-

Work From Home: జనవరి వరకు ఊరట.. ఇప్పుడు ఎంప్లాయిస్‌ మరో మాట!

26 Aug, 2021 12:42 IST|Sakshi

పరిమితి లేని పని గంటలు.. పని ఒత్తిడిని భరిస్తూనే వర్క్‌ ఫ్రమ్‌ హోంలో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు ఎంప్లాయిస్‌. దీంతో జీతభత్యాల కోతల నడుమ కొన్నాళ్లపాటు అనుమతులు ఇస్తున్నాయి కంపెనీలు. వీటికి తోడు డెల్టా ఫ్లస్‌ వేరియెంట్‌ కేసులు పెరుగుతున్న టైంలో.. జనవరి వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోంను పొడిగించాయి కొన్ని ఐటీ కంపెనీలు. అయితే ఈ అంశం ఇప్పుడు కంపెనీల పరిధి దాటిపోయినట్లు అనిపిస్తోంది.

ఆఫీసులు తెరిచినా.. తాము ఎట్టిపరిస్థితుల్లో తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని వర్క్‌ ఫ్రమ్‌ హోంలో ఉన్న చాలామంది ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బలవంతపు ఆదేశాలు జారీ చేస్తే.. కంపెనీలను వీడతామంటూ కుండబద్ధలు కొట్టేస్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం విషయంలో చాలా కంపెనీలు వరుసగా ఎంప్లాయిస్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము శాశ్వతమైన వర్క్‌ ఫ్రమ్‌ హోంకి ఆసక్తి చూపిస్తున్నట్లు ఉద్యోగులు చెప్తున్నారు. ఈ మేరకు కొన్ని సర్వేలు ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి. అయితే కంపెనీల స్పందన ఎలా ఉండబోతుందనేది రానున్న రోజుల్లోనే తెలిసేది.

లండన్‌కు చెందిన ప్రైస్‌వాటర్‌హౌజ్‌ కూపర్స్‌.. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. వర్క్‌ ఫ్రమ్‌ హోంలో ఉన్న 41 శాతం మంది తాము అసలు ఆఫీస్‌లకు రమ్మన్నా.. రామని తేల్చి చెప్పారు. జనవరిలో ఇదే కంపెనీ నిర్వహిచిన సర్వేలో కేవలం 29 మాత్రమే ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. చదవండి: హైదరాబాద్‌ ఐటీ కంపెనీల నయా ట్రెండ్‌ ఇది!

► భారత్‌కు చెందిన ఓ ప్రముఖ ఇంటర్నెట్‌ బ్రాడ్‌బాండ్‌ కంపెనీ ఆగష్టు రెండో వారంలో.. లక్షన్నర మంది ఎంప్లాయిస్‌ అభిప్రాయంతో ఓ సర్వే చేపట్టింది. అందులో 48 శాతం ఉద్యోగులు శాశ్వతమైన వర్క్‌ ఫ్రమ్‌ హోంకి ఓటేశారు. ఒత్తిడిలో ఉన్నా.. తాము రిమోట్‌ వర్క్‌తో అన్ని విధాలుగా కంఫర్ట్‌గా ఉన్నట్లు చెప్పారు.
 

 భారత్‌కు చెందిన మరో ఐటీ కంపెనీ జులై చివరి వారంలో చేపట్టిన సర్వేలో.. కరోనా పరిస్థితులు ఎలా ఉన్నా 19 శాతం ఉద్యోగులు రిమోట్‌ వర్క్‌(వర్క్‌ ఫ్రమ్‌ హోం)కే సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.17 శాతం మంది వారానికి మూడు రోజులైనా వర్క్‌ ఫ్రమ్‌ హోం కావాలని కోరుకుంటున్నారు. 22 శాతం మంది తాము కనీసం ఒక్కరోజైనా కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ 1500 మందితో ఇలాంటి సర్వేనే నిర్వహించగా.. 38 శాతం ఉద్యోగులు శాశ‍్వతమైన వర్క్‌ ఫ్రమ్‌ హోంను.. 21 శాతం వారంలో కనీసం మూడు రోజులైనా వర్క్‌ ఫ్రమ్‌ హోం కోరుకున్నారు.  
 
వ్యాక్సినేషన్‌ సర్వే 
చాలా కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో కచ్చితంగా ఉండాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో వర్క్ ఫ్రమ్‌ హోంతో పాటు ఆఫీసులకు రావాలనుకుంటున్న ఉద్యోగులను తప్పనిసరిగా వ్యాక్సిన్‌లు వేయించుకోవాలని ఆదేశిస్తున్నాయి. అయితే ఈ కంపల్సరీ రూల్‌ను చాలామంది ఉద్యోగులు ఆమోదిస్తున్నారు. గాలప్‌ సర్వే ప్రకారం.. 36 శాతం ఉద్యోగులు ఈ నిబంధనకు మద్దతు తెలపగా. 29 శాతం ఉద్యోగులు మాత్రం ఈ రూల్‌తో విభేదిస్తున్నారు.

చదవండి: వర్క్‌ఫ్రమ్‌ హోం.. బాబోయ్‌ మాకొద్దు!

మరిన్ని వార్తలు