ఐఆర్‌సీటీసీకి పోటీగా అదానీ గ్రూప్‌.. జైరామ్‌ వ్యాఖ్యల్ని ఖండించిన ఐఆర్‌సీటీసీ

19 Jun, 2023 15:22 IST|Sakshi

ఆన్‌లైన్‌ ట్రైన్‌ బుకింగ్‌ సంస్థ ట్రైన్‌మ్యాన్‌ (స్టార్క్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రై.లిమిటెడ్‌)ను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ అదానీ డిజిటల్‌ ల్యాబ్స్‌ ఈ స్టార్టప్‌ను దక్కించున్న విషయం తెలిసిందే. 

అయితే, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)కు అదానీ గ్రూప్‌ సొంతం చేసుకున్న ట్రైన్‌ మ్యాన్‌ పోటీగా రానుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్‌లపై ఐఆర్‌సీటీసీ స్పందించింది. 

ఐఆర్‌సీటీసీ గుర్తింపు పొందిన బిజినెస్‌ టూ కస్టమర్‌ సర్వీసులు (బీ2సీ) అందించే 32 సంస్థల్లో ట్రైన్‌ మ్యాన్‌ ఒకటి. 0.13 శాతం మాత్రమే ప్రయాణికులకు ట్రైన్‌ టికెట్ల రిజర్వేషన్‌తో పాటు ఇతర సర్వీసులు అందిస్తుంది. కానీ, ఇండియన్‌ రైల్వేస్‌లో రోజుకు 14.5లక్షల రిజర్వేషన్‌ టికెట్లు బుకింగ్‌ అవుతున్నాయి. వాటిలో 81శాతం ఇ-టికెట్లు ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేస్తున్నట్లు ట్వీట్‌ చేసింది. 

ప్రస్తుతం, ఐఆర్‌సీటీసీకి ట్రైన్‌ మ్యాన్‌ పోటీ అంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల‍్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. అదానీ గ్రూప్‌.. ట్రైన్‌ మ్యాన్‌ను కొనుగోలు చేయడం వల్ల  కార్యకలాపాల్లో ఎలాంటి తేడాలు ఉండవు. ఐఆర్‌సీటీసీ సేవలు నిర్విరామంగా కొనసాగుతాయి. ఐఆర్‌సీటీసీకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.   

కాగా, అదానీ గ్రూప్ మొదట ఐఆర్‌సీటీసీతో పోటీ పడుతుందని, తరువాత స్వాధీనం చేసుకుంటుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన ఆరోపణల్ని సైతం ఐఆర్‌సీటీసీ కొట్టిపారేసింది.

చదవండి👉 స్టార‍్టప్‌ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్‌మ్యాన్‌’!

మరిన్ని వార్తలు