గేమింగ్‌కు మహిళల ఫ్యాషన్‌ హంగులు

10 Apr, 2021 09:44 IST|Sakshi

హెయిర్‌ స్టయిల్, ఫ్యాషన్‌ థీమ్స్‌కు ఆదరణ

 లక్షల్లో హైహీల్స్, ఐసింగ్‌ ఆన్‌ డ్రెస్‌ గేమ్స్‌ డౌన్‌లోడ్లు

300 శాతం పెరిగిన హెయిర్‌ సెలూన్‌ డౌన్‌లోడ్లు 

సాక్షి, బెంగగళూరు: స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగే కొద్దీ దేశీయంగా మహిళలు మొబైల్‌ గేమ్స్‌పై మరింతగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఫ్యాషన్, హెయిర్‌ స్టయిల్‌ మొదలైన థీమ్స్‌తో రూపొందిన గేమ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. అమెరికా, బ్రెజిల్‌ తరహాలో ఫ్యాషన్‌ గేమ్స్‌కు భారత్‌ కూడా కీలక మార్కెట్‌గా ఎదుగుతోంది. యాప్‌ అనలిటిక్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ అధ్యయనం ప్రకారం 2020లో ఈ తరహా యాప్స్‌ డౌన్‌లోడ్లు 100 శాతం పైగా పెరిగాయి. ఇక ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి మధ్య దాకా చూస్తే జింగా సంస్థకు చెందిన ’హై హీల్స్‌’ గేమ్‌ 68 లక్షల పైగా ఇన్‌స్టాలేషన్స్‌ నమోదు చేసుకుంది. అలాగే, లయన్‌ స్టూడియోస్‌కి చెందిన ’ఐసింగ్‌ ఆన్‌ ది డ్రెస్‌’ డౌన్‌లోడ్‌లు దాదాపు 41 లక్షల మేర నమోదయ్యాయి. కార్టూన్‌ ఆర్ట్‌ స్టయిల్‌ గల ఫ్యాషన్‌ థీమ్‌ గేమ్స్‌కు బ్రెజిల్, భారత్‌ వంటి మార్కెట్లలో బాగా ప్రాచుర్యం లభిస్తోంది. హెయిర్‌ సెలూన్‌ అనే గేమ్‌ డౌన్‌లోడ్‌ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 2020లో ఏకంగా 314 శాతం పైగా నమోదవడం ఇందుకు నిదర్శనంగా సెన్సార్‌ టవర్‌ పేర్కొంది. హైహీల్స్‌కు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోందని దీన్ని రూపొందించిన రోలిక్‌ సంస్థ వర్గాలు తెలిపాయి. 

ఆడటం సులువు... 
గందరగోళ నిబంధనలేమీ లేకుండా సరళంగా ఉండటం, మరీ ఎక్కువ సేపు సమయం వెచ్చించాల్సిన అవసరం లేకపోవడం ఈ తరహా గేమ్స్‌కి ప్రధాన ఆకర్షణగా ఉంటోంది. సరదాగా కాస్సేపు ఆడాలనుకునే మహిళలకు ఇవి అనువుగా ఉంటున్నాయని సెన్సార్‌ టవర్‌ తెలిపింది. ఇక సోషల్‌ మీడియాలో ఫ్యాషన్‌ పోకడలను ప్రతిఫలించేలా తీర్చిదిద్దుతున్న గేమ్స్‌ వైపు కూడా మహిళలు మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. క్రేజీల్యాబ్స్‌ సంస్థ రూపొందించిన ఎక్రిలిక్‌ నెయిల్స్‌ ఈ కోవకి చెందినదే. గత కొద్ది నెలలుగా ఈ విభాగంలో అత్యధికంగా డౌన్‌లోడ్‌లు నమోదు చేసుకున్న టాప్‌ 3 యాప్స్‌లో ఇది కూడా ఒకటి. కొత్తగా డిజైన్‌ చేసిన ఎక్రిలిక్‌ నెయిల్స్‌ వీడియోలు, ఫొటోలు వంటివి పోస్ట్‌ చేసే అవకాశం వీటిలో ఉండటం గేమర్స్‌ను ఆకర్షిస్తోంది. దీంతో ప్రధానంగా మహిళల కోసం ఇలాంటి గేమ్స్‌ మరిన్ని రూపొందించడంపై గేమింగ్‌ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. 

43 శాతం మంది మహిళలే.. 
దేశీయంగా మొబైల్‌ గేమ్‌లు ఆడేవారిలో 43 శాతం మంది మహిళలు ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 77 శాతం మంది కనీసం రోజుకోసారైనా ఒక్క మొబైల్‌ గేమ్‌ అయినా అడుతున్నారు. 32 శాతం మంది మహిళలు స్వల్పంగా పది నిమిషాల సమయమైనా గేమింగ్‌ కోసం వెచ్చిస్తున్నారు. 
   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు