రిటైల్‌ రుణాలు.. రయ్‌రయ్‌!

3 Apr, 2021 06:31 IST|Sakshi

రిటైల్‌ రంగ రుణాలపై బ్యాంకుల గురి

సేవల రంగ రుణాలను మించిన వ్యక్తిగత విభాగం

త్వరలోనే కార్పొరేట్‌ రుణాలనూ అధిగమించే చాన్స్‌

గృహ, వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు రుణాలకు ప్రాధాన్యం  

గతంలో ఎన్నడూ ఎరుగని విధంగా కొద్ది నెలలనుంచీ దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సరికొత్త ట్రెండ్‌ కనిపిస్తోంది. ఇటీవల పలు బ్యాంకింగ్‌ దిగ్గజాలు కార్పొరేట్‌ విభాగానికి బదులుగా రిటైల్‌ రుణాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. దీంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలో రిటైల్‌ రుణ విభాగం పైచేయి సాధించనున్నట్లు అంచనాలు నెలకొన్నాయి. వెరసి కార్పొరేట్‌ రుణాలను మించి అగ్రస్థానానికి చేరే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ముంబై: దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థలో మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2020–21).. కీలక మార్పులకు వేదిక కానుంది. కొన్ని నెలలుగా గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డులు తదితరాలపట్ల బ్యాంకులు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. దీంతో కార్పొరేట్‌ రంగ డెట్‌ను వ్యక్తిగత రుణ విభాగం అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ 18వరకూ) బ్యాంకింగ్‌ వ్యవస్థలో మొత్తం(అవుట్‌స్టాండింగ్‌) పారిశ్రామిక, కార్పొరేట్‌ రుణాలు 1.2 శాతం తగ్గి రూ. 27.6 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో వ్యక్తిగత రుణాలు 9.5 శాతం జంప్‌చేసి రూ. 26.6 లక్షల కోట్లను తాకాయి. ఇక సర్వీసుల రంగ రుణాలు 25.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వెరసి దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో వ్యక్తిగత రుణ విభాగం సర్వీసుల రంగ రుణాలను మించి రెండో ర్యాంకుకు చేరింది.  

వెనకడుగులో..: పారిశ్రామిక, కార్పొరేట్‌ రుణ విభాగాలలో 2014–15 మొదలు రికవరీ కనిపించడంలేదని బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు వ్యక్తిగత రుణ విభాగంపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలియజేశాయి. ఫలితంగా గృహ, ఆటో రుణాలు, క్రెడిట్‌ కార్డులు వృద్ధి బాటలో సాగుతున్నట్లు నార్నోలియా సెక్యూరిటీస్‌ సీఐవో శైలేంద్ర కుమార్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం పారిశ్రామిక, కార్పొరేట్‌ లోన్‌బుక్‌ నీరసిస్తూ వస్తోంది. తాజా రుణ మంజూరీకంటే చెల్లింపులు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 9 నెలల్లో పారిశ్రామిక రుణాలు 5 శాతం క్షీణించగా.. సర్వీసుల రంగ రుణాలు 0.6 శాతం మందగించాయి. అయితే వ్యక్తిగత రుణాలు 4.3 శాతం పుంజుకున్నాయి. వ్యవసాయ రుణాలైతే 7.6 శాతం ఎగశాయి. దీంతో సమీప కాలంలో రిటైల్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియో దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో అతిపెద్ద విభాగంగా ఆవిర్భవించే వీలున్నట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఐఐపీ వీక్‌...
కొంతకాలంగా తయారీ, పారిశ్రామిక రంగాలలో క్షీణత కొనసాగుతుండటంతో ఇండస్ట్రియల్‌ క్రెడిట్‌ వెనకడుగు వేస్తున్నట్లు బ్యాంకింగ్‌ రంగ విశ్లేషకులు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా తయారీ రంగం నీరసిస్తుండటంతో కొత్త పెట్టుబడి ప్రణాళికలు కరువైనట్లు తెలియజేశారు. దీంతో కార్పొరేట్‌ క్రెడిట్‌కు డిమాండ్‌ తగ్గినట్లు ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపక ఎండీ జి.చొక్కలింగం వివరించారు. సాధారణంగా సామర్థ్య విస్తరణ, కొత్త ప్రాజెక్టులు, ప్లాంట్ల ఏర్పాటు తదితరాల కారణంగా కార్పొరేట్‌ రుణాలకు డిమాండ్‌ పుట్టుకొస్తుందని తెలియజేశారు.

కారణాలివీ...
ఇటీవల వడ్డీ రేట్లు తగ్గడం, టెక్నాలజీ ఆధారిత (ఆన్‌లైన్‌) రుణ మంజూరీ పెరగడం వంటి అంశాలు రిటైల్‌ విభాగంలో రుణ వృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ విభాగంలో క్రెడిట్‌ కార్డులు, ఇతర వ్యక్తిగత అన్‌సెక్యూర్డ్‌ రుణాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే మొత్తం వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోలో చూస్తే సెక్యూర్డ్‌ విభాగంలోని గృహ రుణాలు, ఆటో రంగ రుణాలు నెమ్మదిస్తున్నాయి. వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోలో ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం గృహ, వాహన రుణాలు, క్రెడిట్‌ కార్డులు మూడు పెద్ద విభాగాలుగా ఆవిర్భవించాయి. హౌసింగ్‌ వాటా 52.3 శాతంకాగా.. గత ఐదేళ్లలో క్రెడిట్‌ కార్డులు తదితర రుణాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా క్రెడిట్‌ కార్డుల రుణాల వాటా 4.1 శాతానికి చేరడం గమనార్హం!

మరిన్ని వార్తలు