ఉడెన్‌ కిక్‌ టు ఎలక్ట్రిక్‌ దాకా.. స్కూటర్‌ పుట్టుక, పరిణామ క్రమం గురించి తెలుసా?

21 Oct, 2021 10:17 IST|Sakshi

Scooter History And Evolution: స్కూటర్‌..  సామాన్యుడికి ఇష్టమైన మోతబండి. మార్కెట్‌లో భారత వాహన రంగాన్ని సైతం ఏలే దమ్ముంది ఈ బండికి. అయితే కాలం మారినట్లే.. ఇందులోనూ కొత్త కొత్త అప్‌డేట్‌ వెర్షన్‌లు వస్తున్నాయి.  మరి దీని పరిణామా క్రమంలో కొన్ని మార్పులు ఎలా జరిగాయి..  ఆ కథ ఏంటో ఒక్కసారి స్కూటర్‌బండిపై కాలంలో వెనక్కి వెళ్లి చూద్దాం. 


స్కూటర్‌.. జర్మనీలో 18వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ బండి ప్రయాణం ఇప్పటికీ అప్రతిహతంగా సాగుతోంది. ఆధునిక కాలంలోనూ తన రూపం మార్చుకుని సామాన్యుడి జీవితంలో మమేకమవుతోంది. 19వ శతాబ్దంలో భారత్‌లోకి ప్రవేశించిన స్కూటర్లు రోడ్లపై ఎటు చూసినా దర్శనమిచ్చేవి. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, పార్క్‌లు వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో అవే ఎక్కువగా కనిపించేవి. సినిమాల్లో హీరోల ఎంట్రన్స్‌లు కూడా వాటి పైనే ఎక్కువగా ఉండేవి. వ్యవసాయ పనులు చేసుకునే వారు, ఉద్యోగస్తులే కాకుండా దాదాపు అన్ని వర్గాల వారితో స్కూటర్‌ తన బంధాన్ని పెనవేసుకుంది. ద్విచక్ర వాహనదారుల అభిరుచులలో మార్పులు రావడంతో కాలక్రమేణా స్కూటర్లు తన రూపును మార్చుకున్నాయి. ఇప్పుడు మార్కెట్‌లో ఎలక్ట్రికల్‌ స్కూటర్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. 

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

పెట్రోలు వాహనాలు ఎక్కువగా రోడ్లపై తిరుగుతుండటం, శబ్ధ కాలుష్యం తదితర కారణాలతో వాహనదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి సారించారు. ఎలక్ట్రికల్‌ స్కూటర్‌లే కాకుండా స్పోర్ట్స్‌ బైక్‌లు, బుల్లెట్‌లపై యువతలో క్రేజ్‌ ఉండటంతో వాటిని కూడా కంపెనీలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఒక్కసారి బ్యాటరీ రీచార్జ్‌ చేస్తే వందకుపైగా కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉండటం, పెట్రోల్‌ ఖర్చు తప్పుతుండటం, కాలుష్య రహిత వాహనం కావడంతో ఎక్కవమంది వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు మార్కెట్‌లో ఎలక్ట్రికల్‌ స్కూటర్‌ల హవా నడుస్తోంది. వీటి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో చాలా కంపెనీలు ఆన్‌లైన్‌లో ప్రీబుకింగ్‌ను ఓపెన్‌ చేస్తున్నాయి.

అట్లాంట

భారత్‌లో తయారైన మొట్టమొదట స్కూటర్‌ ఇదే. ఎన్‌హెచ్‌ రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి కేరళలోని తిరువనంతపురంలో దీన్ని రూపొందించడాన్ని మొదలుపెట్టారు. సుదీర్ఘకాలం పాటు శ్రమించి 1976లో తొలిసారిగా మీడియా ముందు అట్లాంట స్కూటర్‌ను ప్రవేశపెట్టారు. గంటకు 70 కిలో మీటర్ల వేగం, లీటర్‌కు 60 కిలోమీటర్ల మేరకు ప్రయాణం దీని సొంతం. అప్పట్లో దీని ధర రూ.2,300 ఉండేది. ఈ స్కూటర్‌ను తయారు చేయడానికి వాడిన భాగాల్లో 75 శాతం మన దేశంలో తయారు చేసినవే. కొన్నాళ్ల అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని టేకోవర్‌ చేయడం ప్రారంభించింది. రాజకీయ కారణాలు, కార్మికుల సమస్యలతో ‘అట్లాంట’ తన ఉనికిని కోల్పోయింది. 


