విప్రో భళా..

14 Jan, 2021 06:06 IST|Sakshi

కన్సాలిడేటెడ్‌ లాభం 21% అప్‌

వరుసగా రెండో క్వార్టర్‌లోనూ పటిష్ట పనితీరు

క్యూ4లో 1.5–3.5 శాతం

ఆదాయ వృద్ధి అంచనాలు

న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లో నికర లాభం 21 శాతం ఎగసి రూ. 2,968 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 2,456 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 15,670 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయంలో ఐటీ సర్వీసులదే ప్రధాన పాత్ర. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున డివిడెండ్‌ చెల్లించనుంది.

3.9 శాతం వృద్ధికి చాన్స్‌
ఈ ఏడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి–21)లో ఐటీ సర్వీసుల ఆదాయం 1.5–3.5 శాతం మధ్య పుంజుకునే వీలున్నట్లు విప్రో తాజాగా గైడెన్స్‌ ప్రకటించింది. డాలర్ల రూపేణా 210.2–214.3 కోట్ల మధ్య ఆదాయం నమోదుకావచ్చని అభిప్రాయపడింది. త్రైమాసిక ప్రాతిపదికన వేసిన అంచనాలివి. కాగా.. ఇదే ప్రాతిపదికన క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం 3.9 శాతం పెరిగి 207.1 కోట్ల డాలర్లకు చేరింది. వెరసి రెండో త్రైమాసికంలో వేసిన 1.5–3.5 శాతం వృద్ధి అంచనాలను అధిగమించింది. 202.2–206.2 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఊహించింది. అంతేకాకుండా గత 36 త్రైమాసికాలలో అత్యధిక వృద్ధిని సాధించింది. క్యూ3లో ఐటీ ప్రొడక్టుల ఆదాయం రూ. 160 కోట్లను(2.13 కోట్ల డాలర్లు) తాకింది. దేశీ ఎంటర్‌ప్రైజెస్‌ బిజినెస్‌ రూ. 240 కోట్ల(3.28 కోట్ల డాలర్లు)కు చేరింది. క్యూ3లో విప్రో నిర్వహణ లాభ మార్జిన్లు 2.43 శాతం బలపడి 21.7 శాతానికి చేరాయి.  

డిమాండ్‌ గుడ్‌
వరుసగా రెండో త్రైమాసికంలోనూ కంపెనీ పటిష్ట పనితీరును ప్రదర్శించినట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్‌ పేర్కొన్నారు. ఐదు విభాగాలలో 4 శాతం పురోగతిని సాధించినట్లు తెలియజేశారు. క్యూ3లో మెట్రోనామ్‌ ద్వారా యూరప్‌ ఖండం నుంచి కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద డీల్‌ను పొందినట్లు ఫలితాల విడుదల సందర్భంగా ప్రస్తావించారు. 2020 డిసెంబర్‌కల్లా కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1.9 లక్షలను అధిగమించింది.
మార్కెట్లు ముగిశాక విప్రో ఫలితాలు ప్రకటించింది.  బీఎస్‌ఈలో విప్రో షేరు నామమాత్ర లాభంతో రూ. 459 సమీపంలో ముగిసింది.

మరిన్ని వార్తలు