Wholesale Price: చుక్కలు చూపిస్తున్న హోల్ సేల్ ధరలు

15 Sep, 2021 09:35 IST|Sakshi

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్‌ ఆగస్టులో 11.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే ఈ బాస్కెట్‌ ఉత్పత్తుల ధర 11.39 శాతం పెరిగిందన్నమాట. సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ధరలుసహా అన్ని విభాగాల్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన  గణాంకాల ప్రకారం,  ఒక్క ఆహార ఉత్పత్తుల విభాగం మాత్రం ఊరటనిస్తోంది. వరుసగా ఐదు నెలల నుంచీ టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగుతోంది.  

ముఖ్య విభాగాలు ఇలా... 
ఆహార ఉత్పత్తుల ధరలు వరుసగా నాల్గవ నెలా తగ్గాయి. ఆగస్టులో అసలు పెరక్కపోగా 1.29 శాతం దిగివచ్చాయి. అయితే ఉల్లి (62.78 శాతం), పప్పు దినుసుల (9.41 శాతం) ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కూరగాయల ధరలు 13.30 శాతం తగ్గాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీ రేటు రెపోకు (ప్రస్తుతం 4 శాతం) ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో పూర్తి అదుపులోకి (5.3 శాతం) వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం ఈ శ్రేణి 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి.  

క్రూడ్, పెట్రోలియం, సహజవాయువుల ధరలు 40.03 శాతం ఎగశాయి. ఫ్యూయల్, పవర్‌ విషయంలో ద్రవ్యోల్బణం 26.1 శాతంగా ఉంది. ఎల్‌పీజీ (48.1 శాతం), పెట్రోల్‌ (61.5 శాతం), డీజిల్‌ (50.7 శాతం) ధరలు భారీగా ఎగశాయి.

తయారీ ఉత్పత్తుల ధరలు 11.39% పెరిగాయి. జూలైలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 11.20%గా ఉంది. వరుసగా నాలుగు నెలల నుంచీ తయారీలో ధరల స్పీడ్‌ రెండు అంకెలపైన కొనసాగుతోంది.  

మరిన్ని వార్తలు