లూనా

1972లో 50సీసీ ఇంజన్‌తో కెనిటిక్‌ ఇంజనీరింగ్‌ సంస్థ మోపెడ్‌ను భారత ఆటోమెబైల్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2000 సంవత్సరం వరకు వీటి ఉత్పత్తి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయదారులు దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పటికీ రూరల్‌ ప్రాంతాల్లో లూనాలు కనిపిస్తుండటం విశేషం.


చేతక్‌

1972లో బజాజ్‌ కంపెనీ చేతక్‌ బండిని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 15వ శతాబ్దానికి చెందిన రాజస్థాన్‌ రాజు మహారాణ ప్రతాప్‌ తన గుర్రానికి పెట్టుకున్న పేరు (చేతక్‌)నే బజాజ్‌ కంపెనీ ఈ బండికి పెట్టింది. గంటలకు 90 కిలోమీటర్ల వేగం, లీటర్‌కు 62 కిలోమీటర్ల ప్రయాణం దీని సొంతం. 2006 వరకు దీని హవా సాగింది. ఆ తరువాత బజాజ్‌ కంపెనీ బైక్‌లపై దృష్టి సారించి చేతక్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది. ఇలా 1950లో మొదలైన స్కూటర్‌ కాలాంతరంగా పలు రూపాలను మార్చుకుంటూ వస్తోంది. ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఎలక్ట్రికల్‌ స్కూటర్‌లపై వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాటి తయారీకి కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. కొన్ని కంపెనీలు మహిళల కోసం ప్రత్యేకంగా స్కూటర్‌లు డిజైన్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం రోడ్లపై అవే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. 


లంబ్రెట్టా

1920ల అనంతరం ఆటోపెడ్‌ కన్నా మెరుగ్గా 1952లో లంబ్రెట్టా అనే స్కూటర్‌ మార్కెట్లోకి వచ్చింది. దీని భాగాలను ఇటలీ నుంచి భారత్‌కు తీసుకువచ్చి ఆటోమొబైల్‌ ప్రొడక్ట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏపీఐ) అసెంబ్లింగ్‌ చేసేది. దీని ఇంజన్‌ కెపాసిటీ 48సీసీ. ఎల్‌ఐ 150 సీరీస్‌ 2 అనే పేరుతో ఏపీఐకి లైసెన్స్‌ మంజూరు అయ్యింది. 1976 వరకు వీటి అమ్మకాలు జరగ్గా ఆ తరువాత న్యాయపరమైన సమస్యలు తలెత్తడంతో వీటిని మార్కెట్లోకి విడుదల చేయడాన్ని ఏపీఐ నిలిపివేసింది. 


ఆటోపెడ్‌

దీన్నే క్రప్‌–రోలర్‌ అని కూడా పిలిచేవారు. 1915–1921 వరకు ఇవి ప్రపంచ మార్కెట్‌లో ఉన్నాయి. గంటకు 32 కిలోమీటర్ల వేగంతో దీనిపై ప్రయాణించవచ్చు. దీని టైర్లు 10 ఇంచులకు పైగా ఉండేవి. 


ఉడెన్‌ కిక్‌ స్కూటర్‌

1894లో హిల్డర్‌ బ్రాండ్‌ అండ్‌ ఓల్ఫ్‌ ముల్లర్‌ మోటర్‌ సైకిల్‌ను రూపొందించినా పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. వారు రూపొందించిన మోటర్‌సైకిల్‌ స్ఫూర్తితో అర్థర్‌ హుగో సీసెల్‌గిబ్జన్‌ స్కేటింగ్‌కి ఉపయోగించే చక్రాలు, చెక్కతో 1913లో ఉడెన్‌ కిక్‌ స్కూటర్‌ను రూపొందించారు. మార్కెట్‌లోకి ఇది 1916లో వచ్చింది. అయితే అప్పటికే ప్రపంచవ్యాప్తంగా స్కూటర్‌ల తయారీకి విస్తృత స్థాయిలో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆటోపెడ్‌ మార్కెట్‌లోకి వచ్చింది. 

–సాక్షి, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు