాజధాని గాంధీనగర్‌లో ఆయుష్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ను ప్రధాని మోదీ  బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆయుర్వేద రంగంలో పెట్టుబడులకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఔషధ మొక్కలకు ఇండియా పుట్టిళ్లన్నారు. మెడిసినల్‌ ప్లాంట్స్‌ని గ్రీన్‌గోల్డ్‌గా అభివర్ణించారు. ఆయుష్‌ ఉత్పత్తి చేస్తున్న మందులు 150కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నట్టు ప్రధాని తెలిపారు. ఆయుష్‌ ఆహార్‌ ద్వారా ఫుడ్‌ సప్లిమెంట్స్‌ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఆయుష్‌ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద నిపుణులు, తయారీదారులతో బలమైన నెట్‌వర్క్‌ తయారు చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 50 కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయి. 

గ్రీన్‌ గోల్డ్
ఆయుర్వేదాన్ని గ్రీన్‌ గోల్డ్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయుర్వేదానికి రోజురోజుకు డిమాండ్‌ పెరుగతుందన్నారు.  2014లో మూడు బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఆయుష్‌ ఉత్పత్తుల విలువ నేడు 18 బిలియన్‌ డాలర్లకు పెరగడమే ఇందుకు ఉదాహారణ అన్నారు. ఆయుర్వేద చికిత్స కోసం ఇండియా వచ్చే విదేశీయుల కోసం ప్రత్యేకంగా ఆయుష్‌ వీసాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.

భారత్‌ను మరువలేం
సంప్రదాయ మెడిసిన్స్‌ని ప్రోత్సహిస్తున్న భారత ప్రభుత్వాన్ని మారిషస్‌ ప్రధాని ప్రవీణ్‌ కుమార్‌ జగన్నాత్‌ మెచ్చుకున్నారు. వైద్య రంగంలో మారిషన్‌కు భారత్‌ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. మారిషన్‌లో ఆయుర్వేద కాలేజీ నిర్మించడంతో పాటు కోవిడ్‌ సమయంలో భారత్‌ ఎంతో అండగా ఉందని ఆయన తెలిపారు.
చదవండి: సంప్రదాయ వైద్యానికి సమయమిదే!

మరిన్ని వార్తలు