Crude Oil And Fuel: రెండు వారాలకోసారి విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌పై సమీక్ష 

5 Jul, 2022 12:31 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు, ఇంధనాల ఎగుమతులపై విధించిన విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను రెండు వారాలకోసారి (15 రోజులకు) ప్రభుత్వం సమీక్షించనుంది. విదేశీ మారకం రేట్లు, అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ ఈ విషయాలు చెప్పారు. క్రూడాయిల్‌ బ్యారెల్‌ రేటు 40 డాలర్ల స్థాయికి పడిపోతే దీన్ని ఉపసంహరించవచ్చన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడప్పుడే ఆ రేటుకు రాకపోవచ్చని పేర్కొన్నారు.  ముడిచమురు రేటు ఏ స్థాయిలో ఉంటే విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ ఉపసంహరించవచ్చనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సీబీఐసీ చైర్మన్‌ వివేక్‌ జోహ్రి చెప్పారు. కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల పొందే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్‌ ఎగుమతులపై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై రూ. 13 చొప్పున, అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌పైన టన్నుకు రూ. 23,250 మేర పన్నులు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 

మరిన్ని వార్తలు