వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: మహిళల్లో మార్పులు.. వచ్చింది కాదు నచ్చింది కావాలి!

4 Aug, 2022 03:55 IST|Sakshi

అత్యధిక మహిళల మనోగతం 

అటువంటి ఉద్యోగాలకే దరఖాస్తు

గతంలో పోలిస్తే ఎక్కువ మందిలో ఆసక్తి

న్యూఢిల్లీ: కరోనా అనంతరం మారిన పరిస్థితుల్లో.. మహిళలు ఇంటి నుంచి పనిచేసేందుకే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు అవకాశం కల్పించే కంపెనీల వైపు చూస్తున్నారు. ఇంటి నుంచి పని, ఉన్న చోట నుంచే పని, ఇల్లు, కార్యాలయాల నుంచి పనికి వీలు కల్పించే హైబ్రిడ్‌ నమూనాలను అనుసరించే కంపెనీలు.. మహిళల నుంచి ఎక్కువగా ఉద్యోగ దరఖాస్తులు వస్తున్నట్టు తెలిపాయి. ఈ పరిణామంతో కొన్ని కంపెనీల్లో  స్త్రీ/పురుష ఉద్యోగుల సమానత్వం/వైవిధ్యం పరంగా మెరుగుదల కనిపిస్తోంది.

ఆర్‌పీజీ గ్రూపు పరిధిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న వారిలో మహిళలు 15–20 శాతం పెరిగారు. దీనివల్ల తాము లింగ వైవిధ్య లక్ష్యాలను త్వరగా చేరుకోవడం సాధ్యపడుతుందని ఆర్‌పీజీ గ్రూపు భావిస్తోంది. ‘‘మా రిమోట్‌ పని విధానం ఎంతో మంది మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంది. దాంతో వారు ఉద్యోగులకు దరఖాస్తు చేసుకుంటున్నారు’’అని ఆర్‌పీజీ గ్రూపు చీఫ్‌ టాలెంట్‌ ఆఫీసర్‌ సుప్రతిక్‌ భట్టాచార్య తెలిపారు. ముంబైకి చెందిన ఆర్‌పీజీ గ్రూనపు ఉద్యోగులను వారి విధుల ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించింది. కొన్ని కేటగిరీల్లోని వారికి 50 శాతం సమయాన్ని ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తోంది. కొన్ని కేటగిరీల్లో నూరు శాతం ఉన్న చోట నుంచే పనిచేసేందుకు అనుమతిస్తోంది.

స్పష్టమైన మార్పు..
విద్యా సంబంధిత టెక్నాలజీ యూనికార్న్‌ ఎరూడిటస్‌.. గ్రూపు పరిధిలోని అన్ని స్థాయిల్లో కరోనాకు ముందు మహిళలు 41 శాతంగా ఉంటే, కరోనా తర్వాత 51 శాతానికి పెరిగారు. అదే మధ్య స్థాయి ఉద్యోగాల్లో అయితే 37 శాతంగా ఉన్న మహిళలు 47 శాతానికి చేరారు. ‘‘నూరు శాతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి మళ్లిన తర్వాత గతంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోని మహిళలు సైతం ఇప్పుడు ముందుకు వస్తున్నారు’’అని ఎరూడిటస్‌ సీఈవో అశ్విన్‌ దామెర తెలిపారు.

ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఈ విధానం మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. హెచ్‌ఆర్‌ టెక్నాలజీ స్టార్టప్‌ అయిన ‘స్ప్రింగ్‌వర్క్స్‌’ నూరు శాతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ సంస్థలో మహిళా ఉద్యోగులు 30 శాతం నుంచి 35 శాతానికి పెరిగారు. ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటు కల్పించడం వల్ల టైర్‌–2, టైర్‌–3 పట్టణాల నుంచి నిపుణుల సేవలను పొందగలిగినట్టు యాక్సిస్‌ బ్యాంకు సైతం తెలిపింది. లేదంటే ఈ అవకాశం ఉండేది కాదని పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు