పెరుగుతున్న మహిళా డైరెక్టర్లు

23 Nov, 2022 08:43 IST|Sakshi

ఎన్‌ఎస్‌ఈ 500 కంపెనీల్లో 18 శాతం 

159 కంపెనీల్లో 20 శాతానికి పైనే 

ఐఐఏఎస్‌ నివేదిక వెల్లడి 

న్యూఢిల్లీ: కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం నిదానంగా అయినా కానీ క్రమంగా పెరుగుతోంది.  ఈ ఏడాది మార్చి నాటికి ఎన్‌ఎస్‌ఈ టాప్‌ 500 కంపెనీల బోర్డుల్లో మహిళా డైరెక్టర్లు 18 శాతానికి చేరారు. ఇనిస్టిట్యూట్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ (ఐఐఏఎస్‌) అనే సంస్థ ఇందుకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా చూస్తే కార్పొరేట్‌ బోర్డుల్లో మహిళల స్థానం 24 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది.

‘‘భారత్‌ సైతం కంపెనీ బోర్డుల్లో మహిళల నియామకాల పరంగా పురోగతి చూపిస్తోంది. 2014లో 6 శాతం ఉంటే, 2017 నాటికి 14 శాతం, 2022 మార్చి నాటికి 17.6 శాతానికి (ఎన్‌ఎస్‌ఈ–500 కంపెనీలు) పెరిగింది. మహిళా డైరెక్టర్ల సంఖ్య పెరిగినప్పటికీ, ఏటా వారి నియామకాల్లో వృద్ధి ఒక శాతం మించి లేదు. ఇదే రేటు ప్రకారం చూస్తే కంపెనీ బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని 30 శాతానికి చేర్చడానికి 2058 వరకు సమయం పడుతుంది’’అని ఈ నివేదిక వివరించింది. ఈ ఏడాది మార్చి నాటికి ఎన్‌ఎస్‌ఈ 500 కంపెనీల్లో మొత్తం 4,694 డైరెక్టర్ల పోస్ట్‌లు ఉంటే, అందులో మహిళలు 827 మంది ఉన్నారు. 

సగం కంపెనీల్లో కనీసం ఇద్దరు..
ఈ ఏడాది మార్చి నాటికి నిఫ్టీ–500 కంపెనీల్లో సగం మేర, అంటే 48.6 శాతం కంపెనీల్లో కనీసం ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది మహిళా డైరెక్టర్లు ఉన్నారు. 2021 మార్చి నాటికి ఇది 45 శాతం కంపెన్లీలోనే ఉండడం గమనించాలి. అంటే 3.6 శాతం కంపెనీలు మరింత మంది మహిళలకు గత ఏడాది కాలంలో చోటు కల్పించాయి. 2020 మార్చి నాటికి ఇది 44 శాతంగా ఉంది.

ఇక 159 కంపెనీల్లో మహిళల భాగస్వామ్యం 20 శాతంకంటే ఎక్కువే ఉంది. 2021 మార్చి నాటికి 146 కంపెనీల్లోనే 20 శాతానికి పైగా మహిళా డైరెక్టర్లు ఉన్నారు. మహిళా డైరెక్టర్ల సగటు వయసు 58 ఏళ్లుగా ఉంది. అదే పురుష డైరెక్టర్ల సగటు వయసు 62 సంవత్సరాలు కావడం గమనార్హం. నిఫ్టీ–500లో 22 కంపెనీల బోర్డులకు మహిళలు చైర్మన్‌గా ఉన్నారు. 25 కంపెనీలకు మహిళలు సీఈవోలుగా పనిచేస్తున్నారు. మరో 62 మంది ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక లింగ సమానత్వంలో (స్త్రీ/పురుషుల నిష్పత్తి) ప్రభుత్వరంగ సంస్థలు వెనుకబడి ఉన్నాయి. చాలా సంస్థలు ఇందుకు సంబంధించి నిబంధనలు పాటించడం లేదు.   

ఫ్రాన్స్‌లో ఎక్కువ..  
యూరప్, నార్త్‌ అమెరికాలో అంతర్జాతీయ సగ టు కంటే ఎక్కువగా మహిళల భాగస్వామ్యం ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. యూరప్‌ కంపెనీల్లో 34.4 శాతం, నార్త్‌ అమెరికా కంపెనీల్లో 28.6 శాతం మేర మహిళా డైరెక్టర్లు పనిచేస్తున్నారు. దేశం వారీగా విడిగా చూస్తే.. ఫ్రాన్స్‌ లో అత్యధికంగా 44.5 శాతం మేర మహిళలకు కంపెనీ బోర్డుల్లో ప్రాతినిధ్యం దక్కింది.

మరిన్ని వార్తలు