Windfall Tax: విండ్‌ఫాల్‌ టాక్స్‌ కోత: వారికి భారీ ఊరట

20 Jul, 2022 10:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విండ్‌ఫాల్‌ టాక్స్‌ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది డీజిల్, క్రూడ్ ఆయిల్, జెట్ ఇంధన  రవాణాపై విండ్‌ఫాల్ పన్ను తగ్గించింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. డీజిల్, విమాన ఇంధన రవాణాపై లీటర్‌కు 2 రూపాయలు  పన్ను తగ్గుతుందని ప్రభుత్వం ఒక  ప్రకటనలో తెలిపింది,

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం  పెట్రోలుపై రూ.6 (లీటరుకు) ఎగుమతి పన్నును కూడా రద్దు చేసింది.  దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్నును కూడా దాదాపు 27 శాతం తగ్గించింది. టన్నుకు 23,250 రూపాయల నుంచి తగ్గించి రూ.17 వేలుగా ఉంచింది. అంతర్జాతీయంగా చమురు రేట్టు తగ్గడంతో  దేశీ చమురు ఉత్పత్తి దారులు, రిఫైనర్లపై విండ్‌ఫాల్ పన్నును తగ్గించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. విండ్‌ఫాల్‌ టాక్స్‌ విధించిన ఒక నెలలోపే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు నేటి (జూలై 20) నుంచే అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు, ఎగుమతులపై సుంకాల కోత  పెట్రోలియం రంగానికి  భారీ ఊరటనిస్తుందని  పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానించారు.

ఫలితంగా రిలయన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌, ఆయిల్ ఇండియా లిమిటెడ్ లాంటి  ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలకు ప్రయోజనం సమకూరనుంది. ట్యాక్స్ తగ్గింపుతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఓసీఎల్‌, ఓఎన్జీసీ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా మార్కెట్‌లో  క్రూడాయిల్ ధరలు మళ్లి పుంజుకున్నాయి. చాలాకాలం తరువాత  ఇటీవల 100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్ ధర మళ్లీ పైకెగసింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ 107.23 డాలర్లు పలుకుతోంది.

>
మరిన్ని వార్తలు