చమురు కంపెనీలకు కేంద్రం శుభవార్త!

7 Dec, 2022 07:26 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్ల అనూహ్య పెరుగుదల వల్ల దేశీ చమురు ఉత్పత్తి కంపెనీలు ఆర్జిస్తున్న భారీ లాభాలపై (విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌) పన్నును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఎత్తివేయవచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. చమురు ధరలు మోస్తరు స్థాయికి చేరుకోనుండడాన్ని ఇందుకు అనుకూలంగా ప్రస్తావించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి విండ్‌ఫాల్‌ పన్నును కేంద్ర సర్కారు అమల్లోకి తీసుకురావడం గమనార్హం. 

దేశీయంగా ఉత్పత్తి చేసి విక్రయించే, ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌లపై దీన్ని విధించింది. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగిపోవడంతో ఉత్పత్తి కంపెనీలకు ఒక్కసారిగా అనూహ్య లాభాలు వచ్చిపడ్డాయి. ఈ ప్రయోజనాన్ని కొంత వరకు పన్నుల రూపంలో ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వెనక్కి తీసుకునే ప్రయతాన్ని ప్రభుత్వం చేసింది. 

దేశ చమురు వినియోగంలో 15 శాతం స్థానికంగా ఉత్పత్తి అవుతున్నదే ఉంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దశాబ్ద గరిష్టాలకు చేరడం తెలిసిందే. ఈ ఏడాది చివరికి బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 85 డాలర్ల వద్ద స్థిరపడుతుందని ఫిచ్‌ అంచనా వేసింది. ధరలు తగ్గడం వల్ల చమురు మార్కెటింగ్‌ కంపెనీల మార్జిన్లు పుంజుకుంటాయని, 2022లో నష్టాలను అవి కొంత వరకు భర్తీ చేసుకుంటాయని ఫిచ్‌ తన తాజా నివేదికలో అంచనా వేసింది. రిఫైనింగ్‌ మార్జిన్లు మధ్య స్థాయికి చేరుకుంటాయని, చమురు మార్కెటింగ్‌ కంపెనీల క్రెడిట్‌ అంశాలు మెరుగుపడతాయని పేర్కొంది. 

మరిన్ని వార్తలు