మళ్లీ బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా?

11 Apr, 2021 17:48 IST|Sakshi

గత వారం రోజులుగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మార్చి  31న 44,228 రూపాయలు ఉన్న 24 క్యారెట్ల స్వచ్ఛ బంగారం ధర నిన్నటికి రూ.46,554కు చేరుకుంది. ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు పెరుగుతున్న కారణంగా మున్ముందు ఎలా ఉంటుందనే అనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. ద్రవ్యోల్భణం పెరగడం, కరోనా కేసులు తిరిగి ఎక్కువ అవుతుండటం వంటి అంశాలు బంగారం పెరుగుదలకు దోహదపడవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.49,000ను క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి సమీప భవిష్యత్తులో బంగారం కొనుగోలు చేయాలని భావించేవారు ఇప్పుడే తీసుకోవడం సరైన చర్యగా చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల నుంచి 1820 డాలర్లకు చేరుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విదిస్తే కనుక ఆ ప్రభావం బిజినెస్ మీద పడి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగే అవకాశం ఉంది. దింతో చాలా మంది స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకొని బంగారం మీద స్వల్పకాలానికి పెట్టుబడులు పెడతారు. ఈ కారణం చేత ధరలు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

చదవండి: 

అంచనాలను మించిన ఆదాయపన్ను వసూళ్లు

>
మరిన్ని వార్తలు