విప్రో కన్జూమర్‌ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు

5 Apr, 2023 07:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం రూ. 10,000 కోట్ల మైలురాయిని దాటినట్లు విప్రో కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ వెల్లడించింది. వివిధ ప్రాంతాలు, బ్రాండ్లు, కేటగిరీలవారీగా విక్రయాలు గణనీయంగా వృద్ధి చెందడం ఇందుకు దోహదపడినట్లు పేర్కొంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 8,634 కోట్లుగా నమోదైంది.

(ఈ–కామర్స్‌ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్‌ పేరు ఏంటంటే..)

దేశీయంగా ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌)వ్యాపార విభాగం 17 శాతం పెరిగినట్లు తెలిపింది. సబ్బుల బ్రాండ్‌ సంతూర్‌ ఇప్పుడు నిర్దిష్ట విభాగంలో రూ. 2,650 కోట్ల అమ్మకాలతో రెండో స్థానానికి చేరిందని పేర్కొంది. అటు వియత్నాం మార్కెట్‌లో రెండంకెల స్థాయి వృద్ధితో 10 కోట్ల డాలర్ల ఆదాయం మార్కును దాటినట్లు .. దక్షిణాఫ్రికా, మధ్యప్రాచ్యం, ఫిలిప్పీన్స్‌ తదితర మార్కెట్లలోను రెండంకెల స్థాయి వృద్ధి సాధించినట్లు కంపెనీ తెలిపింది.

2003లో రూ. 300 కోట్ల ఆదాయం ఉండగా .. గత రెండు దశాబ్దాల్లో 33 రెట్లు పెంచుకుని నేడు అంతర్జాతీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజంగా ఎదిగామని సంస్థ సీఈవో వినీత్‌ అగ్రవాల్‌ తెలిపారు. 1945లో వనస్పతి సంస్థగా ప్రారంభమైన విప్రో కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌కు ప్రస్తుతం 60 పైగా దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 18 ఫ్యాక్టరీలు, 10,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఆదాయంలో 51 శాతం వాటా అంతర్జాతీయ వ్యాపారం నుంచి ఉంటోంది.

మరిన్ని వార్తలు