గుడ్‌న్యూస్‌ : టెకీలకు వేతన పెంపు

9 Nov, 2020 11:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్ధితుల్లోనూ వ్యాపార కార్యకలాపాలను యథావిథిగా కొనసాగించిన ఉద్యోగులకు రివార్డుగా ఐటీ దిగ్గజం విప్రో వేతన పెంపును చేపట్టనుంది. కంపెనీలో 80 శాతం ఉద్యోగులకు డిసెంబర్‌ 1 నుంచి పెరిగిన వేతనాలను అందించనుంది. బీ3, దిగువ స్ధాయి సిబ్బందికి వేతన పెంపును వర్తింపచేయనున్న విప్రో సీనియర్‌ ఉద్యోగుల వేతనాల పెంపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు విప్రోలో ప్రస్తుతం 1.85 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వేతన పెంపుతో దాదాపు 1.5 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. గతంలో మాదిరిగానే అత్యధిక సామర్థ్యం కనబరిచినవారికి ఇంక్రిమెంట్లు అందిస్తున్నామని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి : విప్రో లాభం రూ. 2,465 కోట్లు

ఈ ఏడాది ఆరంభంలో కరోనా వైరస్‌ వెంటాడటంతో వేతన పెంపును వాయిదా వేసిన పలు ఐటీ కంపెనీలు తిరిగి వేతన పెంపును, ప్రమోషన్లను ప్రకటిస్తుండటం టెకీల్లో ఆశలు రేపుతోంది. సవాళ్లతో కూడిన సంక్లిష్ట సమయంలోనూ తమ ఉద్యోగులు నిరంతరాయంగా వ్యాపారాన్ని కొనసాగేలా చూడటంతో పాటు అత్యంత నాణ్యమైన సేవలను కొనసాగించారని విప్రో ప్రతినిథి ఓ జాతీయ వెబ్‌సైట్‌తో పేర్కొన్నారు. మధ్య, సీనియర్‌ శ్రేణిలో కీలక నైపుణ్యాలను కాపాడుకునేందుకు కంపెనీ పలు చర్యలు చేపడుతుందని చెప్పారు. ఇక మరో ఐటీ దిగ్గజం టీసీఎస్‌ అక్టోబర్‌ 1 నుంచి వర్తించేలా వేతన పెంపును ప్రకటించగా, జనవరి నుంచి ఉద్యోగులందరికీ వేతన పెంపును చేపడతామని ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. మెరుగైన సామర్ధ్యం కనబరిచినందుఉ ఈ ఏడాడి డిసెంబర్‌లో ప్రత్యేక ప్రోత్సాహకం అందచేస్తామని వెల్లడించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా