కంపెనీల్లో ఆత్రుత..ఐపీవో తుఫాన్‌

21 Aug, 2021 10:20 IST|Sakshi

ముంబై: తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) కోసం కంపెనీల్లో ఆత్రుత పెరుగుతోంది. ఒకదాని వెంట ఒకటి ఐపీవోకు దరఖాస్తులు దాఖలు చేస్తూనే ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల వద్ద స్థిరంగా కొనసాగుతుండడం కంపెనీలను ఐపీవో వైపు వేగంగా అడుగులు వేయిస్తున్నాయి. దాదాపు అన్ని ఐపీవోలు అధిక స్పందన అందుకుంటుండడంతో.. ఇంతకుమించిన అనుకూలత ఉండదన్న ధోరణి కంపెనీల్లో కనిపిస్తోంది. 

ఆగస్ట్‌లో మొదటి 20 రోజుల్లోనే ఐపీవోలకు అనుమతి కోరుతూ 23 దరఖాస్తులు సెబీ వద్ద దాఖలయ్యాయి. అంతేకాదు ఈనెల్లో ఇప్పటికే 18 కంపెనీలు ఇష్యూలను పూర్తి చేసుకుని రూ.18,200 కోట్లను ప్రజల నుంచి సమీకరించేశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 40 కంపెనీలు లిస్ట్‌ అయ్యాయి. ఇవి రూ.70,000 కోట్లను ప్రజల నుంచి సమీకరించాయి. ప్రతీ ఐపీవోలోనూ రిటైల్‌ ఇన్వెస్టర్లు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 100 రెట్లకు పైగా బిడ్లు అందుకున్న ఐపీవోలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీవోల సంఖ్య సెంచరీ (100) దాటుతుందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 

ప్రముఖ కంపెనీలు..  
ఈ నెలలో ఐపీవోకు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన వాటిల్లో ఢిల్లీలోకి చెందిన పీబీ ఇన్ఫోటెక్‌ (పాలసీబజార్‌) ముఖ్యమైనది. రూ.6,000 కోట్లను ఐపీవో ద్వారా సమీకరించే ప్రణాళికతో ఈ సంస్థ ఉంది. పుణెకు చెందిన ఎమ్‌క్యూర్‌ ఫార్మా సైతం రూ.5,000 కోట్ల ఇష్యూను చేపట్టాలనుకుంటోంది. ఈ సంస్థ కూడా దరఖాస్తు సమర్పించింది. అలాగే, ఇతర ప్రముఖ సంస్థల్లో ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అదానీ విల్‌మార్‌ (రూ.4,500 కోట్లు), ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ ఉత్పత్తుల విక్రయ సంస్థ నైకా (రూ.4,000 కోట్లు) కూడా ఉన్నాయి. ట్రావెల్‌ బుకింగ్‌ సేవలు అందించే ఇక్సిగో మాతృసంస్థ లీట్రావెన్యూస్‌ టెక్నాలజీ సైతం రూ.1,800 కోట్ల సమీకరణకు ఐపీవో దరఖాస్తు దాఖలు చేసింది. ఎస్‌ఏఏఎస్‌ కంపెనీ రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌ కూడా రూ.1,500 కోట్ల సమీకరణకు ఐపీవోకు రానుంది. ఈ జాబితాలో ఇంకా టార్సన్స్‌ ప్రొడక్ట్స్, వీఎల్‌సీసీ, సాఫైర్‌ ఫుడ్స్, గోఫ్యాషన్‌ ఇండియా, ఫ్యూజన్‌ మైక్రోఫైనాన్స్, ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ కూడా ఉన్నాయి. ఇటీవలే ఐపీవో పూర్తి చేసుకున్న సిమెంట్‌ తయారీ కంపెనీ నువోకో విస్టా కార్పొరేషన్‌ వచ్చే సోమవారం లిస్ట్‌ కానుంది. ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందిన ఐపీవోల్లో జొమాటో, తత్వచింతన్‌ ఫార్మా, జీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ తదితర కంపెనీలుండడం గమనార్హం.  

మరిన్ని వార్తలు