ఆకాశంలో సగం.. అవకాశాల్లో ఎక్కడ?

8 Mar, 2022 05:33 IST|Sakshi

పరిశ్రమల్లో కీలక బాధ్యతల్లో మహిళలకు దక్కని ప్రాధాన్యం

సీనియర్ల స్థాయి వేతనాల్లో భారీ వ్యత్యాసం 

మెర్సర్‌ నివేదిక

ప్రస్తుతం కంపెనీలు.. పురుషులకు దీటుగా మహిళలకు కూడా అవకాశాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. లీడర్‌షిప్‌ హోదాల్లోని మహిళలకు వేతనాలపరంగా సరిగ్గా న్యాయం జరగడం లేదు. కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్‌ 2021 టోటల్‌ రెమ్యూనరేషన్‌ సర్వే (టీఆర్‌ఎస్‌)లో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం ఎంట్రీ స్థాయి ఉద్యోగాల్లో పురుషుల వేతనాలతో పోలిస్తే మహిళా ఉద్యోగుల జీతభత్యాలు 95–99 శాతం స్థాయిలో ఉంటున్నాయి.

కానీ మధ్య, సీనియర్‌ స్థాయుల్లోకి వచ్చేటప్పటికీ ఈ వ్యత్యాసం గణనీయంగా పెరుగుతోంది. వారి వేతనాలు .. పురుష ఉద్యోగులతో పోలిస్తే 87–95 శాతం స్థాయికే పరిమితం అవుతున్నాయి. కంపెనీ లాభాల్లో కీలక పాత్ర పోషించే హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగా ఉండటం, ఎదిగే అవకాశాలు ..  ప్రమోషన్ల ప్రక్రియ నెమ్మదిగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. 900 పైగా కంపెనీలు, 5,700 పైచిలుకు హోదాలు, మొత్తం మీద 14 లక్షల ఉద్యోగుల డేటా ఆధారంగా ఈ సర్వేను నిర్వహించారు.  

ఎంట్రీ లెవెల్లో ప్రాతినిధ్యం ఓకే..
సాంకేతిక రంగంలో ఎంట్రీ స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం 43 శాతంగా ఉంది. కానీ అదే మేనేజర్‌ స్థాయికి వచ్చే సరికి 12–17 శాతానికి పడిపోగా.. ఇక ఎగ్జిక్యూటివ్‌ స్థాయికి వచ్చేసరికి మరింత తగ్గిపోయి 4–8 శాతానికే పరిమితమైంది. ఐటీ, కస్టమర్‌ సర్వీస్, ఇంజినీరింగ్‌.. సైన్స్, మానవ వనరులు, డేటా అనలిటిక్స్‌ .. బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ మొదలైన విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం మెరుగ్గా ఉంటోంది. మరోవైపు, లీగల్, ఆడిట్‌.. సేల్స్, మార్కెటింగ్‌.. ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాల్లో చాలా తక్కువగా ఉంటోంది.

ఉద్యోగుల విషయంలో కంపెనీలు వైవిధ్యానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ .. జవాబుదారీతనం లేకపోవడం వల్ల అంతర్గతంగా దీనికి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని మెర్సర్‌ సీనియర్‌ ప్రిన్సిపల్‌ మాన్సీ సింఘాల్‌ తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళల ఉద్యోగావకాశాలు, భద్రత, జీతభత్యాలను మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన కొత్త కార్మిక చట్ట నిబంధనలు స్వాగతించతగ్గవే అయినప్పటికీ కంపెనీలు ఈ దిశగా చురుగ్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంస్థలకు విలువను జోడించే కీలక హోదాల్లో మహిళల పాత్ర పెరిగే కొద్దీ లింగ సమానత్వాన్ని సాధించడం సాధ్యమేనని తెలిపారు. 

మరిన్ని వార్తలు