సంపాదనలో సగానికి పైగా ఆదా

9 Mar, 2021 09:19 IST|Sakshi

పట్టణా మహిళా మణుల ముందు చూపు

మ్యాక్స్‌ లైఫ్‌ ఇండియా సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: పట్టణ మహిళలు (ఉద్యోగం, ఆర్జనలో ఉన్నవారు) పొదుపునకు, పెట్టుబడులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్‌.. మహిళలను తమ విశ్రాంత జీవనం గురించి ఆలోచింపజేసినట్టు మ్యాక్స్‌లైఫ్‌ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. విచక్షణారహితంగా ఖర్చు పెట్టడానికి బదులు పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడమే కాదు.. సంపాదనలో 52 శాతాన్ని తమ లక్ష్యాల కోసం మహిళా ఉద్యోగులు కేటాయిస్తున్నారు. కనీస అవసరాలకు వారు కేటాయిస్తున్న మొత్తం 39 శాతం మించడం లేదు. ఇక దుబారా, ఖరీదైన వాటి కోసం వారు చేస్తున్న ఖర్చు కేవలం 9 శాతంగానే ఉందని మ్యాక్స్‌లైఫ్‌ ఇండియా సర్వే స్పష్టం చేసింది. సర్వేలో అభిప్రాయం తెలిపిన మహిళల్లో.. 56 శాతం మంది తమ వృద్ధాప్య జీవన అవసరాలు, భద్రత కోసం పొదుపు చేస్తున్నట్టు చెప్పారు. 64 శాతం మంది పిల్లల విద్య కోసం పక్కన పెట్టగా.. అకాల మరణం చెందితే కుటుంబానికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో 39 శాతం మంది రక్షణాత్మక చర్యలు తీసుకున్నారు. 40 శాతం మంది వైద్య అత్యవసరాల కోసం పొదుపు చేసినట్టు చెప్పారు.

జన్‌ ధన్‌ అకౌంట్లలో మెజారిటీ ‘మహిళ’దే!: ఆర్థికశాఖ ప్రకటన
ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన (పీఎంజేడీవై) కింద అకౌంట్లు కలిగివున్న వారిలో 55 శాతం మంది మహిళలేనని ఆర్థికశాఖ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములుగా చేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రత్యక్షంగా లబ్దిదారులకు అందాలని లక్ష్యంగా 2014 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్‌ధన్‌ యోజన పథకాన్ని ప్రకటించారు. అదే ఏడాది ఆగస్టు 28న పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల్లో మహిళా భాగస్వామ్యానికి సంబంధించి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థికశాఖ ఒక ప్రకటన చేసింది. మహిళల సాధికారితను పెంచే క్రమంలో జన్‌ ధన్‌ యోజన కీలకమైనదని ఈ ప్రకటనలో వ్యాఖ్యానించింది. 2018లో ఈ పథకం ప్రయోజనాలను మరింత పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రమాద బీమా రెట్టింపు, ఓవర్‌డ్రాఫ్ట్‌ పరిమితి పెంపు వంటి పలు కీలక ప్రయోజనాలు రెండవ వెర్షన్‌ కింద ప్రవేశపెట్టడం జరిగింది. 2021 ఫిబ్రవరి 24వ తేదీ నాటికి జన్‌ ధన్‌ యోజన కింద అకౌంట్ల సంఖ్య 41.93 కోట్లుగా పేర్కొంది. ఇందులో 23.21 కోట్లు మహిళలకు చెందినవని వివరించింది.

ముద్రా యోజన ద్వారా మహిళలకు రూ.6.36 లక్షల కోట్లు 
కాగా, ప్రధానమంత్రి ముంద్ర యోజన (పీఎంఎంవై) అకౌంట్ల విషయంలో 68శాతం(19.04 కోట్లు)తో మహిళలే మందున్నారని ఆర్థికశాఖ ప్రకటన పేర్కొంది. 2021 ఫిబ్రవరి 26వ తేదీనాటికి రూ.6.36 లక్షల కోట్లను మహిళా పారిశ్రామికవేత్తలకు మంజూరు చేసినట్లు తెలిపింది. 2015 ఏప్రిల్‌ 8వ తేదీన ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. లఘు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షలవరకూ రుణం అందజేయాలన్నది ఈ పథకం ఉద్దేశ్యం. వాణిజ్య బ్యాంకులు, ఆర్‌ఆర్‌బీలు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు ఈ రుణాలను మంజూరుచేస్తాయి.

స్టాండ్‌–అప్‌ ఇండియా స్కీమ్‌లోనూ అగ్రస్థానం
స్టాండ్‌–అప్‌ ఇండియా స్కీమ్‌కు సంబంధించి 81 శాతానికిపైగా (91,109 అకౌంట్లు) అకౌంట్ల విషయంలో రూ.20,749 కోట్లను మహిళలకు మంజూరుచేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. 2016 ఏప్రిల్‌ 5వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. క్రింది స్థాయి మహిళలు, బలహీన వర్గాల  ఆర్థిక సాధికారత, ఉపాధి కల్పన లక్ష్యంగా 2016 ఏప్రిల్‌ 5న ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం బ్యాంక్‌ ద్వారా కింద రూ.10 లక్షల నుంచి కోటి వరకూ రుణ సౌలభ్యం పొందే వెసులుబాటు ఉంది. ప్రత్యేకించి మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చాలన్నది లక్ష్యం.

మరిన్ని వార్తలు