క్యూ4లో ఐటీ దిగ్గజాల స్పీడ్‌!  

12 Apr, 2021 00:39 IST|Sakshi

నేడు టీసీఎస్, 14న ఇన్ఫోసిస్‌ ఫలితాలు 

షేర్ల బైబ్యాక్, గైడెన్స్‌ బాటలో ఇన్ఫోసిస్‌ 

15న విప్రో చివరి త్రైమాసిక ఫలితాల ప్రకటన 

ఐటీ ఫలితాలతో మార్కెట్లు, ఇన్వెస్టర్లకు జోష్‌?

ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఈ వారంలో క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి. సోమవారం(12న) టీసీఎస్, మంగళవారం సమావేశంకానున్న ఇన్ఫోసిస్‌ బుధవారం(14న) ఫలితాలు వెల్లడించనుండగా, గురువారం(15న) విప్రో చివరి త్రైమాసిక పనితీరును ప్రకటించనుంది. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21) ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇక ఇన్ఫోసిస్‌ అయితే ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనతోపాటు.. వచ్చే ఏడాది(2021–22)కి ఆదాయ అంచనాల(గైడెన్స్‌)ను సైతం ప్రకటించనుంది. కోవిడ్‌–19 నేపథ్యంలోనూ క్యూ4లో ఐటీ బ్లూచిప్స్‌ పటిష్ట పనితీరును చూపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు డిజిటైజేషన్, భారీ డీల్స్, ఆర్డర్‌ పైప్‌లైన్‌ తదితరాలు దోహదపడనున్నాయి. బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్, లైఫ్‌సైన్సెస్, తయారీ రంగాల నుంచి డిమాండ్‌ వీటికి జత కలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వెరసి ఐటీ కంపెనీల ఫలితాలు అటు మార్కెట్లకు, ఇటు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చే వీలున్నట్లు చెబుతున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లపై మార్కెట్‌ నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయంటే.. వివరాలు చూద్దాం.. 

టీసీఎస్‌.. 
టాటా గ్రూప్‌ దిగ్గజం టీసీఎస్‌ క్యూ4లోనూ ప్రోత్సాహకర పనితీరును ప్రదర్శించే వీలుంది. ఐటీ పరిశ్రమలో లీడర్‌గా ఆదాయం, మార్జిన్ల విషయంలో మెరుగైన ఫలితాలు సాధించనుంది. ఇందుకు పోస్ట్‌బ్యాంక్, ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌తో కుదుర్చుకున్న భారీ డీల్స్‌ సహకరించనున్నాయి. ఇటీవల 5–10 కోట్ల డాలర్ల డీల్స్‌ను పెంచుకుంది. క్లౌడ్, కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ విభాగాల నుంచి డిమాండ్‌ను సాధిస్తోంది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 9 శాతం, డాలర్ల రూపేణా 5 శాతం చొప్పున పుంజుకోవచ్చు. అయితే 2021–22కుగాను ప్రత్యేకంగా ఎలాంటి గైడెన్స్‌నూ ప్రకటించనప్పటికీ రెండంకెల వృద్ధిని ఆశించే వీలుంది. ప్రస్తుత స్థాయిలో లాభాలను కొనసాగించే అవకాశముంది. వాటాదారులకు తుది డివిడెండ్‌ను ప్రకటించడం, తయారీ, కమ్యూనికేషన్స్‌ విభాగాలపై యాజమాన్య స్పందన వంటి అంశాలను పరిశీలించవలసి ఉంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు ఇంట్రాడేలో రూ. 3,354ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. 0.25 శాతం లాభంతో రూ. 3,325 వద్ద ముగిసింది. 

ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ 
గత కొద్ది త్రైమాసికాలుగా చూపుతున్న వృద్ధి బాటలో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ క్యూ4 ఫలితాలు వెలువడే వీలుంది. చివరి త్రైమాసికంలోనూ పటిష్ట పనితీరును చూపవచ్చు. కోవిడ్‌–19 కారణంగా డిజిటల్‌ టెక్నాలజీస్, క్లౌడ్‌ సేవలకు డిమాండ్‌ పెరగడం సానుకూల ప్రభావాన్ని చూపనున్నాయి. క్యూ4లో త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 2–5 శాతం మధ్య పుంజుకునే వీలుంది. వార్షిక ప్రాతిపదికన మాత్రం రెండంకెల వృద్ధి సాధించనుంది. ప్రధానంగా వచ్చే ఏడాది(2021–22)కి ఆదాయంలో 13–15 శాతం పెరుగుదలను అంచనా వేయవచ్చు. క్యూ4లో వేతనాల పెంపు కారణంగా మార్జిన్లు త్రైమాసిక ప్రాతిపదికన 0.5 శాతం క్షీణించవచ్చు. కాగా.. 14న ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించనుంది. ఇన్ఫోసిస్‌ ఇంతక్రితం 2019 ఆగస్ట్‌లో 11.05 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 8,260 కోట్లను వెచ్చించింది. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ షేరు ఇంట్రాడేలో రూ. 1,455ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. నామమాత్ర లాభంతో రూ. 1,441 వద్ద ముగిసింది. 

విప్రో  
డైవర్సిఫైడ్‌ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ ఐటీ సేవల ఆదాయం క్యూ4లో డాలర్ల రూపేణా 4 శాతం స్థాయిలో ఎగసే వీలుంది. త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ 1.5–3.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. అంటే 210–214 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆశించింది. కాగా.. క్యూ4లో వేతన పెంపు, యుటిలైజేషన్‌ తగ్గడం, ట్రావెల్‌ తదితర వ్యయాలు పెరగడం వంటి కారణాలతో మార్జిన్లు కొంతమేర మందగించవచ్చు. క్యూ3లో త్రైమాసిక ప్రాతిపదికన కన్సాలిడేటెడ్‌ ఆదాయం దాదాపు 4 శాతం పుంజుకుని రూ. 15,670 కోట్లను తాకింది. నికర లాభం మాత్రం రూ. 20 శాతంపైగా జంప్‌చేసి రూ. 2,968 కోట్లకు చేరింది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో విప్రో షేరు 2 శాతం ఎగసి రూ. 451 వద్ద ముగిసింది. తద్వారా ఈ జనవరిలో నమోదైన ఏడాది గరిష్టం రూ. 467కు చేరువైంది.  

మరిన్ని వార్తలు