Joe Biden And Jeff Bezos: కార్పోరేట్‌ ట్యాక్స్‌.. జోబైడెన్‌ వర్సెస్‌ జెఫ్‌ బేజోస్‌

16 May, 2022 11:50 IST|Sakshi

అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం వివిధ దేశాధినేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన ఓ ప్రతిపాదన కార్పోరేట్‌ కంపెనీలకు కంటగింపుగా మారింది.

అమెరికాలో ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతోంది. కరోనా మొదలైన చీకటి రోజులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ద్రవ్యోల్బణం అక్కడ నమోదు అవుతోంది, డాలరు విలువకు బీటలు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఓ ప్రతిపాదన తెరమీదకు తెస్తూ ట్వీట్‌ చేశారు. అందులో ద్రవ్యోల్బణం కట్టడి చేయాలంటే.. సంపన్న కార్పోరేట్‌ కంపెనీలు పన్నులు సక్రమంగా చెల్లించాలంటూ కోరారు.

యూఎస్‌ ప్రెసిడెంట్‌ జోబైడెన్‌ ట్వీట్‌కు వెంటనే కౌంటర్‌ ఇచ్చాడు ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ అధినేత జెప్‌బేజోస్‌. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేయాలనుకోవడం మంచి విషయమే.. చర్చించతగిన అంశమే. అలాగే కార్పోరేట్‌ ట్యాక్సుల చెల్లింపు కూడా చర్చకు ఆమోదించతగిన విషయమే. అయితే ఈ రెండింటిని కలగలిపి కలగాపులగం చేయడం మాత్రం సరైన పద్దతి కాదు. దీంతో అసలు విషయం పక్కదారి పడుతుందంటూ జో బైడెన్‌ అభిప్రాయంతో విబేధించాడు జెఫ్‌బేజోస్‌.

గత కొంత కాలంగా పన్నుల చెల్లింపులో అమెజాన్‌ పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2018లో 11 బిలియన్‌ డాలర్ల లాభంపై అమెజాన్‌ పన్ను చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పోరేట్‌ ట్యాక్స్‌ చెల్లింపుల విషయంలో జోబైడెన్‌, జెఫ్‌ బేజోస్‌ల మధ్య నడిచిన సంవాదం ఆసక్తికరంగా మారింది.

చదవండి: జెఫ్‌ బేజోస్‌కి ఝలక్‌ ఇచ్చిన ఎలన్‌మస్క్‌!

మరిన్ని వార్తలు