విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన

13 Nov, 2023 17:39 IST|Sakshi

దేశంలోనే దిగ్గజ ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం.. దాదాపు 17 ఏళ్లు పనిచేసిన అనుభవం.. ఉద్యోగానికి రాజీనామా.. ఏదైనా ఐటీ కంపెనీ స్థాపిస్తాడేమోనని అనుకుంటాం. కానీ వ్యవసాయం ప్రారంభించాడు. ఏటా ఏకంగా రూ.205 కోట్లు సంపాదిస్తున్నాడు.  ఆ వ్యక్తి ఎవరు? ఏ పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాడు? అంత సంపాదన ఎలా సాధ్యమైందో ఈ కథనంలో తెలుసుకుందాం.

కర్ణాటకకు చెందిన శశికుమార్‌ 17 ఏళ్లపాటు ఐటీరంగంలో సేవలందించారు. అందులో 13 ఏళ్లు దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ విప్రోలో విధులు నిర్వర్తించారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయానికి మాత్రం ప్రత్యామ్నాయం లేదని గ్రహించారు. రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, సేంద్రియ ఆహారం అందించాలని భావించారు. దాంతో ఆర్గానిక్ పద్ధతులతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తను చేస్తున్న ఉద్యోగం మానేశారు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పడంతో వారూ తనకు సహాయం అందించారు. దాంతో 2010లో 9 మంది మిత్రులు కలిసి అక్షయకల్ప ఆర్గానిక్‌ని ప్రారంభించారు. 

శశికుమార్ మొదట్లో కేవలం ముగ్గురు రైతులతో పాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే అక్షయకల్ప ఆర్గానిక్ నిర్వాహకులు పాలతో ఆగకుండా.. సేంద్రియ కూరగాయలు, పండ్లను పండించడం ప్రారంభించారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని ప్రజలకు ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరిస్తూ వారికి చేరువవుతున్నారు. ఆర్గానిక్‌ పద్ధతులతో పండిస్తున్న రైతుల ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తూ వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. రైతుల ఆదాయాలను పెంచుతున్నారు. 

ప్రస్తుతం అక్షయకల్ప ఆర్గానిక్‌ ద్వారా పాలఉత్పత్తిలో భాగంగా 700 మంది రైతులు సహకారం అందిస్తున్నారు. దాదాపు 60,000 లీటర్ల సేంద్రియ పాలను ఉత్పత్తి చేస్తున్నట్లు శశికుమార్‌ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో మార్కెటింగ్‌ సేవలందించేందుకు 500 మందికి పైగా శిక్షణ ఇస్తున్నారు. సేంద్రియ పాలపై మొదట్లో వినియోగదారులకు అవగాహన కల్పించడం పెద్ద సవాలుగా మారిందని శశికుమార్‌ తెలిపారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తన స్నేహితులు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఇటీవల రూ.10 కోట్లతో కొత్త డెయిరీ ప్లాంట్ ప్రారంభించామన్నారు. దాని ద్వారా రోజుకు లక్ష లీటర్ల పాలు ప్రాసెసింగ్  చేసే అవకాశం ఉందని చెప్పారు. 

ఇదీ చదవండి: 11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత

సేంద్రియ కూరగాయలు, పండ్ల వ్యాపారం గతంలో కంటే మెరుగవుతుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో అక్షయకల్ప ఆర్గానిక్ స్టార్టప్ రూ.205 కోట్లు ఆర్జించింది. 2023-24లో ఆదాయం మరో 25 శాతం పెరుగుతుందని శశి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ 5 వేల గ్రామాలు, 5 వేల మంది రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు